సుస్తి తెలంగాణలో  మస్తు డ్రామాలు

ఏడేండ్ల పాలనలో తొలిసారిగా సీఎం గాంధీ హాస్పిటల్ ను విజిట్ చేశారు. అదేదో ప్రపంచంలో ఏ నాయకుడూ చేయని ఘనకార్యంలా పింక్​ బ్యాచ్ పబ్లిసిటీ చేస్తున్నది. 
ఏడేండ్ల నుంచి కొన్ని వేల సార్లు సికింద్రాబాద్ మీదుగా ఫామ్ హౌస్​ కు వెళ్లి వస్తున్న కేసీఆర్.. ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ వైపు చూడలేదు. కనీసం తనకు కరోనా 
వచ్చినప్పుడన్నా గాంధీకి వెళ్లి టెస్టో, ట్రీట్ మెంటో తీసుకోలేదు. మీరు వస్తున్నారని ఎన్నడూ చేయకున్నా హాస్పిటల్ మొత్తంతోపాటు బయట రోడ్లు కూడా శానిటైజ్ చేశారు. సీఎం స్థాయి వ్యక్తి గాంధీ హాస్పిటల్ కు వెళ్లి రిక్తహస్తాలతో దండం పెట్టి, పరామర్శిస్తే ఏమొస్తది. వేలాది ప్రాణాలు పోతుంటే ఎంజీఎం కూడా ఇప్పుడే గుర్తొచ్చింది. 
గాంధీ, ఎంజీఎం సహా రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్ లో ఉన్న ఇబ్బందుల్ని పరిష్కరించడం సీఎం చేతిలో పని. ఉత్త చేత్తో దండాలు పెట్టడం కాదు.

మిగులు ఆదాయంతో ఏర్పడ్డ రాష్ట్రం కదా తమ జీవితాలు బాగుపడుతాయని జనం భావించారు. కానీ, ఒక్క కుటుంబం, వారి బంధుగణం బాగుపడ్డారు తప్ప.. సగటు వ్యక్తికి ఒరిగిందేమీ లేదు. రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి చూస్తే రాతిగుండె కూడా కరిగిపోతుంది. కానీ, కరోనా బాధితులు, వాళ్ల కుటుంబాల ఏడ్పులు ఫామ్ హౌస్​ గోడల్ని దాటి పోతలేవు. అందుకే సీఎం ప్రశాంతంగా ఫామ్ హౌస్​ లో హాయిగా తిరుగుతూ గడిపారు. పచ్చని పంట నుంచి వస్తున్న ఆక్సిజన్ ను ఆస్వాదిస్తూ గడిపిన సార్​కు రాష్ట్రంలో ఆక్సిజన్ దొరక్క అల్లాడిన కరోనా బాధితుల హాహాకారాలు వినిపించలేదు. తన పార్టీలో ఏదో ముసలం పుట్టబోతోందని పెద్దాయనకు కల వచ్చిందేమో? హడావుడిగా ఫామ్ హౌస్​ను వీడి క్యాంప్ ఆఫీసుకు వచ్చి ఒక మంత్రిని బర్తరఫ్ చేశారు. ఇంకా తోక జాడిస్తాడేమోనని ఆయన ఆస్తులపై కమిటీ వేశారు. ఆయన భూములన్నీ కబ్జాలని తేల్చే పనిలో పడ్డారు. ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చిన పెద్దాయనకు రాష్ట్రంలో కరోనా ఉధృతి కొద్దిగా కనిపించినట్లుంది. అందుకే కేటీఆర్ నేతృత్వంలో ఒక హెల్త్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య మంత్రిని బర్తరఫ్ చేశారు కాబట్టి ఆయన శాఖను వెంటనే కొడుక్కు బదలాయించారని ఎవరూ అనొద్దని అనుకున్నారో? లేక కరోనా టైంలో నలుగురు ఐఏఎస్ లతో ఈటల భూముల కబ్జాలు తేల్చేందుకు కమిటీ వేయడమే మీ ప్రాధాన్యతా అని హైకోర్టు మొట్టికాయలు వేసిందనో? నలుగురు ఐఏఎస్ లను జత చేసి కేటీఆర్ నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఇది ఏర్పడ్డాక దాని హెడ్ కేటీఆర్ రోజూ కాసేపు ట్విట్టర్ లో ఒకరిద్దరికి సాయం చేయడం, ఆ విషయాన్ని తన భజన మీడియాలో ప్రసారం చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు.

