ఎందెందు వెతికినా.. అందందే ఉండు భారతీయులు అన్నట్లు.. భూ మండలంలోని నివాస యోగ్యం అన్న ప్రతి చోట భారతీయులు ఉండటం కామన్. మొన్నటికి మొన్న ఆఫ్టనిస్తాన్ నుంచి.. నిన్నటికి నిన్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మరీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అంతర్ యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న సూడాన్ దేశం నుంచి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ కావేరీ పేరుతో సూడాన్ దేశంలోని భారతీయులను ఎయిర్ లిఫ్ట్ చేయబోతున్నారు. సూడాన్ దేశంలో 4 వేల మంది మనోళ్లు ఉండగా.. ఇప్పటికే 500 మందిని సూడాన్ దేశంలోని వివిధ విమానాశ్రయాలకు చేరుకున్నారు.
పరస్పర దాడులతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న సూడాన్ నుంచి భారతీయ పౌరుల్ని సురక్షితంగా స్వదేశానికి తరలించే చర్యలు ఊపందుకుంటున్నాయి. ఏమాత్రం సానుకూలత లభించినా భారతీయుల్ని తీసుకువచ్చేందుకు వీలుగా సి-130జె రకం సైనిక రవాణా విమానాలు రెండింటిని జెడ్డాలో సిద్ధంగా ఉంచారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సుమేధ నౌకను సూడాన్ ఓడరేవుకు చేర్చారు. విమానాశ్రయాలన్నీ మూతపడటంతో రోడ్డు మార్గంలోనే దగ్గర్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి మన దౌత్యకార్యాలయం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
సూడాన్ నుంచి తమ దౌత్య సిబ్బంది 70 మందిని స్వదేశానికి తరలించినట్లు అమెరికా ప్రకటించింది. తాత్కాలికంగా ఆ దేశంలో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్, గ్రీస్, నెదర్లాండ్స్, ఇటలీ దేశాలు తమ దౌత్య సిబ్బందిని, ప్రజల్ని స్వదేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. సూడాన్‌లో ఘర్షణలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బాంబుదాడులతో నగరాలు దద్దరిల్లుతున్నాయి.