ప్రభుత్వం వీఆర్ఏలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలె

వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా ఆలస్యం చేస్తున్నది.  సెలవులు, పండుగలతో సంబంధం లేకుండా ప్రభుత్వంలోని దాదాపు అన్ని శాఖలకు క్షేత్ర/గ్రామ స్థాయిలో విశేష సేవలందిస్తున్న వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనం అందక ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23000  మంది గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏలు) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రభుత్వ పరంగా పే స్కేలు, పీఎఫ్ లేవు. మెటర్నిటీ, క్యాజువల్ సెలవుల సౌకర్యం లేదు. ఈఎస్ఐ, హెల్త్​కార్డ్స్, పెన్షన్, ఉద్యోగ భద్రత, పదోన్నతులు వంటి ఏ ఒక్క వెసులుబాటు లేకుండానే పనిచేయాల్సిన పరిస్థితి. వచ్చే రూ.10 వేల జీతంతో కుటుంబాన్ని గడపలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో, అటు ఆఫీసులకు వెళ్లి పనిచేస్తున్న వీరికి ప్రభుత్వం కనీసం రవాణా ఖర్చులు కూడా అదనంగా ఇవ్వడం లేదు. 

అనేక సార్లు హామీలు ఇచ్చినా..

రెవెన్యూలో వీఆర్వోల వ్యవస్థ రద్దు ప్రకటన సమయం సహా అనేక సార్లు సీఎం కేసీఆర్​అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు అనేక విషయాల్లో హామీ ఇచ్చారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని, అర్హులైన వారికి పదోన్నతులు ఇస్తామని ప్రకటించారు. కానీ స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంపై వీఆర్ఏలు సమ్మె బాట పట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్​13న దాదాపు10 వేల మంది వీఆర్ఏలు పోలీసులను దాటుకొని అసెంబ్లీ ముట్టడించేందుకు కదం తొక్కారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. మంత్రి కేటీఆర్​స్పందించి వీఆర్ఏ జేఏసీ నాయకులతో మాట్లాడారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుగుతున్నందున త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే నెల 20న వీఆర్ఏ జేఏసీ నాయకులు మంత్రి కేటీఆర్​ను, చీఫ్​ సెక్రటరీని కలిసి మాట్లాడారు. పే స్కేల్ కు సంబంధించిన పనులు నడుస్తున్నాయని, కొన్ని రోజులు సమయం పడుతుందని చెప్పారు. అక్టోబర్12న కూడా సీఎస్​ వీఆర్ఏ నాయకులతో చర్చలు జరిపారు. ఉప ఎన్నిక కోడ్ ముగిశాక నవంబర్ 7 తర్వాత జీవోలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి జీవో విడుదల కాలేదు.

83 రోజులు సమ్మె చేసినా ఫలితం లేక..

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 83 రోజులకు పైగా వీఆర్ఏలు సమ్మె చేశారు. మునుగోడు ఉప ఎన్నిక రావడంతో ప్రభుత్వం వీఆర్ఏలను చర్చలకు పిలిచి మాట్లాడింది. ఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించడంతోపాటు, పే స్కేల్​కు సంబంధించిన జీవో ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో వీఆర్ఏల పరిస్థితి మళ్లీ ఎప్పటి లాగే మారింది. కాగా 83 రోజుల సమ్మెకాలంలో కూడా ప్రభుత్వం జీతం ఇవ్వలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీల ప్రకారం మాట నిలబెట్టుకోవాలి. వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్​ అమలు చేయడంతోపాటు, సమ్మె కాలం వేతనం చెల్లించాలి. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కు సర్వీస్ పెన్షన్ సదుపాయం, వారసులకు ఉద్యోగాల నియామకం కల్పించాలి. - కర్ణకంటి రాజేశ్, కో కన్వీనర్, వీఆర్ఏ జేఏసీ, వరంగల్