ఒక్క టైగర్​కూడా లేని కవ్వాల్​కే పైసలన్నీ...

ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు : ఒక్క పులి లేని కవ్వాల్​ రిజర్వ్​ ఫారెస్ట్​ఏరియాలో రూ.కోట్లు గుమ్మరిస్తున్న ప్రభుత్వం అసలు పులులు తిరుగుతున్న ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. పులులకు నిలయమైన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగ జ్ నగర్ టైగర్ కారిడార్ ను లెక్క చేయడం లేదు. కాగజ్ నగర్ డివిజన్ లో 75 శాతం అడవి ఉండగా, 25 శాతం ఆసిఫాబాద్ డివిజన్ లో ఉంది. ఇక్కడ రెండంకెల సంఖ్యలో పులులున్నా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి , లేని పులులను సంరక్షిస్తున్నామంటూ కవ్వాల్ కు హై ప్రయారిటీ ఇస్తోంది.

పులులకు డెన్ ..అయినా..  

ఒకప్పుడు అడపాదడపా ఒకటి రెండు పులులు కనిపించే కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ ..ఇప్పుడు వాటికి డెన్ గా మారింది. ఫాల్గుణ అనే పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత సంఖ్య గణనీయంగా పెరిగింది. మన రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలోని తడోబా అందేరి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​నుంచి ప్రాణహిత, వార్ధా నదుల గుండా కాగజ్ నగర్ కారిడార్ లోని ప్రవేశిస్తున్న పులులు ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. కాగజ్​నగర్ ​ఫారెస్ట్​ను నేషనల్​ టైగర్​ కన్జర్వేటివ్​అథారిటీ కూడా గుర్తించింది. వారం కింద ఇదే ప్రాంతంలో ఎన్టీసీఏ ఆఫీసర్లు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి టైగర్ మానిటరింగ్ కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పుడిక్కడ 13 వరకు పులులున్నాయి. అయితే వీటికి ఆహారం కోసం శాఖాహార జంతువుల సంఖ్యను పెంచడం, పులులు తిరిగే ప్రాంతాల్లో వెదురు కట్​ చేయకుండా చూడడం, ఇతర పనులకు నిధులు లేకపోవడంతో ఫారెస్ట్​ ఆఫీసర్లు ఏమీ చేయలేకపోతున్నారు.     

కవ్వాల్​కే అన్నీ...ఆసిఫాబాద్​కు అరకొరే  

జిల్లాలోని ఫారెస్ట్​ను మూడేండ్ల కింద టైగర్ కారిడార్ గా గుర్తించినా నిధులు వెచ్చించిన దాఖలాలు లేవు. గతంలో ప్రిన్సిపాల్​ చీఫ్​ కన్జర్వేటర్ ​ఆఫ్​  ఫారెస్ట్​(పీసీసీఎఫ్) గా ఉన్నా పీకే ఝా పర్యటించి రూ.5 కోట్లు నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. కొద్ది కాలానికే ఆయన రిటైర్ కావడంతో నిధుల సంగతి పక్కకు పోయింది. తర్వాత రెండుసార్లు బర్డ్ వాక్ ఫెస్టివల్ సందర్భంగా పీసీసీఎఫ్ శోభతో పాటు అధికారులంతా వచ్చి పులులున్న ప్రాంతం గురించి పొగిడారే తప్పా పైసా కేటాయించలేదు. దీంతో కాంపా (కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ​ఫండ్ ​మేనేజ్​మెంట్ ​అండ్ ​ప్లానింగ్​అథారిటీ) నిధుల మీదే ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. ఉద్యోగుల జీతాలు, ప్లాంటేషన్, ఇతర ఖర్చులకు మొత్తం కలిపి ఏడాదికి రూ.15 కోట్లు ఇస్తుండడంతో ఎటూ సరిపోవడం లేదు. మంచిర్యాల జిల్లా జన్నారం దగ్గర ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​కు మాత్రం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారు. ఇక్కడ లేని పులుల సంరక్షణ కోసం పాట్లు పడుతున్నారు. కవ్వాల్​పరిధిలో గ్రామాలన్నీ ఖాళీ చేయించారు. అయినా ఒక్క పులి రాలేదు. కవ్వాల్ ​రిజర్వ్​ ఫారెస్ట్ కు, ఆసిఫాబాద్​ అడవులకు మధ్యలో సింగరేణి బొగ్గు గనులు ఉండడం, తవ్వకాలతో పులులు కవ్వాల్​ వెళ్లలేకపోతున్నాయి. 

