పర్యావరణ అనుకూల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి

పర్యావరణ అనుకూల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలి

2016లో అప్పటి ముఖ్యమంత్రి ఒకనాడు బంగారు తెలంగాణ సాధించే క్రమంలో హెలికాప్టర్లో ఎయిర్​పోర్టు పరిసరాలలో షికారు చేసి ముచ్చెర్ల ప్రాంతంలో ఫార్మా సిటీ పెడుతున్నామని ప్రకటించిండు. ఇదే తెలంగాణ అభివృద్ధికి మార్గమని ఒకటే ఊదరగొట్టారు మిగతా  పాలకులు, మంత్రులు, అధికారులు. ఆ తరువాత క్రమంగా హైదరాబాద్ ఫార్మా సిటీకి 19,333 ఎకరాలు అవసరమని ప్రజల నుంచి భూసేకరణ మొదలుపెట్టారు. ఫార్మా పరిశ్రమలు పెట్టమని ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ఉద్యమ సమయంలో,  తెలంగాణ తొలి ఎన్నికలప్పుడూ అడగలేదు. అడగని పారిశ్రామిక అభివృద్ధి ఆలోచన ఎక్కడ పుట్టింది?. ఆ ఆలోచన గురించి ప్రజలతో సంప్రదింపులు కూడా జరపకుండా కందుకూరు, యాచారం తదితర ప్రాంతాలలో హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు భూసేకరణ మొదలుపెట్టారు. ఇక్కడ కూడా దుర్నీతి ప్రదర్శించారు అప్పటి ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి, వారి చేతిలో ఆయుధం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC). మొదట అమాయకులైన అసైన్డ్ పట్టాదారులకు అది ప్రభుత్వ భూమే అని భయపెట్టి, కొంత సొమ్ము ముట్టజెప్పి వాళ్ల భూమిని తీసుకున్నారు. 


ఈ ఎకరాలు చూపెట్టి ప్రజలే స్వచ్ఛందంగా ఇస్తున్నారని ప్రచారం చేసి పట్టాదారులను భ్రమలో పెట్టి అక్కడ కొంత సేకరించారు. మనది ప్రజాస్వామ్యం కనుక ప్రజలు కోర్టుకెళ్లారు. ప్రభుత్వ చర్య మీద స్టే తెచ్చుకున్నారు. పర్యావరణ అనుమతులు తప్పనిసరి  కనుక ఆ ప్రక్రియలో కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. 

ప్రజల వ్యతిరేకత వలన హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు ముందుకు పడలేదు. హైదరాబాద్ ఫార్మా సిటీ ఒక హేతుబద్ధమైన ప్రాజెక్టు కానే కాదు.  మొత్తం 19,333 ఎకరాలలో, దాదాపు 12 వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం నిర్దేశించింది. వందల ఫార్మా పరిశ్రమలు ఒకే దగ్గర పెట్టడం ఆశాస్త్రీయమని,  సహేతుకమైన ఆలోచన కాదు అని మేం వివరిస్తే  ప్రతి ఒక్కరికీ అర్థమయ్యింది. మన దేశంలో ఉన్న చట్టాలు, రాజ్యాంగపర ప్రక్రియలు పని చేస్తే ప్రజలు కోరని, ప్రజలను సంప్రదించని, రైతులను నిర్వాసితులను చేసే ప్రాజెక్టు పేపర్ దాటి క్షేత్ర స్థాయిలో అమలు అయ్యే అవకాశమే లేదు. అది దుస్సాధ్యమని తెలిసి తెలంగాణ ప్రభుత్వం ప్రజలను, రాజ్యాంగబద్ద సంస్థలను మోసగించే విధంగా వ్యవహరించింది. ఇదే తరహా వ్యవహారం మిగతా ప్రాజెక్టుల విషయంలో కూడా అమలు చేసింది. చందనవేలి, జహీరాబాద్, చిత్తనూర్, వరంగల్ తదితర ప్రాంతాలలో పరిశ్రమల అభివృద్ధికి ఈ తరహా వ్యవహారం నడిపి కుట్రపూరితంగా వ్యవహరించి కాలుష్యం చేస్తూ, ఉద్యోగాలు ఇవ్వని పరిశ్రమలను తెలంగాణ మీద రుద్దిన ఘనత గత పాలకులదే. ఈ తరహా వ్యవహారం అర్థమై ప్రజలు బీఆర్​ఎస్​ పార్టీని 2023లో అధికారం నుంచి తప్పించారు.

