మాకొకటి చెప్పి.. మీరొకటి చేస్తరా?
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆగ్రహం
కోర్టు ధిక్కారానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక
పూర్తి వివరాలతో సీఎస్ అఫిడవిట్ వేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మాకొకటి చెప్పి, మీరొకటి చేస్తరా” అంటూ ఫైర్ అయింది. రిజిస్ట్రేషన్లకు ఆధార్, కులం తదితర వ్యక్తిగత వివరాలను సేకరించడంపై మండిపడింది. ‘‘ప్రభుత్వానికి తెలివి ఎక్కువ అయినట్టుంది. కోర్టుకు ఒకలా చెబుతోంది. బయట చేయాల్సింది చేస్తోంది. ఇట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోం. కోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే కోర్టుధిక్కార చర్యలు తప్పవు” అని హైకోర్టు రాష్ట్ర సర్కార్ ను హెచ్చరించింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేస్తామని కోర్టుకు చెప్పి.. ఆధార్, కులం, ఇతర వ్యక్తిగత వివరాలు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో సీఎస్ అఫిడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. గురువారం తిరిగి విచారణ కొనసాగిస్తామని తెలిపింది. అప్పటి వరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేసింది . ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిల డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయరా?
ధరణిలో రిజిస్ట్రేషన్లకు వ్యక్తి గత వివరాలు నమోదు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లాయర్లు ఐ. గోపాల్ శర్మ, కె.సాకేత్, మరో ఐదుగురు వేర్వేరుగా ఫైల్ చేసిన పిల్స్ పై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది . ‘‘రిజిస్ట్రేషన్ యాక్ట్ –1908లోని 70 ఎ, 70 బి, 70 సి నిబంధనలతో పాటు 221 నుంచి 237 నిబంధనల మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించాలి. చాప్టర్ –32 కార్డ్ రూల్స్ మేరకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్లు చేయవచ్చు. ఆధార్, కులం లాంటి వివరాలేవీ అడగకుండా ఇవి చేయాలి” అని తాము గతంలో ఉత్తర్వులు ఇచ్చినా, ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించింది . కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా చేస్తే , ఊరుకోబోమని హెచ్చరించింది. చట్టం చేయకుండా వ్యక్తిగత వివరాలు సేకరిస్తామంటే ఎలా? అని ప్రశ్నించింది.
వివరాలివ్వకపోతే పీటీఐఎన్ ఇస్తలేరు…
తొలుత పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు స్లాట్ బుక్ చేసుకొని, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటి ఫికేషన్ నెం బర్ (పీటీఐఎన్ ) ఇస్తే ఆన్ లైన్ /ఆఫ్ లైన్ (పాత పద్ధతి)లో రిజిస్ట్రేషన్లు చేస్తామని సర్కార్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. వ్యక్తి గత వివరాలు అడుగుతున్నా రని, లేకపోతే పీటీఐఎన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. దీనిపై ఉన్నతాధికారులను అడిగి చెప్పేందుకు సమయం కావాలని కోరారు. హైకోర్టు స్పందిస్తూ.. ఆ వివరాలను సీఎస్ లిఖిత పూర్వకంగా అందజేయాలని ఆదేశించింది. మరోవైపు ఈ ఈ వ్యవహారంపై సమీక్షకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని, అనుబంధ పిటిషన్ల పై కౌంటర్ వేసేందుకు టైమ్ ఇవ్వాలని ఏజీ హైకోర్టును కోరారు. ప్రభుత్వం సమీక్ష చేసుకుంటే అభ్యంతరం లేదని, సబ్ కమిటీ ఏర్పాటయ్యాక ఈ పిటిషన్లపై ఇప్పుడే విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అయితే కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా చేయడానికి వీల్లేదని, సీఎస్ అఫిడవిట్ ఫైల్ చేయాలని, దానిపై గురువారమే విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది.
For More News..