రైతు వేదికలకు పైసలు వస్తలే..పది నెలలుగా పెండింగ్..

  • ఆగిన రూ. 82.80 లక్షలు యాదాద్రి జిల్లాలో 92 వేదికలు 

యాదాద్రి, వెలుగు: రైతు వేదికల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫండ్స్​ 10  నెలలుగా పెండింగ్​లో పెట్టింది. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతులకు ఆధునిక సాగుపై నిరంతరంగా అవగాహన కల్పించడానికి రైతు వేదికలు నిర్మించామని సర్కారు చెబుతోంది. కానీ ఆ దిశగా చూడటంలేదనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలోని 92 క్లస్టర్లలో రైతు వేదికలు ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ఒక్కో వేదికకు ప్రతినెలా రూ. 9 వేల చొప్పున ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఈ సొమ్మును కరెంట్​ బిల్లు, స్టేషనరీ, మీటింగ్​ల కోసం ఖర్చు చేయాలని సూచించింది.  

నెలకు ఒక్కసారి మీటింగ్  నిర్వహించినా రూ. 9 వేలు సరిపోవని అగ్రికల్చర్​ స్టాఫ్​ అంటున్నారు. అయితే అవి కూడా రెగ్యులర్​గా రిలీజ్​ చేయడం లేదు. ఫండ్స్​ లేక కరెంట్​ బిల్లులు చెల్లించలేదు. గతేడాది రైతు వేదికలకు కరెంట్​ కనెక్షన్​ సైతం తొలగించారు. దీంతో 2022 ఏప్రిల్​ నుంచి ఆగస్టు వరకూ ఒక్కో వేదికకు రూ. 45 వేల చొప్పున ఐదు నెలల బిల్లులను అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ రిలీజ్​ చేసింది.

10 నెలలుగా పైసా లేదు.. 

గతేడాది చివరలో ఫండ్స్​ రిలీజ్​ చేసిన సర్కారు.. ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. గతేడాది సెప్టెంబర్​ నుంచి ఇప్పటి వరకు నిర్వహణ ఖర్చు రాలేదు. దీంతో నిర్వహణను పర్యవేక్షించే ఏఈవోలు ఇబ్బంది పడుతున్నారు. కరెంట్​ బిల్లుల విషయంలో మరీ ఒత్తిడి పెరుగుతోంది. గతంలో కనెక్షన్​ తొలగించినప్పుడు హయ్యర్​ ఆఫీసర్లు సీరియస్​ అయ్యారు. కరెంట్​ తొలగిస్తే మళ్లీ ఆ ఆఫీసర్లు సీరియస్​ అవుతారన్న ఉద్దేశంతో ఫండ్స్​ వచ్చినప్పుడు తీసుకోవచ్చని అగ్రికల్చర్​ స్టాఫ్​ కరెంట్​ బిల్లులను చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. పది నెలలుగా మీటింగ్​ ఖర్చులు, కరెంట్, స్టేషనరీ ఖర్చు భరించాల్సి రావడంతో అగ్రికల్చర్​ స్టాఫ్​ ఇబ్బంది పడుతున్నారు. 

ఒక్కో వేదికకు రూ. 90 వేల చొప్పున పది నెలలకు సంబంధించి రూ. 82.80 లక్షలు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రైతు వేదికలను కొన్నిచోట్ల  ఊరికి దూరంగా నిర్మిస్తే..  మరికొన్నింటిని లోతట్టు ప్రాంతాల్లో నిర్మించారు. దీంతో అక్కడికి రావడానికి రైతులు, అగ్రికల్చర్​ స్టాఫ్​  ఇబ్బంది పడుతున్నారు. జనసంచారం లేకపోవడంతో రైతు వేదికల్లోకి పాములు సైతం వస్తున్నాయి.  ఏదేమైనా రైతు వేదికలకు ఫండ్స్​ రిలీజ్​చేసి నిర్వహణ  సరిగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.