పీవోకే విదేశీ భూభాగమే!.. ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపిన పాక్ సర్కార్

ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌ :  పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పీవోకే) విదేశీ భూభాగమేనని ఆ దేశ ప్రభుత్వం ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టుకు తెలిపింది. పీవోకేలో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి అధికారం లేదని, పాక్‌‌‌‌‌‌‌‌ చట్టాలు అక్కడ చెల్లవని పేర్కొంది. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవి, జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ ఫర్హాద్‌‌‌‌‌‌‌‌ షా కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ కేసులో విచారణ సందర్భంగా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ అదనపు అటార్నీ జనరల్‌‌‌‌‌‌‌‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రావల్పిండిలోని తన ఇంట్లో ఉన్న జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ ఫర్హాద్‌‌‌‌‌‌‌‌ షాను పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ మే 15న కిడ్నాప్‌‌‌‌‌‌‌‌ చేసిందని ఆరోపిస్తూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. 

దీంతో అహ్మద్‌‌‌‌‌‌‌‌ ఫర్హాద్‌‌‌‌‌‌‌‌ను కోర్టు ఎదుట హాజరుపర్చాలని న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ మొహ్సిన్‌‌‌‌‌‌‌‌ అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కయానీ బెంచ్‌‌‌‌‌‌‌‌ పాక్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫర్హాద్‌‌‌‌‌‌‌‌ షా పీవోకేలోని పోలీస్‌‌‌‌‌‌‌‌ కస్టడీలో ఉన్నాడని, అతన్ని ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు ముందు హాజరుపర్చలేమని అదనపు అటార్నీ జనరల్‌‌‌‌‌‌‌‌ కోర్టుకు తెలిపారు. పీవోకే ఫారిన్‌‌‌‌‌‌‌‌ టెరిటరీ అని, ఆ ప్రాంతానికి సొంత రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని.. అక్కడ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ కోర్టుల తీర్పులు చెల్లవని ఆయన తెలిపారు. అందువల్ల అతడిని పాక్‌‌‌‌‌‌‌‌ కోర్టు ఎదుట హాజరుపర్చలేమన్నారు. 

దీనిపై కోర్టు స్పందిస్తూ.. పీవోకే విదేశీ భూ భాగమైతే పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆర్మీ, పాక్‌‌‌‌‌‌‌‌ రేంజర్లు ఆ ప్రాంతంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారని జస్టిస్‌‌‌‌‌‌‌‌ కయానీ ప్రశ్నించారు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థలు విచారణ పేరుతో పీవోకేలో అక్రమంగా ప్రవేశించి ప్రజలను బలవంతంగా తీసుకెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. కాగా, జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ ఫర్హాద్‌‌‌‌‌‌‌‌ షా పీవోకే ప్రజల హక్కుల కోసం పోరాడారు. గతంలో పీవోకేలో జరిగిన అనేక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు ఆయన నాయకత్వం వహించారు. మరోవైపు, 1947 నుంచి పీవోకే ఇండియాలో అంతర్భాగమని భారత విదేశాంగ మంత్రి ఎస్‌‌‌‌‌‌‌‌.జైశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇటీవల స్పష్టం చేశారు. పీవోకే ఎల్లప్పుడూ ఇండియాతోనే ఉంది.. ఇండియాలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.