ఏ దేశంలోనైనా మానవ వనరులకు మించిన సంపద ఉండదు. వాళ్ల ప్రాణాలను కాపాడుకుని, మంచి విద్య, వైద్యం అందిస్తే అభివృద్ధి, ఆర్థిక ప్రగతి సాధించడం పెద్ద పనేం కాదు. కానీ మన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారుకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. కరోనా బారినపడి పేదలు వైద్యం చేయించుకోలేక పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదు. కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఉచితంగా వైద్యం అందించే విషయంలో మానవత్వం చూపడం లేదు. మరోవైపు గాంధీ ఆస్పత్రి విజిట్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్ కేవలం ఎదో ఆర్భాటం చేసే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోందే కానీ, నిజంగా అక్కడి సౌలతుల కొరత, సిబ్బంది లేమిపై సీరియస్‌గా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అందుకు అవసరమైన చర్యలు, కేటాయింపులపై ఆ విజిట్ తర్వాత నిర్ణయం తీసుకోనుంటే ప్రజలకు భరోసా నిండేది. కానీ అంతా బాగుందని కలరిచ్చేందుకే ఆ సందర్శనకు వెళ్లారనిపిస్తోంది.
సీఎం కేసీఆర్ 2015లో ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ఆరేండ్ల తర్వాత ఇటీవలే గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులను విజిట్ చేశారు. కరోనా పేషెంట్లను పరామర్శించి, వాళ్ల బాగోగులు ఆరా తీశారు. సీఎం వస్తున్నారన్న భయమో, గౌరవమో తెలియదు కానీ అధికారులు ఈ హాస్పిటళ్లను మొత్తం శానిటైజేషన్ చేశారు. పేషెంట్లకు అన్ని సేవలు చక్కగా అందుతున్నాయని చూపించే ప్రయత్నంచేశారు. అదే సీఎం ఇంతకు ముందు కూడా అప్పుడప్పుడు సర్కారు దవాఖాన్లను విజిట్ చేస్తూ ఉంటే ఆస్పత్రుల పరిస్థితి కొంతైనా మెరుగ్గా ఉండేది. పేదోడికి ఎంతో కొంత మెరుగైన వైద్యం అందేది. విజిట్‌కు వెళ్లిన సీఎంకు ఇప్పటికైనా అక్కడ సౌలతులు అరకొరగా ఉన్నాయన్నది బుర్రకెక్కిందా లేదా అన్నదే అసలు ప్రశ్న. రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 23,724 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని విషయం అక్కడి స్టాఫ్ వినతులు విన్నప్పుడైనా గుర్తొచ్చిందా లేదా? గాంధీలో కనీస సౌకర్యాల లేక, వైద్య సిబ్బంది కొరత వల్లనే పేద ప్రజలు ప్రాణాలు వదిలారన్న విషయం ఇప్పటికైనా అర్థమైందనుకోవాల్నా లేదా? చిత్తశుద్ధి ఉండి గాంధీలో జూడాల సమస్యను పరిష్కరించి, ఈ రోజు వాళ్లు నిరసనలకు దిగే పరిస్థితి రాకుండా చేసుంటే ప్రజలకు కేసీఆర్ విజిట్‌తో భరోసా వచ్చేది.
టెంపరరీ స్టాఫ్‌తో నెట్టుకొస్తరా?
కరోనా కష్టకాలంలోనూ వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని తెలిసి కూడా వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదో సీఎం కేసీఆరే సమాధానం చెప్పాలి. టిమ్స్ ఆసుపత్రిలో 40 మంది కరోనా రోగులకు ఒక్క నర్సు ఉంటే.. మెరుగైన వైద్యం ఎలా అందుతుందో పెద్దసారుకే తెలవాలి. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, స్టాఫ్ నర్సులు సైతం గతంలో రోడ్డెక్కి ధర్నా చేశారు. అంతేకాదు నర్సుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రగతిభవన్ ముట్టడించినా ఫలితం లేకుండా పోయింది. కరోనా సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పుడు ఆదరా బాదరాగా కేవలం 700 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని తాత్కాలికంగా 2 నెలలు పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించడం తెలంగాణ సర్కారుకే సిగ్గుచేటు.
కోటీశ్వరులైనా గాంధీలోనే వైద్యం అన్నరు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న మొదట్లో.. ‘తెలంగాణలో అసలు కరోనానే లేదు. ఆ మహమ్మారి మన దరి చేరదు. వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా దాన్ని రాష్ర్టంలోకి రానియ్యకుండా చేస్తం’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రగల్భాలు పలికారు. తీరా తను చెప్పిందంతా రివర్స్ అయ్యేసరికి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. కరోనా సోకితే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే చాలని సీఎం సెలవిచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మన రాష్ట్రంలోనూ వైరస్ వ్యాప్తించి ప్రజల ప్రాణాలు పోతున్న టైమ్‌లో మరోసారి బూటకపు మాటలు చెప్పారు. పేదలు, కోటీశ్వరులు ఎవరికైనా గాంధీ ఆస్పత్రిలోనే కరోనా ట్రీట్‌మెంట్ అని ప్రకటించారు. కానీ అక్కడ సౌకర్యాలు లేక పేదల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పాపం కచ్చితంగా పాలకులదే.
