చేతులెత్తేసిన హార్టికల్చర్ అధికారులు
- మార్కెట్ లో ఇతర జిల్లాల కూరగాయలు
- కొండెక్కిన కూరగాయల ధరలు
వనపర్తి, వెలుగు : జిల్లాలో కూరగాయల సాగుకు ప్రభుత్వం ఏమాత్రం ప్రోత్సాహం అందించడం లేదు. కొన్నేండ్లుగా సబ్సిడీ ఎత్తివేయడంతో జిల్లాలో కేవలం 250 ఎకరాలకే కూరగాయల సాగు పరిమితమైంది. దీంతో పక్కరాష్ట్రాల నుంచి కూరగాయలను తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్లాలో గతంలో వంకాయ, బెండకాయ, దోసకాయ, బీరకాయలు, టమాటలతో పాటు మిర్చి పండించే వారు.
వీటిని వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్, షాద్ నగర్ మార్కెట్లల్లో అమ్మేవారు. ప్రస్తుతం కూరగాయలకు ధరలు పెరిగినా రైతులు తోటల పెంపకానికి ఆసక్తి చూపడం లేదు. కూరగాయల ధరలు నిలకడగా ఉండకపోవడం ప్రభుత్వం నుంచి రాయితీలు అందకపోవడంతో వీటి విస్తీర్ణం తగ్గింది.
కేవలం 250 ఎకరాల్లోనే..
వనపర్తి జిల్లాలో 5లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా కేవలం 250 ఎకరాల్లోనే రైతులు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. గతంలో హార్టికల్చర్ శాఖ వానాకాలం సీజన్ లో రైతులకు వివిధ రకాల కూరగాయల విత్తనాలను ఉచితంగా, కొంత సబ్సిడీపై అందించేవారు. ప్రస్తుతం ఈ పథకం రాష్ట్రంలో అమలు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం బెంగళూరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు.
ఇటీవల కిలో టమాట ధర రూ.120 కి చేరింది. కానీ ఇక్కడి రైతులు సాగు చేసినప్పుడు ధర కిలో రూ.5కు మించడం లేదు. కూరగాయల ధరలను సర్కారు నియంత్రించలేక పోతోంది.
రైతు బజారులు వెల వెల..
గతంలో రైతులు పండించిన కూరగాయలను వారే అమ్ముకునే విధంగా ప్రభుత్వం రైతు బజారులను ఏర్పాటు చేసింది. ఆయా పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంబడి రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు స్థలాలు కేటాయించింది. ప్రస్తుతం రైతు బజారుల జాడే కనిపించడం లేదు. కొన్ని చోట్ల వేసైడ్ మార్కెట్ లు ఉన్నా వాటిలో రైతులు లేక వెలవెల పోతున్నాయి. దళారులు, హోల్సేల్ వ్యాపారులు కుమ్మక్కై కూరగాయల ధరలను పెంచి ప్రజలను దోచుకుంటున్నారు.
వనపర్తి పట్టణం వెలుపల మర్రికుంట వద్ద వేసైడ్ మార్కెట్ నిర్మించినా అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. విదేశీ విత్తన కంపెనీ ఈ వే సైడ్ మార్కెట్ కు నిధులు కేటాయించగా ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. కాని ఇంతవరకు ఈ మార్కెట్ ను వినియోగంలోకి తీసుక రాలేదు.
హార్టికల్చర్ శాఖలో అన్ని ఖాళీలే...
హార్టికల్చర్ శాఖను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతి జిల్లాలో ఈ శాఖలో ఐదుగురి కంటే ఎక్కువ సిబ్బంది లేకపోవడంతో శాఖ పనితీరు నామ మాత్రంగా మారింది. తోటల పెంపకం పై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల విత్తనాలు అందుబాటులో లేవు
గతంలో కూరగాయల విత్తనాలను సన్న, చిన్న కారు రైతులకు ఉచితంగా అందించే వాళ్లం. ప్రస్తుతం విత్తనాలు అందుబాటులో లేవు. ఈజీఎస్ పథకం కింద ప్రభుత్వం కూరగాయలు సాగు చేసే రైతులకు వంద శాతం సబ్సిడీపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తోంది. ఒక్కో రైతు ఎకరం పొలంలో కూరగాయలు సాగుచేసుకుంటే డ్రిప్ పూర్తిగా అందిస్తాం. జిల్లాలో కూరగాయల సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ ను బట్టి వాటిని ఎంపిక చేసుకొని సాగు చేయాలి.
- సురేశ్, హార్టికల్చర్ ఆఫీసర్, వనపర్తి