తప్పని పరిస్థితుల్లో ఆయుష్మాన్​లో చేరిన్రు

కరోనా కారణంగా రాష్ట్రంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.5 లక్షలకు పెంచాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఇప్పటిదాకా అమలు కాలేదు. ఇక పేదల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ ను 24 రాష్ట్రాలు అమలు చేస్తుంటే “అది వేస్టు. ఆరోగ్యశ్రీనే గొప్పది. ఈ విషయం ప్రధానికే మొహం మీద చెప్పిన”అని సీఎం అసెంబ్లీలో చెప్పారు. కానీ, ఏడాదిగా ప్రైవేటు హాస్పిటళ్ల ఫీజుల దోపిడీతో వేల కుటుంబాలు దివాళా తీశాయి. దీంతో ఆయుష్మాన్ భారత్ లో చేరాలన్న ఒత్తిడి పెరిగింది. ఇదే డిమాండ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష కు పిలుపునిచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాత్రికిరాత్రి ఆయుష్మాన్ భారత్ లో చేరుతున్నట్లు ప్రకటించింది.

కర్నాటకను చూసి నేర్చుకోవాలి

మన పక్కనే ఉన్న కర్నాటకలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలకు రూ.1,250 కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. లాక్ డౌన్ తో తక్షణం ప్రభావం పడే పూలు, కూరగాయల రైతులు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, మేస్త్రీలు, వాళ్లచేతికింద ఉండే లేబర్లకు, వీధి వ్యాపారులకు తక్షణ సాయంగా రూ.2 వేల నుంచి రూ.10 వేల దాకా ఆర్థిక సాయం చేస్తోంది. మన దగ్గర గాలి మాటలు, బుడగ బుజ్జగింపులు తప్ప పైసా సాయం లేదు. ఇక అతి చిన్న రాష్ట్రం గోవాలో అక్కడి ప్రైవేటు హాస్పిటళ్లన్నింటినీ సర్కార్ హ్యాండోవర్ చేసుకుంది. కరోనా బాధితులందరికీ ఉచితంగా ట్రీట్ మెంట్ చేస్తోంది. 

హాస్పిటళ్ల గురించి పట్టించుకోలే

హైదరాబాద్ నలుమూలలా నాలుగు పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కట్టిస్తామని సీఎం ప్రకటించారు. ఈ మాటలు విని రాష్ట్ర ప్రజలు, వైద్య నిపుణులు చాలా సంతోషించారు. కానీ, ఇప్పటిదాకా వీటికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇక జిల్లాల్లోని ఏరియా హాస్పిటళ్లను 100 బెడ్స్​తో అప్ గ్రేడ్ చేస్తామని ప్రకటించిన సీఎం.. తన గజ్వేల్ సెగ్మెంట్, అల్లుడు హరీశ్​రావు, కొడుకు కేటీఆర్ నియోజకవర్గాలైన సిద్దిపేట, సిరిసిల్లలో తప్ప మరెక్కడా అప్ గ్రేడ్ చేయలేదు. ప్రతి పీహెచ్ సీని పూర్తిస్థాయి మౌలిక వసతులున్న ఇన్ పేషెంట్ హాస్పిటళ్లుగా మారుస్తామని చెప్పారు. కానీ వాటికి కనీసం వీల్ చైర్స్, స్ట్రెచర్స్ కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన నిమ్స్ ను తెలంగాణ వచ్చాక నిర్వీర్యం చేశారు. ఇక ఉస్మానియా హాస్పిటల్ పాత బిల్డింగ్​ను కూల్చి కొత్తది కడతామంటే.. హెరిటేజ్ బిల్డింగ్స్ ను కూల్చొద్దని వ్యతిరేకత రావడంతో ఆ హాస్పిటల్ పైనే ప్రభుత్వం పగబట్టింది. ఇక గచ్చిబౌలిలో స్టార్ట్ చేసిన టిమ్స్ ఎటూ కాకుండా పోయింది. నిజానికి ముఖ్యమంత్రి ఆ హాస్పిటల్ గురించి ఇచ్చిన బిల్డప్ తో రాష్ట్రం నలుమూలల నుంచి కరోనా పేషెంట్లు భారీగా వస్తున్నారు. కానీ బెడ్స్ ఖాళీగా లేవని గేటుకు తాళం వేసిన పరిస్థితి. 13 ఫ్లోర్లలో 1,250 బెడ్స్ తో టిమ్స్ సేవలు అందించబోతోందని గతేడాది ప్రారంభించారు. కానీ, 5 ఫ్లోర్లలో మాత్రమే పేషెంట్లను అడ్మిట్ చేస్తున్నారు. తగిన సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం.