ఏకో టూరిజం మీద శ్రద్ధ ఏది?  

కుమ్రం భీమ్​ జిల్లాలో పూర్తిగా గడ్డి నేలలు, చిత్తడి నేలలున్నాయి. వెదురుతో పాటు విలువైన టేకు చెట్లు ఇక్కడి అడవుల్లో కనిపిస్తాయి. పులులతో పాటు చిరుతలు, గుడ్డేలుగు, జింకలు, దుప్పులతో పాటు 180 వరకు పక్షి జాతులు జీవిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుగా ప్రాణహిత, పెద్దవాగు, వార్ధా  నదులు ప్రవహిస్తుండడంతో నీటి కొరత అనేదే లేదు. ఇన్ని ఉన్నా ఏకో టూరిజం మీద అటవీ శాఖ, ప్రభుత్వం దృష్టి పెట్టింది లేదు. అరుదైన వృక్ష శిలాజాలు, రాబంధులున్నా వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. టూరిజం ప్రాంతాలుగా డెవలప్​ చేస్తే ఆదాయంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి దొరికే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. 

మహారాష్ట్రలో 15 లక్షలు..ఇక్కడ రూ.5 లక్షలే..

పులుల సంచారం ఉన్న చోట రైతుల చేన్లు, పొలాలు ఉంటాయి. పులి దాడి చేసి ఎవరైనా చనిపోతే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా అంధేరి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులి దాడిలో చనిపోతే ఒక్కొక్కరికి రూ.15 లక్షల పరిహారంతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా సగం మొదట ఇచ్చి, మరో సగం ఫిక్సుడ్​ డిపాజిట్​ చేస్తున్నారు. తాత్కాలిక వాచర్ గా జాబ్​ ఇస్తున్నా సరిపడా వేతనం ఇవ్వడం లేదు.  

జనాలకు అవగాహన ఏది? 

జిల్లాలో ఆదివాసీ, గిరిజన ప్రజలు నివాసముంటారు. వీళ్లంతా అడవిని నమ్ముకొని బతుకుతున్నారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పెరిగి జనాల ప్రాణాలు పోతుండగా అవగాహన కల్పించడంలో ఫారెస్ట్​ అధికారులు విఫలమవుతున్నారు. పులిని కాపాడే ప్రయత్నం చేయడం మంచిదే అయినా మనుషుల గురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి..  

కవ్వాల్ ఫారెస్టుకు రాని పులులు... 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం కేంద్రంగా 2012లో కవ్వాల్ టైగర్ జోన్​ఏర్పాటు చేశారు. 892.23 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా, 1119.68 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియా గుర్తించారు. ఈ ఫారెస్టును పులుల ఆవాసయోగ్యంగా డెవలప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.4 కోట్ల బడ్జెట్ కేటాయిస్తోంది. ఇందులో పులుల  కోసమే రూ.కోటిన్నర వెచ్చిస్తున్నారు. ఇప్పటివరకు రూ.40 కోట్లు రాగా, ఇందులో రూ.15 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదు. శాఖాహార జంతువుల సంతతి పెంపుకోసం గడ్డి క్షేత్రాలు, నీటి వసతి కోసం సాసర్పిట్స్, కుంటలు, చె క్​డ్యామ్​లు నిర్మించారు. కవ్వాల్​కు తడోబా, తిప్పేశ్వర్, ఇంద్రావతి రిజర్వు ఫారెస్టుల నుంచి పులులు వస్తాయని భావించారు.  కానీ ఇక్కడికి ఒక్క పులి కూడా రాలేదు. అడపాదడపా వచ్చినా వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇందుకు కారణాలను ఆఫీసర్లు కనుక్కోలేకపోతున్నారు.

రెండు నెలల్లో సఫారీ రైడ్​

జిల్లాలో ఏకో టూరిజంపై ప్రణాళికలు రూపొందించాం. గవర్నమెంట్ కు రిపోర్ట్​ పంపించాం. రెండు నెలల్లో కాగజ్ నగర్ ఫారెస్ట్ లో సఫారి రైడ్​ప్రారంభించాలని చూస్తున్నాం. అలాగే పులుల సంఖ్య పెరగడంతో వాటి రక్షణపై దృష్టి పెట్టాం. ప్రజలకు పులి నుంచి హాని జరగకుండా చూస్తున్నాం.  - దినేశ్​కుమార్, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్