సీఎం, మంత్రులూ కార్పొరేట్ ఆస్పత్రులకు..
తెలంగాణలో ఎంతటి వారికైనా కరోనా సోకితే గాంధీ ఆస్పత్రే దిక్కని చెప్పిన సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కార్పొరేట్ ఆస్పత్రి యశోదలో చికిత్స చేయించుకున్నారు. అంటే కేసీఆర్ దృష్టిలో పేద ప్రజలవి ప్రాణాలు కావా? ఓటేయ్యడానికి, జై కొట్టడానికే మాత్రమే జనం కావాలి. వారు చచ్చినా తనకేం పట్టదు. రోమ్ నగరం తగలపడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించిన చందంగా.. రాష్ట్రంలో ప్రజలు కరోనాకు బలవుతుంటే కేసీఆర్ మాత్రం 7 పరదాలు, 4 దర్వాజల కోటలో దర్జాగా పడుకున్నడు.
మంచి వైద్యం అందక పేదల ప్రాణాలు పోతున్నయ్
వైద్యం చేయించుకోలేక పేదలు ప్రాణాలు కోల్పోవద్దన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పేదోడికీ కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ ఖర్చులతో అందించారు. తెలంగాణ ఏర్పడ్డాక వైద్య రంగానికి కేటాయింపులు, సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అంతా భావించాం. కానీ కేసీఆర్ పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేశారు. ఆరోగ్యశ్రీ నుంచి వందలాది వ్యాధుల చికిత్సను తొలగించారు. దీంతో పేదలు నాణ్యమైన వైద్యం చేయించుకోలేక నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రతిపక్షాల ఒత్తిడితోనే ఆయుష్మాన్ భారత్..
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మా నాయకురాలు వైఎస్ షర్మిల కొన్ని నెలలుగా ఈ ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ప్రజాసంఘాల నేతలు ప్రతీ ఒక్కరూ కరోనా ట్రీట్మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రతిపక్షాలు ఒత్తిడితోనే సీఎం ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించారు.
ఆరోగ్య శ్రీతో 78 లక్షల కుటుంబాలకు లబ్ధి
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో 26.11 లక్షల కుటుంబాలు మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ అందనుంది. అదే ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలో 78 లక్షల పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 26 లక్షల కుటుంబాలకే ఫ్రీ ట్రీట్‌మెంట్ అందితే మిగిలిన 52 లక్షల కుటుంబాల పరిస్థితేంటి?
రెండు స్కీమ్స్ కలిపి అమలు చేయాలె
గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆరే ఆయుష్మాన్ భారత్.. ఆరోగ్యశ్రీ ముందు ఎందుకు పనికిరాదని, మనం ఇచ్చే కవరేజీలో అది ఏ మూలకూ రాదని చెప్పారు. మరి అలాంటప్పుడు నేడు కరోనా ట్రీట్‌మెంట్‌కు ఆయుష్మాన్ భారత్ మాత్రమే అమలు చేస్తామని చెప్పి, ఆరోగ్య శ్రీని పక్కనపెట్టడమేంటి? పైగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఎంపానల్మెంట్ ఉన్న ఆస్పత్రులు 12 మాత్రమేనని ఆయనకు తెలియదా? ఈ స్కీమ్‌ను కూడా ఆరోగ్య శ్రీ అమలవుతున్న 337 ఆస్పత్రులకు ఎంపానల్ చేయాలి. అలాగే ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా, ఆయుష్మాన్ భారత్‌లో 1,350 కవర్ అవుతున్నాయి. ఆరోగ్యశ్రీలో లేని 685 ప్రొసీజర్స్ ఆయుష్మాన్‌లో ఉండగా, ఆయుష్మాన్‌లో లేనివి ఆరోగ్యశ్రీలో 540 ఉన్నాయి. అందువల్ల ఈ రెండింటిని కలిపి అమలు చేస్తే పేద ప్రజలందరికీ 1,887 రకాల అనారోగ్య సమస్యలకు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పొందే అవకాశం కలుగుతుంది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మానవత్వంతో నిర్ణయం తీసుకోకపోతే పోరాటాలతో ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరిస్తున్నాం.
విజిట్ తర్వాత రివ్యూ చేసిన్రా?
గాంధీ, ఎంజీఎం హాస్పిటళ్లకు విజిట్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కనీసం వాటిలో సౌలతులను ఏమైనా పెంచాలా? స్టాఫ్ట్ లేక ఎదురవుతున్న ఇబ్బందులు వంటి అంశాలపై కనీసం రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. నిజంగా ఆయనకు ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏండ్లుగా కాంట్రాక్ట్ బేస్డ్‌గా పని చేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయడం, గాంధీలో జూడాల సమస్యలపై చర్చించి, వాళ్లు సమ్మె చేసే వరకూ పరిస్థితి రాకుండా చేసేవారు. మూడో వేవ్ వస్తదన్న హెచ్చరికల నేపథ్యంలో సర్కారు దవాఖాన్లలో ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు ఇతర సౌలతులు పెంచడంపై దృష్టి పెడితే మేలు.
- ఇందిరా శోభన్, వైఎస్ షర్మిల
ముఖ్య అనుచరురాలు