తేమ నష్టం భరించేదెవరు?..ఆదేశాలే తప్ప చర్చలు జరపని ఆఫీసర్లు

  •      తడిసిన వడ్లు దింపుకోవాలంటున్న సర్కారు
  •      అలాగైతే తమకు నష్టమంటున్న మిల్లర్లు
  •      క్వింటాల్​కు 67 కిలోలు ఇవ్వడం సాధ్యం కాదంటున్న వ్యాపారులు
  •      ఆదేశాలే తప్ప చర్చలు జరపని ఆఫీసర్లు

నిజామాబాద్, వెలుగు: చెడగొట్టు వానలతో క్వాలిటీ దెబ్బతిన్న వడ్లను దింపుకోవాలని ఆఫీసర్లు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ వడ్లను ఆడించి ఎంత బియ్యం ఇవ్వాలనే విషయమై క్లారిటీ ఇవ్వడం లేదు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడిస్తే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం బియ్యం అందించడం సాధ్యపడదని, అలా చేస్తే తాము నష్టపోతామని మిల్లర్లు అంటున్నారు. ఈ విషయాన్ని పక్కనబెట్టి వడ్ల కొనుగోళ్లు, అన్​లోడింగ్ లో వేగం పెంచాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని ఒత్తిడి తేవడం సరికాదని మిల్లర్లు వాపోతున్నారు.

మిల్లింగ్​తర్వాత ఎంత బియ్యం ఇవ్వాలి..

సీఎంఆర్ (కస్టమ్​మిల్లింగ్) ​కింద ఎంత బియ్యం ఇవ్వాలనేది గవర్నమెంట్​నిర్ధేశిస్తుంది. వర్షాకాలంలో పండిన వడ్లను రా రైస్ (ముడి బియ్యం)గా పరిగణించి మిల్లర్​క్వింటాల్​కు 68 కిలోల చొప్పున బియ్యం పంపాలి. ఎండాకాలంలో పండిన వడ్లను బాయిల్డ్​రైస్​గా వినియోగిస్తారు. ఎండల తీవ్రతకు నూకల శాతం కాస్త ఎక్కువ ఉంటుంది. కాబట్టి క్వింటాల్​వడ్లకు 67 కిలోల బియ్యాన్ని మిల్లర్​విధిగా అందించాలి. సీఎంఆర్​చార్జీలతో పాటు తవుడు, పొట్టు మిల్లర్​కు మిగులుతుంది.
మిల్లర్​సొంతంగా వడ్లను కొని బియ్యంగా మార్చి మార్కెట్​చేయలేడు. ఇందుకు అనేక నిబంధనలు అడ్డొస్తాయి. ఏడాది పాటు కూలీలకు పని కల్పించి, మిల్లుకు తాళం వేయకుండా నడపాలంటే సీఎంఆర్​కింద వడ్లు సేకరించడం తప్పనిసరి. 

కొనుగోళ్లపై ప్రభావం..

నిజామాబాద్​జిల్లాలో గతేడాది ఎండాకాలంలో 6.35 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు కొన్నారు. ఈసారి 7.43 లక్షల మెట్రిక్​టన్నులు సేకరించాలని టార్గెట్​పెట్టుకున్నారు. అందుకనుగుణంగా 405 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.  మొత్తం 218  రైస్​మిల్లులు ఉండగా వాటిలో 123  రా మిల్లులు, 95 పారా బాయిల్డ్​రైస్​మిల్లులు ఉన్నాయి. నాణ్యత దెబ్బతిన్న వడ్లను బాయిల్డ్​మిల్లులకు మాత్రమే పంపాలి.  ఇప్పుడున్న వడ్లు దాదాపు అవే అయినందున బాయిల్డ్​మిల్లులకు లారీల రద్దీ పెరిగింది. కామారెడ్డి జిల్లాలో 3.49  లక్షల మెట్రిక్​ టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్​పెట్టుకొని, లక్ష టన్నులు మాత్రమే సేకరించారు. ఈ జిల్లాలోని 135 మిల్లులలో 36 బాయిల్డ్​మిల్లుల వద్ద లారీల తాకిడి పెరిగింది.  మిల్లర్ల నష్టంపై  చర్చ జరిపితే గానీ అన్​లోడింగ్​సమస్యకు పరిష్కారం 
లభించేలా లేదు.

వడ్ల నాణ్యతపై ఆధారం..

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లు సరిగా ఉంటేనే మిల్లర్​నిర్ణీత పరిమాణంలో సీఎంఆర్​బియ్యం ఇవ్వగలడు. మొన్నటి వానలకు వడ్లు చాలావరకు తడిచి, మొలకెత్తాయి. వీటిని మిల్లింగ్​చేసి క్వింటాల్​కు 67 కిలోల బియ్యం సీఎంఆర్​కింద ఇవ్వడం మిల్లర్లను ఇబ్బంది పెడుతోంది. అందుకే కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని అన్​లోడింగ్​చేసేందుకు వారు జంకుతున్నారు. లోడ్ బస్తాలు పరిశీలించి కాస్త ఫర్వాలేదనుకుంటే దింపుకుంటున్నారు.