- కుడి, ఎడమ కాల్వలను పొడిగించేందుకు సర్వే
- కొత్తగా 5వేల ఎకరాలకు నీరందించే యోచన
- ఇప్పటికే 5వేల ఎకరాలకు అందుతున్న సాగునీరు
- పదేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం
ఖమ్మం/ మధిర, వెలుగు : మధిర నియోజకవర్గంలోని జాలిమూడి ఆనకట్టను డెవలప్ చేసి, మరింత ఆయకట్టు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఆనకట్టను పట్టించుకోక పోవడంతో చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో పాటు రిపేర్లు కూడా పెరిగాయి. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవ తీసుకొని, ఈ ఆనకట్టను డెవలప్ చేయాలని అధికారులకు ఆదేశించారు. మధిర, బోనకల్ మండలాల్లో ఇప్పటికే జాలిమూడి కాల్వల ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా, ఇప్పుడు అదనంగా మరో 5 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలను ఏ మార్గంలో పెంచితే.. చెరువులు నింపే అవకాశం ఉంటుందన్న విషయంపై సర్వే చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నారు. గత పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆనకట్టకు, కాల్వలకు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. ఇక భట్టి ఆదేశాలతో పేరుకుపోయిన పూడికను తొలగించడం, కాల్వల పటిష్టంపైనా అధికారులు దృష్టిపెట్టారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2010, 11 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వైరా నదిపై జాలిమూడి దగ్గర ఆనకట్టతో పాటు కుడి, ఎడమ కాల్వలను రూ.49 కోట్లతో పూర్తి చేశారు. మధిర, బోనకల్ మండలాల్లో 4900 ఎకరాలు దీని కింద సాగు అవుతుండగా, రెండు మండలాల్లో తాగునీటికి, భూగర్భ జలాలు పెరిగేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ప్రాజెక్టు కెపాసిటీ 24.72 మిలియన్ క్యూబిక్ ఫీట్ గా ఉంది. ప్రాజెక్టుతోపాటు కుడి, ఎడమ కాలువలకు గండ్లు పడడంతో పాటు, శిల్టు పేరకపోవడంతో ఆయా కాలువల్లో సక్రమంగా నీరు పారడం లేదు.
దీంతో పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. ఈ పరిస్థితులతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చొరవతో మంజూరు అయిన ప్రాజెక్టును బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లపాటు నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు మళ్లీ డిప్యూటీ సీఎం హోదాలో భట్టి ప్రాజెక్టు ఆధునీకరణకు ప్లాన్ చేశారు. దీంతో సంబంధిత అధికారులు ఆ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ కాల్వ కింద మధిర నియోజకవర్గంలో టెయిల్ ఎండ్ ఆయకట్టు ఉండడంతో ప్రతి యేటా ఆ ఆయకట్టుకు సాగు నీరందడం కొంత సమస్యగానే ఉంటోంది.
ఈ ఏడాది సాగర్ లో నీళ్లులేని కారణంగా అసలు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు తక్కువగా ఉన్నా ఇప్పటికీ జాలిమూడి ప్రాజెక్టులో మాత్రం వాటర్ ఉంది. ఆ నీటిని ఎడమ కాల్వ పొడిగింపు ద్వారా మధిర చెరువు, దెందుకూరు, ఖమ్మంపాడు చెర్వు నింపాలని ఆఫీసర్లు ఆలోచన చేస్తున్నారు. కుడి కాల్వ పొడిగింపు ద్వారా మడుపల్లి, రాయపట్నం, దేశినేనిపాలెం చెరువులు నింపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు కాల్వలను ఎక్స్ టెన్షన్ చేస్తే ఆయా మండలాల్లో కరువు పరిస్థితితుల్లో కూడా 5 వేల ఎకరాలకు సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత భూసేకరణ, ప్రాజెక్టు ఖర్చు అంచనాపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు.