పోడు వ్యవసాయం, ఆదివాసీలపై ప్రభుత్వం దాష్టీకం

పోడు వ్యవసాయం, ఆదివాసీల మీద ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నది. అన్యాయంగా వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఆదివాసీలకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖలా లేదు. ‘2006 అటవీ హక్కుల చట్టం’ ప్రకారం.. వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కుల పత్రాలు ఇవ్వాల్సింది పోయి.. హరితహారం పేరిట మొక్కలు నాటాలని దౌర్జన్యం చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పోడు రైతులకు, ఫారెస్ట్​ సిబ్బంది మధ్య అనేక సార్లు ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. నిరుపేద ఆదివాసీలను, గిరిజనులను ఇష్టం వచ్చినట్లు కొట్టడం, ఆసుపత్రిపాలు చేయడం, పసి పిల్లల తల్లులని కూడా చూడకుండా కేసులు పెట్టి  జైలుపాలు చేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వ ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారు. వారిపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. గిరిజనుల ఆందోళనలను, హక్కుల పోరాటాలను అటవీ అధికారుల మీద దాడులుగా, భూ ఆక్రమణలుగా చిత్రీకరిస్తున్నారు. 

దరఖాస్తులు తీసుకొని పక్కకు..
2021 నవంబర్ 8 నుంచి డిసెంబర్31 దాకా భూమి హక్కు పత్రాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్నది. ఒకసారి పరిష్కారం పేరిట పట్టాలు ఇస్తామన్నారు. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేశారు. ఇది జరిగి ఆరు నెలలు దాటినా పట్టాల ఊసే లేదు. ఆయా జిల్లాల్లో పోడు సాగు భూమిని కలుపుకుని కందకాలు తవ్వేశారు. రాష్ట్రంలో12 లక్షల ఎకరాలకు సంబంధించి 4300 గూడెంలకు సంబంధించిన 2450 గ్రామాల నుంచి 3,40,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే వీటి పరిశీలన ఇంకా జరగలేదు. ఎందుకంటే ఇంకా పట్టాల పంపిణీ కాలేదు. సిర్పూర్ నియోజక వర్గంలోని సార్సలా గ్రామంలో గతంలో జరిగిన ఆందోళన, ఘర్షణల నేపథ్యంలో అన్యాయంగా ఆదివాసీల మీద, వారికి మద్దతుగా నిలబడిన వారి మీద కేసులు పెట్టి జైలులో పెట్టారు. తీవ్ర నిర్భంధం తర్వాత అసెంబ్లీ లో స్వయంగా సీఎం కేసీఆర్ తాను స్వయంగా సమస్యను జిల్లాల్లో పర్యటించి పరిష్కరిస్తానన్నారు. ఆదివాసీల వైపు నిలబడి వారి హక్కుల కోసం అడుగుతున్నందుకు, పోరాడుతున్నందుకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను అభినందించారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2006 లో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సు లను అమలు చేసి ఉంటే బాగుండేది. ప్రస్తుతం ఈ సమస్య ఉండేదే కాదు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 30,40 ఏండ్ల నుంచి లేని సమస్యలు అటవీశాఖ వాదనల వల్ల 2014 నుంచి బాగా పెరిగాయి. అటవీ శాఖ అనుమతులు లేవంటూ రోడ్డు పనులు కూడా ఆపే పరిస్థితి వచ్చింది. 

పోడు భూములే లక్ష్యంగా..
దిందా -– చింతల మానేపల్లి మధ్యన 70 మీటర్ల బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి లేదు.ఈ వాగు దాటి వెళుతున్న సందర్భంలో ఓ ఎంబీఏ స్టూడెంట్​ చనిపోయాడు.  కంపా నిధులతో ఏక కాలంలో 78 కిలోమీటర్ల రోడ్డు వేశారు. వందల చెట్లను నరికారు. దీనికి ఎవరు అనుమతి ఇచ్చారు? సార్సాల ఘటన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఓ మంత్రి ఉన్నా..నేటికీ సమస్యను పరిష్కరించలేదు. 100 ఎకరాలకు ఇక్కడ పట్టాలు ఉన్నాయి. వారికి పాస్ బుక్స్ కూడా వచ్చాయి. రైతు బంధు వస్తున్నది. దీనికి ట్రెంచ్ కొట్టారు. నిజానికి చెట్లు పెంచాలంటే.. ఇక్కడ‘డీ’ గ్రేడ్ ఏరియా భూములు వేలాది ఎకరాలు ఉన్నాయి. కానీ పాలకులు అటు చూడరు.. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసుల, గిరిజనుల భూములే వారికి కనిపిస్తాయి. వారే అటవీ శాఖకు టార్గెట్.. పోలీసుల సాయంతో వారిపై దాడులు చేస్తారు. కనీసం మనుషులుగా కూడా చూడరు. బలవంతంగా పోడు భూముల నుంచి తరుముతారు. అటవీ ఆక్రమణలు పెరిగింది వాస్తవం కాదా? వేల ఎకరాల్లో అడవిని నరికింది ఎవరు? అసలు ఇప్పటి దాకా నాటిన మొక్కలెన్ని? అందుకు కేటాయించిన నిధులెన్ని ?క్షేత్రస్థాయిలో చెక్ చేస్తే కానీ నిజాలు బయటపడవు. నిజానికి ఈ రోజు అటవీ శాఖ తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజనుల మీద పోడు వ్యవసాయం, అక్రమంగా అటవీ భూముల అక్రమణల పేరిట చేస్తున్న దాడులు, కేసులు వల్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తోంది. వరుస సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలె.

జల్..​ జంగల్..​ జమీన్​ స్ఫూర్తితో..
రాష్ట్ర సర్కారు ఇప్పటికైనా పోడు సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. ఆ భూములకు పట్టాలు ఇచ్చి ఆదివాసీలకు వాటిపై సర్వ హక్కులు కల్పించాలి. పోడు మాటున అధికారుల అండదండలతో అడవిని నరికి రియల్ వ్యాపారం చేస్తున్న కబ్జాదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకుని మొక్కలు నాటాలి. ముందు ఆ కబ్జాల లెక్కలు తీయాలి. లేదంటే.. జల్, జమీన్, జంగల్ ఉద్యమ స్ఫూర్తి తో మరో పోరు, ఉద్యమం తప్పేలా లేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో ఆదివాసీ మహిళలను వారి బిడ్డలకు దూరం చేసి జైలులో నిర్బంధించడం దారుణం. స్థలాన్ని ఖాళీ చేయించే క్రమంలో ఫారెస్ట్ ​సిబ్బంది ప్రవర్తించిన తీరు ఆక్షేపణీయం. అక్కడ నేటికీ ఉద్యమం కొనసాగుతున్నది. 2002 నుంచి వారు అక్కడ భూమి మీద ఉన్నారు. ప్రభుత్వం 2014 కు ముందు ఉన్నవారికి భూమి హక్కు పత్రాలు, పట్టాలు ఇస్తానని చెప్పిన మాటను నిలుపుకుంటే అసలక్కడ సమస్యే ఉండేది కాదు.
- ఎండీ మునీర్,సీనియర్​ జర్నలిస్ట్​