హైదరాబాద్, వెలుగు: కొత్త మున్సిపాలిటీ చట్టం రూపకల్పన తుదిదశకు చేరింది. ప్రస్తుత చట్టంలోని చాలా సెక్షన్లను యథావిధిగా కొనసాగిస్తూనే ఇంటి నిర్మాణానికి పర్మిషన్ పొందే ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పరిశ్రమలకు సింగిల్ విండో విధానం ద్వారా15 రోజుల్లో అనుమతులిస్తున్నట్లే ఇంటి నిర్మాణ అనుమతులూ ఇవ్వాలంటూ గతంలో సీఎం చేసిన సూచనకు అనుగుణంగా సవరణలు చేస్తున్నారు. రాష్ట్రంలోని రెవెన్యూ, మున్సిపాలిటీ విభాగాల్లో అవినీతి వేళ్లూనుకుందని ఆరోపణల నేప్యథంలో ఈ రెండు శాఖల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇండ్ల నిర్మాణాలు, లేఅవుట్లకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు, అవినీతికి అవకాశం లేకుండా చేపట్టాల్సిన చర్యలు, గడువులోగా ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వలేకపోతే ఎవరిని బాధ్యులు చేయాలి వంటి అంశాలను కొత్త అర్బన్ పాలసీ రూపకల్పనలో చేర్చేందుకు పరిశీలన చేస్తున్నారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు వేర్వేరు చట్టాలే
ఇప్పటి వరకు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) చట్టాన్నే వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం నగర పాలక సంస్థలు అనుసరిస్తున్నాయి. మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా మరో చట్టం ఉంది. ఇలా వేర్వేరు చట్టాలు కాకుండా ఒకే చట్టంగా మున్సిపల్ యాక్ట్‌ను రూపొందించాలని ప్రభుత్వం తొలుత భావించినా.. దీని వల్ల ఎదురయ్యే సమస్యల దృష్ట్యా గతంలోమాదిరే కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు వేర్వేరు చట్టాలను రూపొందించాలని ఆదేశించినట్లు తెలిసింది.
అలాగే పాత చట్టాల్లో అవసరంలేని చాప్టర్లు, సెక్షన్లు తీసివేయడంతోపాటు, ఒకే అంశానికి సంబంధించి వేర్వేరు చోట్ల ఉన్న సెక్షన్లను ఒక దగ్గరికి చేర్చాలని సూచించినట్లు సమాచారం.
కొత్త లేఅవుట్లలో 40 ఫీట్ల ఇంటర్నల్ రోడ్లు !
ఇప్పటి వరకు లేఅవుట్ల అనుమతికి పాటించాల్సిన నిబంధనలు జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఒక విధంగా, మునిపాలిటీల్లో మరోలా ఉన్నాయి. లేఅవుట్లలో ఇంటర్నల్ రోడ్డు 33 ఫీట్లు ఉండాలన్న నిబంధన హైదరాబాద్‌తోపాటు, ఇతర కార్పొరేషన్ల పరిధిలో అమలవుతుండగా, హైదరాబాద్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాలు, ఇతర మునిపాలిటీల్లో 40 ఫీట్ల రోడ్డు నిబంధన అమలులో ఉంది. పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకు జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేయబోయే కొత్త లే అవుట్లలో 40 ఫీట్ల ఇంటర్నల్ రోడ్డు ఉండేలా ప్రతిపాదించినట్లు తెలిసింది.
ఆర్టీసీలో ప్రతి డ్రైవర్ డ్యూటీ ఎక్కేముందు మద్యం తాగారో లేదో బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేస్తారు. ఏళ్లుగా ఇది సాగుతోంది. అయితే ఆర్టీసీలో వాడుతున్న బ్రీత్ ఎనలైజర్లు ఏళ్లనాటివి. సరిగా రీడింగ్ చూపించకపోవడంలో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం 30ఎంజీ దాటితేనే చర్యలు తీసుకోవాలి. 10-30 ఎంజీ ఉంటే ఆ రోజు డ్యూటీ చేయనీయరు. ఎలాంటి చార్జీషీట్స్ ఇవ్వకూడదు. కానీ ఆర్టీసీ అధికారులు ఆల్కహాల్ పర్సంటేజ్ 4 ఎంజీ ఉన్నా విధుల్లోకి అనుమతించడంలేదు. పైగా చర్యలు తీసుకుంటున్నారు. బయట పోలీసులు 30 ఎంజీ కంటే ఎక్కువుంటేనే కేసులు బుక్ చేస్తుంటారు. మెంతోప్లస్, పిప్పర్‌మెంట్, జర్దా, పాన్‌పరాగ్, దగ్గు మందు, హోమియో మాత్రలు వేసుకున్నా ఆర్టీసీ బ్రీత్ ఎనలైజర్లలో 4 ఎంజీ చూపిస్తోందని కార్మికులు వాపోతున్నారు. చాలా కేసుల్లో పోలీసులు వాడుతున్న పరికరాలతో మరోమారు టెస్టులు చేయిస్తే ‘జీరో’ రీడింగ్ వస్తోందని వాపోతున్నారు. అధికారుల తీరుపై ఆర్టీసీ డ్రైవర్లు, కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్లు, మెమోలు జారీ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇవీ చర్యలు
ఇటీవల పదుల సంఖ్యలో డ్రైవర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ డిపోలో ఇలాగే ఇద్దరు డ్రైవర్లను సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ డిపోలో ఐదుగురికి చార్జ్ మెమోలు ఇచ్చారు. కరీంనగర్ డిపోలోనూ ముగ్గురు డ్రైవర్లను తాత్కాలికంగా విధుల్లోంచి తీసేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 మంది, నల్గొండ జిల్లాలో 9 మంది, నిజామాబాద్ జిల్లాలో ఏడుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు డ్రైవర్లపైనా చర్యలు తీసుకున్నారు.