డాక్టర్లు, హెల్త్​ సిబ్బంది అడ్డా కూలీలు అనుకున్నరా?

టిమ్స్ ఏర్పాటు చేసినప్పుడు కొన్ని నెలల కోసమే కాంట్రాక్టు పద్ధతిన వైద్య సిబ్బంది కావాలని నోటిఫికేషన్ వేస్తే అభ్యర్థులు రాలేదు. కొన్ని నెలల దాకా అక్కడ సిబ్బందిలేరు. తాజాగా మూడు నెలల కాలవ్యవధి కోసం 50 వేల వైద్య సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ వేశారు. ఈ కరోనా సీజన్ లో మూడే నెలల కోసం ఎవరొస్తారు. పైగా ఏండ్ల తరబడి చేస్తున్న వాళ్లకే జీతాలిస్తలేరు. పైగా కరోనా సేవల్లో వాళ్లకు ఏమైనా జరిగితే భరోసా ఏది. రమ్మన్నప్పుడు రావడానికి, 3 నెలలు కాగానే పోవడానికి వాళ్లేమైనా అడ్డా కూలీలు అనుకున్నారా?

రెగ్యులర్​ రిక్రూట్​మెంట్లే లేవు

తెలంగాణ వచ్చాక రెగ్యులర్ బేసిస్ పై వైద్య శాఖలో రిక్రూట్​మెంట్లే లేవు. 2017లో 3,311 నర్సింగ్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ వేసింది. అది ఇప్పటిదాకా పూర్తి కాలేదు. కొందరు అభ్యర్థులు కోర్టుకెళ్లడం వల్లనే జాప్యం కావచ్చు. కానీ కోర్టులో ప్రభుత్వ వాదన వీక్ గా ఉండటం చూస్తే.. ఎంత కాలయాపన జరిగితే అంత మంచిదన్నట్లు ఉంది. చివరికి కోర్టులో కేసు అయిపోయినా.. ఇంకా రిక్రూట్​మెంట్ ప్రాసెస్ పూర్తి కాలేదు. గాంధీ హాస్పిటల్ స్టాఫ్ తో సీఎం మాట్లాడారు కదా. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏజెన్సీలు సరిగ్గా జీతాలిస్తలేదని ఏండ్ల తరబడి మొత్తుకుంటున్నారు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ పరిస్థితీ అదే. 2, 3 నెలలుగా జీతాలు లేవు. పోయినేడాది కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు 10% ఇన్​సెంటివ్ ఇస్తామని ప్రకటించారు. ఒక్క నెల ఇచ్చి మానేశారు. కరోనాతో ఎంతో మంది టెక్నీషియన్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వాళ్లు చనిపోయారు. వాళ్ల కుటుంబాలను ఏవిధంగా ఆదుకున్నారు.

స్నో, పౌడర్ల మేకప్ కిట్ ఇస్తే సరిపోతదా?

