1969 తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

1969 తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

1969 తెలంగాణ ఉద్యమానికి చెందిన ఉద్యమకారుల బృందం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న సికింద్రాబాద్‌లోని  క్లాక్ టవర్ గార్డెన్‌లోని  తెలంగాణ  అమరవీరుల స్మారక చిహ్నం వద్ద  క్రమం తప్పకుండా సమావేశం అవుతోంది. వీరంతా సమావేశమై ప్రత్యేక  తెలంగాణ తొలి ఉద్యమ సమయంలో మరణించిన 369 మంది ఉద్యమకారులకు నివాళి అర్పిస్తారు. ఈక్రమంలో గతంలో మాదిరిగానే  తెలంగాణ అమరవీరుల దినోత్సవ కమిటీ కన్వీనర్  పీజే  సూరి  ఆధ్వర్యంలో ఈ ఏడాది 4వ తేదీ శుక్రవారం సాయంత్రం 56వ స్మారక సమావేశాన్ని  నిర్వహించారు.  ప్రత్యేక  తెలంగాణ కోసం  ప్రాణాలను  త్యాగం చేసిన  అమరవీరులకు  ఘనంగా నివాళి అర్పించారు.  

2001 నుంచి ప్రత్యేక తెలంగాణ  ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి, 1100 మంది తమ ప్రాణాలను త్యాగం చేయడం వల్ల కొనసాగిన సుదీర్ఘమైన ప్రత్యేక ఆందోళన తర్వాత 2014లో  తెలంగాణ రాష్ట్ర హోదా సాధ్యమైంది. అయితే, రెండోదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కల్వకుంట చంద్రశేఖర్ రావు.. 1969లో విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు, టీఎన్జీవోలు, ఆ తరువాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఇతరుల నేతృత్వంలో జరిగిన తొలిదశ  తెలంగాణ- ఉద్యమాన్ని అంగీకరించలేదు.

ముల్కి సమస్యపై ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు ఎం నారాయణ్ దాస్ ఆందోళనను ప్రారంభించినప్పటికీ ఈతరం ఆయనను చాలామందిలాగ  గుర్తించడం  లేదు.   ప్రజలు   డాక్టర్  మర్రి చెన్నారెడ్డి, ఎం మల్లికార్జున్,  జీ. వెంకటస్వామి వంటి మరికొందరిని మాత్రమే తొలి తరం తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తులో ఉంచుకున్నారు.

కష్టాల కడలిలో తొలిదశ ఉద్యమకారులు

1969 తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు పొందని నాయకులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు వారు 60, 70,  80 ఏళ్లలో ఉన్నారు. తొలిదశ ఉద్యమకారుల జీవితాలు  చివరి దశలో ఉన్నాయి. కానీ, వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ సందర్భంగా 1969 ఉద్యమ నాయకుడు పీజే సూరి మాట్లాడుతూ.. వయోభారంతో కుంగిపోయినవారికి, వారి కుటుంబాలకు వైద్య సౌకర్యాలు మాత్రమే తాము కోరుకుంటున్నామని తెలిపారు.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలన్న తమ కల నెరవేరినా  ఆర్థికంగా అండదండలు లేని కొందరు ఉద్యమకారులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు.  వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరం అని 1969 ఉద్యమ నాయకుడైన  ఆయన కోరారు.

ఆనాటి ఉద్యమకారులను గుర్తించని పరిస్థితిఓయూ క్యాంపస్‌లో మొదటగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పిలుపునిచ్చింది నారాయణ దాస్.  కానీ, ప్రస్తుత తరం ఆయనను గుర్తుంచుకోవడం లేదు. సికింద్రాబాద్ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు, తెలంగాణ  ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మక్తల సురేష్ బాబు  తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న 1969 ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలను ఆదుకోవాలన్నారు. ఆర్థికసాయంతోపాటు, భూమి ప్రయోజనాలను విస్తరించాలి. తెలంగాణ రాష్ట్ర సీఎం ఎ. రేవంత్ రెడ్డి సారథ్యంలోని  కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. 

1969 నాటి ఉద్యమకారులను ఆదుకోవాలి

కాంగ్రెస్  పార్టీ  తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల సమయంలో  ఉద్యమకారులకు  250 చదరపు గజాల భూమి, రూ. 25,000 పెన్షన్ హామీ ఇచ్చింది.  ఈ  ప్రయోజనాలను 1969 తొలి దశ ఉద్యమకారుల్లో ప్రభుత్వపరంగా ఏ ప్రయోజనాలకు నోచుకోనివారికి విస్తరించాలని  ప్రభుత్వాన్ని కోరారు. తొలితరం ఉద్యమకారుల్లో చాలా తక్కువ మంది మాత్రమే జీవించి ఉన్నారు.  కాగా, 1969లో  సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డు (కింగ్స్​వే)లోని  బురుగు మహాదవ్ హాల్‌లో సమైక్యవాదుల సమావేశం నిర్వహించిన తర్వాత  జరిగిన పోలీసు కాల్పుల్లో సికింద్రాబాద్‌కు చెందిన  నలుగురు వ్యక్తులు మరణించారు. అమరవీరులకు నివాళి సందర్భంగా 1969 ఏప్రిల్ 4న ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన తేదీ ప్రాముఖ్యతను మర్చిపోలేం.

విద్యార్థులు, టీఎన్జీఓల కీలకపాత్ర

విశాలాంధ్ర సమైక్యవాదుల సమావేశాన్ని  నర్రా మాధవరావు ఏర్పాటు చేయగా దీనికి కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు హాజరయ్యారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో  ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న ఉద్యమకారులు వేదిక వద్ద గుమిగూడారు. తెలంగాణ ఉద్యమకారులు,  సమైక్యవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తదనంతరం ప్రత్యర్థి గుంపులు రాళ్లు రువ్వడం కూడా జరిగింది.  అనంతరం  కేఆర్ అమోస్ నేతృత్వంలోని టీఎన్జీఓలు, విద్యార్థులు,  తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చేరడంతో చాలా మంది సమైక్యవాదులు సైతం ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను గుర్తించి ఉద్యమకారులుగా  మారారు అని సూరి గుర్తుచేశారు. 

అన్ని వర్గాలు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నాయి

వాస్తవానికి 1957 నుంచి టీఎన్జీఓలు తమ సమావేశాలలో.. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో జరుగుతున్న వివక్ష,   తెలంగాణ ప్రాంత ప్రజలకు పదోన్నతులలో చూపుతున్న వివక్షత దృష్ట్యా ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తీర్మానాలను  పదేపదే ప్రతిపాదించారు.  తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా  విద్యార్థులు కీలకపాత్ర  పోషించగా టీఎన్జీఓలు,  విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. 1969లో మొదలైన తొలిదశ ప్రత్యేక తెలంగాణ  ఉద్యమం సమయంలో  ఉద్యమకారులు నినదించిన ‘లాఠీ, గోలి ఖాయేంగే, తెలంగాణ లాయేంగే (మనం లాఠీలను, బుల్లెట్లను ఎదుర్కొని తెలంగాణను సాధిద్దాం) నినాదాన్ని  అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరూ గుర్తుచేసుకున్నారు. 

 

సీఆర్​ గౌరీశంకర్,
సీనియర్​ జర్నలిస్ట్​