ప్రజా ఉద్యమాలకు కాంగ్రెస్​ సంఘీభావం

అప్పట్లో ప్రజా ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్​  పార్టీ అధికారంలోకి వచ్చింది.   కొత్త నగరం నిర్మిస్తామని ‘ఫ్యూచర్ సిటీ’ కార్యక్రమం ముందట పెట్టుకుంది. హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఎదురు అవుతున్న  సామాజిక, ఆర్థిక, టెక్నాలజీ సమస్యలను ఫ్యూచర్ సిటీ అధిగమిస్తుందా? ప్రస్తుత హైదరాబాద్ బల్దియా పరిధి 650 చదరపు కిలోమీటర్లు. అంటే 1.61 లక్షల ఎకరాలు. ఇందులో నివసించే దాదాపు కోటి జనాభాలో కనీసం సగం శాతం నిత్యం మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులలో జీవిస్తున్నారు. నగర నిర్మాణం వేరు. ఒక లేఔట్ ప్రణాళిక వేరు. ఈ రెండింటి మధ్య తేడా తెలియకుండా ఫ్యూచర్ సిటీ ప్రణాళిక చేయడం శోచనీయం. డిసెంబర్ 23, 2023న హైదరాబాద్‌ ఫార్మా సిటీ ప్రాజెక్టు వ్యతిరేకులు ఒక సమావేశంలో పరిస్థితిని సమీక్షించి కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలనే తన నిర్ణయాన్ని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు లేఖ రాయమని కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ కింద సేకరించిన భూమిని తిరిగి ఆయా గ్రామాలలోనే భూమి లేని పేదలకు పంచవచ్చు. ఈ ప్రాంతంలో భూ వినియోగ సర్వే చేయాలి. వ్యవసాయ యోగ్య భూమిని కాపాడాలి. కొండలు, అడవులు, నీటి వనరులతో సహా స్థానిక పర్యావరణ వ్యవస్థను రక్షించే లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ కింద హైదరాబాద్ ఫార్మా సిటీ జోనల్ మ్యాప్‌ను మిశ్రమ వినియోగ భూమి జోన్‌గా ప్రకటించాలి. అయితే, ఇవన్నీ కూడా ప్రభావిత గ్రామాల్లో  ప్రజలతో సంప్రదింపుల ద్వారా పూర్తి చేయాలి. 

ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధి 765.28 కిలోమీటర్లు

 తెలంగాణ ప్రభుత్వం స్కిల్​ యూనివర్సిటీ అని మొదలు పెట్టి ఆఖరుకు ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అయ్యింది.  ప్రజల ముందు చర్చించకుండా రియల్ ఎస్టేట్ తరహా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఒకే రోజు 2 ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి 10.5 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తూ, అదే పరిధిలో 7 మండలాలలో ఉన్న 56 గ్రామాలతో ఒక ప్రత్యేక ఫ్యూచర్ సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ (FCADA) కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులు సామాన్యులకు అందుబాటులో లేవు. ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధి 765.28 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు 1,89,105 ఎకరాలు. 2001లో ఏర్పాటు చేసిన సైబరాబాద్ అభివృద్ధి అథారిటీ పరిధి కేవలం 52 చదరపు కిలోమీటర్లు (12,849 ఎకరాలు). 2011 నాటికి ఉన్న పర్యావరణ నిబంధనల ప్రకారం దాదాపు 5 ఎకరాలు ఉండే నిర్మాణ ప్రాజెక్ట్ ఏదైనా పర్యావరణ అనుమతులు తీసుకోవాలి. తరువాత దీనిని 2018లో  కేంద్ర ప్రభుత్వం సడలించి విస్తీర్ణం మొదట 12 ఎకరాలు ఆ తరువాత ఏకంగా 37 ఎకరాలకు పెంచింది. 37 ఎకరాల పైబడి ఉండే ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూమిని ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు దఖలు పరచడం. ఒక పనికి సేకరించిన భూమి ఇంకొక పనికి వాడడం చట్ట వ్యతిరేకం. అయితే ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమి దాదాపు 12 వేల నుంచి 16 వేల ఎకరాల వరకు ఉన్నది.  నిర్దేశించిన 19,333 ఎకరాలలో మొత్తం భూమి సేకరించలేదు. ప్రజల వ్యతిరేకత వల్ల, కోర్టు కారణంగా ఆగిపోయినవి ఉన్నాయి. ఎంత సేకరించారు అనే విషయం మీద స్పష్టత లేదు. హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ ప్రకటించినా ప్రభుత్వపరంగా హామీగాని ఉత్తర్వులు కానీ రాలేదు.

అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలి

ఫ్యూచర్ సిటీ పరిధిలో అటవీ ప్రాంతాలు ఉన్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ కింద వందల ఎకరాలు ఉన్నాయి. వీటిలో కొన్ని వందల వన్యప్రాణులు ఉన్నాయి. దీని పరిధిలోని 7 మండలాలలో ప్రస్తుతం నివసిస్తున్న దాదాపు 3.5 లక్షల జనాభా మీద ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాంతంలో దాదాపు 22,500 ఎకరాల అటవీ భూమి, రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయని అప్పటి పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇది 12 శాతం. మొత్తం ఫ్యూచర్ సిటీ పరిధిలో ఇంకా ఎక్కువే ఉండవచ్చు. ఇప్పటికే భూతాపం పెరిగి రంగారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే చెట్లు లేని, చెరువులు లేని ప్రాంతంలో  ఏమి కట్టగలుగుతారు? తెలంగాణలోనే వృక్ష సంపద తక్కువగా ఉన్నది. అందునా మొత్తం 33 జిల్లాలలో రంగారెడ్డి జిల్లాలో ఇంకా తక్కువ. ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటూ, కొత్తగా అటవీ ప్రాంతం విస్తరించాలి. ప్రభుత్వం ఉన్న అడవులను, చెట్లను, అటవీ భూములను నాశనం చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఇక్కడి ప్రజలకు చాలా అంధకారంగా ఉంటుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో మూలవాసులు అనేక ఒత్తిడులకు లోనయి వేల ఎకరాల భూములు ఇతరులకు ఇచ్చారు. తమ జిల్లాలోనే భూనిర్వాసితులుగా మారుతున్నారు. నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకుంటున్నారు. కాబట్టి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్​ తరహా అభివృద్ధిలా కాకుండా పర్యావరణ అనుకూల అభివృద్ధికి పెద్దపీట వేయాలి.

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​