జనాలకు సుస్తి చేస్తే నాలుగు గోళీలు, ఒక ఇంజక్షన్ ఇప్పించే ఏర్పాటు లేదు కానీ, కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు మరో ఆరు వేలు కలిపి ‘కేసీఆర్ కిట్’పేరుతో స్నో, పౌడర్, తలనూనె ఇచ్చి దేశంలో ఎవరూ ఇవ్వనట్లు డబ్బాలు కొట్టుకుంటున్నారు. మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని కాస్తా అప్పులపాలు చేసి పేదలకు ఒక ఇంజెక్షన్ కొనిచ్చేందుకు కూడా డబ్బులు లేని స్థితికి తెచ్చారు. పైగా దేశంలోనే నంబర్ వన్, ప్రపంచంలోనే నంబర్ వన్ అంటూ పిట్టలదొర కహానీలు చెబుతున్నారు. రాజ్యాన్ని ముంచి, నియంతృత్వ పాలనతో పెద్ద పెద్ద ఖజానాలను సమకూర్చుకున్న రాజవంశాలేవీ శాశ్వతంగా నిలబడలేదు. కానీ, ప్రజా శ్రేయస్సు కోసం శ్రమించిన వాళ్ల చరిత్ర కలకాలం నిలబడింది. లక్ష పుస్తకాలు చదివిన పెద్ద మనిషికి ఈ విషయం తెలియదా?

మీరు చేయాల్సింది సమస్యల పరిష్కారం

సీఎంగా మీరు చేయాల్సింది సమస్యల పరిష్కారం. కానీ గంటసేపు గాంధీ హాస్పిటల్ కు పోయి షో చేస్తారా? అక్కడున్న డాక్టర్లు, సిబ్బంది పీపీఈ కిట్ వేసుకుంటే.. మీరు మాస్క్ తో పోయి హీరోయిజం చూపించాలనుకున్నారా? పీపీఈ కిట్ వేసుకోకుండా సమాజానికి ఏం చెప్పాలనుకున్నారు. నిజంగా హాస్పిటల్ ను విజిట్ చేయాలనుకుంటే అకస్మిక తనిఖీ చేయాలె. ముందే చెప్పి, హాస్పిటల్ మొత్తం శానిటైజ్ చేసి, మిమ్మల్ని ప్రశ్నిస్తారనుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పేషెంట్లకు ఎన్నడూ లేనటువంటి మంచి భోజనం తెప్పించి అధికారులు పెద్ద డ్రామా చేశారు. మీరు అక్కడికి పోయి అంతకంటే పెద్ద డ్రామా చేశారు.

గేటు ముందే ప్రాణాలు పోతున్నయ్​

గాంధీకి పోతే బెడ్స్ లేవని అడ్మిట్ చేసుకోవట్లేదు. రోజూ వందల మందిని వెనక్కి పంపిస్తున్నారు. మొన్నటికి మొన్న నాచారం మల్లాపూర్ కు చెందిన పావని అనే 22 ఏండ్ల గర్భిణి గాంధీకి పోతే కింగ్ కోఠీకి పంపారు. అక్కడ కూడా అడ్మిట్ చేసుకోకపోతే ఆమె అంబులెన్స్ లోనే జీవి ఇడిచింది. ఆమె మరణానికి ఈ సీఎం బాధ్యుడు కాదా? గాంధీ హాస్పిటల్ ను సీఎం సందర్శించే టైంలో రామాంతాపూర్ కు చెందిన విక్టోరియా అనే మహిళ గాంధీ గేటు దగ్గరే ప్రాణం విడిచింది. గంటల తరబడి గేటు దగ్గర వెయిట్ చేసినా లోపలికి పంపలేదు. బంధువులు లొల్లి పెడితే సీఎం పోయాక పేషెంట్ ను చూసి చనిపోయిందని చెప్పారట.

తెలంగాణ వర్సెస్​ యూపీ

వైద్య రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు చూస్తే ప్రజారోగ్యంపై ఈ సర్కార్ కు ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతుంది. 2015-16లో హెల్త్​కు 4.34%, 2017-18 లో 3.99%, 2020-21లో 3.38% కేటాయింపులు ఉండగా.. తాజాగా 2021-22లో 2.75% మాత్రమే కేటాయించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మా లాంటి స్కీంలు ఉన్నాయా? అని పదేపదే టీఆర్ఎస్ నేతలు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ సర్కార్ 2021-22లో వైద్య శాఖకు 6.3% నిధులు కేటాయించింది. 2019-20లో 5.3%, 2020-21లో 5.5% కేటాయించింది. ఇవి చూస్తే హెల్త్ సెక్టార్ కు యూపీ ఏటా కేటాయింపులు పెంచితే.. మన రాష్ట్రం తగ్గిస్తూ వస్తోంది.
- సంగప్ప జెనవాడే,
బీజేపీ నాయకుడు