15 ఏండ్లుగా ముంపు సమస్య పరిష్కరిస్తలే
కానాయపల్లి ఆర్ఆర్ కాలనీలో సౌలతులపై దృష్టి పెట్టని సర్కార్
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి ముంపువాసుల సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కాలువలు ఉన్నా నీరందక ఇబ్బంది పడుతున్న రైతులు ప్రభుత్య తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం భీమా ఫేస్–2ను మంజూరు చేసింది. కానాయపల్లి గ్రామంలోని ఇండ్లు, పొలాలు ముంపునకు గురి కాగా, ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మరికొన్ని డిమాండ్లతో ఇండ్లు ఖాళీ చేయకుండా, శంకర సముద్రం రిజర్వాయర్ లో పూర్తి స్థాయిలో నీటిని నింపకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పదేండ్లుగా కుడి, ఎడమ కాలువలకు సాగు నీరు పూర్తి స్థాయిలో అందటం లేదు.
ఎడమ కాలువకు బండ్ నిర్మించి వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలకు కొంతమేర సాగునీటిని తరలిస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండితేనే కుడి కాలువకు నీరు పారుతుంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో దాదాపు 30 వేల ఎకరాలకు సాగు నీరందని పరిస్థితి ఉంది. అవకాశం ఉన్నా పంటలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముంపు వాసులు పాత ఇండ్లలోనే ఉంటున్నారు. సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపడం లేదని వాపోతున్నారు.
మూడు నియోజకవర్గాల్లో ఆయకట్టు..
కృష్ణా జలాలను శంకర సముద్రం రిజర్వాయర్ లోకి తరలించి, అక్కడి నుంచి వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని 1.09 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అప్పట్లో ప్రభుత్వం ఈ స్కీం చేపట్టింది. వైఎస్ హయాంలో కానాయపల్లి రిజర్వాయర్(శంకర్ సముద్రం) నుంచి కాలువలు తవ్వించారు. వపపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాలకు ఎడమ కాలువ ద్వారా, దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కుడి కాలువ ద్వారా నీరందించాల్సి ఉంది. ముంపునకు గురవుతున్న కానాయపల్లి, కానాయపల్లి తాండలోని 1,084 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు స్థలం సేకరించి ఇండ్ల స్థలాలు కేటాయించారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పటినుంచి సమస్య పరిష్కారం కాలేదు. సమస్యలు పరిష్కారం చేసేంత వరకు గ్రామాన్ని ఖాళీ చేయమని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్తకోట మండలంలోని నిర్విన్, పాలెం కనిమెట్ట, పాత జంగమయ్యపల్లితో పాటు పెద్దమందడి నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు వచ్చే వానాకాలం వరకైనా నీరందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్ఆర్ కాలనీలో అన్నీ సమస్యలే..
వనపర్తి, కొత్తకోట ప్రధాన రహదారిపై కానాయపల్లి ముంపు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఆర్ఆర్ కాలనీలో సౌలతులు కల్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు. మరోపక్క నిర్వాసితుల కుటుంబాలలో 18 ఏండ్లు నిండిన వారికి కూడా ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తేనే గ్రామాన్ని ఖాళీ చేస్తామని పట్టుబడుతున్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఇటీవల నిర్వాసితులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు. ఆర్ఆర్ కాలనీని సందర్శించారు. సమస్యలు పరిష్కరిస్తామని, గ్రామాన్ని ఖాళీ చేయాలని సూచించారు. వచ్చే వానాకాలం రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు సహకరించాలని కోరారు.
పూర్తిస్థాయిలో నీళ్లివ్వాలి..
శంకర్ సముద్రం రిజర్వాయర్ నుంచి కుడి కాలువ కింద ఒక ఎకరానికి కూడా నీరు పారలేదు. దీనిపై ఎమ్మెల్యేను, అధికారులను కలిసినా పట్టించుకుంటలేరు. వచ్చే వాన కాలంలో నీరు ఇవ్వకుంటే ఆందోళన చేస్తాం.
- బాలరాజు, రైతు, కన్మనూరు
సమస్యలు పరిష్కరిస్తాం..
కానాయపల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాం. ఆర్ఆర్ కాలనీలో సమస్యలు పరిష్కరించి నెల రోజుల్లో ఇండ్ల స్థలాలు పంపిణీ చేస్తాం. 18 ఏండ్లు నిండిన వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంపై ప్రభుత్వానికి సిఫారసు చేశాం. గ్రామస్తులు సహకరించాలి.
- పద్మావతి, ఆర్డీవో, వనపర్తి