- అమరగిరి, సోమశిల డెవలప్మెంట్ను పట్టించుకోని సర్కార్
- నాలుగేళ్లుగా సర్వేలతో కాలయాపన
- అధికారిక హామీకి నాలుగేళ్లు కంప్లీట్
నాగర్ కర్నూల్, వెలుగు: కృష్ణా పరివాహకంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అమరగిరి, సోమశిల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కేటాయించలేదు. టూరిజం ప్లాన్ బడ్జెట్ జీతభత్యాలకు సరిపోతోంది. ఏమైనా మిగిలితే టూరిజం ప్రమోషన్ కోసం టూర్లపై ఖర్చు చేసుందుకు అలవాటు పడ్డ ఆఫీసర్లు నల్లమల అందాలను బయటి ప్రపంచానికి తెలియజేసి పర్యాటలకును ఆకర్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నాలుగేళ్ల కింద ఈప్రాంతంలో పర్యటించిన టూరిజం, ఫారెస్ట్ ఆఫీసర్లు వాటర్ అడ్వెంచర్స్, నేచురల్ రిసార్ట్స్, ఎకో టూరిజం స్పాట్‌గా డెవలప్ చేస్తామని ప్రకటించారు. వెంటనే సర్వే పనులు ప్రారంభిస్తామని చెప్పి నాలుగేళ్లు దాటింది. ఇప్పటికీ సర్వే పూర్తి చేసింది లేదు.. నయా పైసా విడుదల చేసిందీ లేదు. అమరగిరి, సోమశిల టూరిజం కేంద్రంగా డెవలప్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, బిజినెస్ పెరుగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.
హామీలన్నీ ఉత్త మాటలే..
ప్రకృతి అందాలకు నెలవైన అమరగిరి, సోమశిల ప్రాంతాలను అన్నిరంగాల్లో డెవలప్ చేస్తామని నాలుగేళ్ల కింద రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ ప్రకటించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్దన్ రెడ్డి 2019లో టూరిజం ఎండీ, డీఎఫ్‌వో శ్రీనివాస్‌తో కలిసి అమరగిరి, సోమశిల ఏరియాలో పర్యటించారు. మ్యాపులు ముందేసుకొని కృష్ణా నది తీరంలోనే టూరిజం డెవలప్మెంట్కు ప్లానింగ్ మొదలుపెట్టారు. టూరిజం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సైతం నల్లమల్ల అటవీ ప్రాంతాలు, కృష్ణా తీరప్రాంతాల్లో ఎకో టూరిజం డెవలప్ చేయాలని ఆర్డర్ వేశారని అధికారులు చెప్పారు. హైదరాబాద్,-నంద్యాల హైవే, కృష్ణా నదిపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ప్రకటించారు. అమరగిరిలో టెంపరరీ కాటేజీలు నిర్మించి వాటర్ అడ్వెంచర్‌కు అన్ని సౌలతులు కల్పిస్తామన్నారు. నల్లమల్లలోని వనమూలికలను సద్వినియోగం చేసుకునేలా ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తామని టూరిజం ఎండీ హామీ ఇచ్చారు. సోమశిల, అమరగిరి, సింగోటం ప్రాంతాలను కలిపి టూరిజం సర్య్కూట్‌గా డెవలప్ చేస్తామని ప్రకటించారు.
ఎన్నో ప్రత్యేకతలు..
కృష్ణాతీరంలో నల్లమల్ల అడవి మధ్యలో ఉన్న అమరగిరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంతో మొగులొత్తు, బొల్లారం, చీమలతిప్ప ప్రాంతాలకు దగ్గరగా ఉండే అమరగిరి ముంపునకు గురైంది. గ్రామ దేవతలు, వన దేవతలతో కలిసి ఎగువ మిట్ట ప్రాంతానికి వచ్చి ఇండ్లు, గుడిసెలు వేసుకుని గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఎర్రగట్టు బొల్లారం అటవీ ప్రాంతంలో ఉంటున్నారు. కృష్ణా నదిలో చేపలు, గుట్టలపై పంటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. పచ్చటి కొండల మద్య వంపులు తిరిగే కృష్ణమ్మ అందాలు తనివితీరా చూడాల్సిందే.
కొల్లాపూర్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరగిరి అభివృద్ధి చెందితే ఇక్కడి నుంచి అంకాళమ్మ కోట, మల్లయ్యసెల, అక్కమహాదేవి గుహలు, దీవి గ్రామం, చీమలతిప్ప వంటి సుందరమైన ప్రదేశాలు చూడవచ్చు.
అమరగిరిని డెవలప్ చేయాలి..
పాపికొండలను తలపించే కృష్ణమ్మ చెంత ఉన్న అమరగిరి ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్‌గా డెవలప్ చేయాలి. దీంతో మా గ్రామంలో చదువుకున్న యువకులకు ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు పెట్టే ఖర్చు, ఆదాయం రూపంలో ఏడాదిలోనే తిరిగి వస్తుంది.
- భరత్, అమరగిరి