- కోయిల్‌సాగర్‌కు కేటాయించిన వాటాలో ఒక టీఎంసీ మళ్లింపు
- చక్రం తిప్పిన మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు
- పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండానే ఫ్యాక్టరీకి అనుమతులు, పనులు
- కోయిల్‌సాగర్ కింద భారీగా తగ్గనున్న సాగు విస్తీర్ణం
- ఆందోళనలో రైతులు.. పైపులైన్ పనులు ఆపాలని డిమాండ్
మహబూబ్‌నగర్/మరికల్, వెలుగు: పాలమూరు జిల్లాలో అసంపూర్తి ప్రాజెక్టులు, కెనాల్స్కారణంగా సరిపడా సాగు నీరందక ఇప్పటికే రైతులు తిప్పలు పడ్తుంటే.. ఉన్న నీటిని ప్రైవేట్ ఇండస్ట్రీలకు సర్కార్ మళ్లించడం వివాదాస్పదమవుతోంది. నారాయణపేట జిల్లాలో ఓ ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం జూరాల ప్రాజెక్టు నుంచి ఏకంగా ఒక టీఎంసీ నీటిని ప్రభుత్వం కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూరాల బ్యాక్‌వాటర్ నుంచి కోయిల్‌సాగర్ వెళ్లే కెనాల్‌కు గండికొట్టి పైపులైన్ వేస్తుండడంతో రైతులు పనులను అడ్డుకున్నారు. పోయిన ఆదివారం పనులను అడ్డుకొని నిరసన తెలిపిన రైతులు.. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వెళ్లి ఆఫీసర్లకు కంప్లయింట్చేశారు. ఇప్పటికే నీళ్లందక చివరి ఆయకట్టు భూములు పడావు పెట్టుకుంటున్నామని, ఇప్పుడు ఉన్న నీటిని ఫ్యాక్టరీ కోసం మళ్లిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే నీటి కేటాయింపులు రద్దు చేసి, పైపు లైన్ పనులు ఆపాలని డిమాండ్ చేశారు.
రోజుకు 27 లక్షల లీటర్ల మళ్లింపు..
నారాయణపేట జిల్లా మరికల్ మండలం చింతనూరు వద్ద 450 ఎకరాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌కు ఇటీవల డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఓ ప్రముఖ డ్రగ్కంపెనీ అధినేత, అధికారపార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే జాయింట్‌వెంచర్‌గా ఫ్యాక్టరీ పెట్టాలనుకొని 2022 జనవరిలో టీఎస్ఐఐసీ నుంచి పర్మిషన్తెచ్చుకున్నారు. ఒక లీటర్ ఇథనాల్తయారీకి 5 లీటర్ల నీళ్లు, రెండు కిలోల బియ్యం, కేజీన్నర మక్కలు అవసరం. ఈ ఫ్యాక్టరీ ద్వారా రోజుకు 6 లక్షల లీటర్ల ఇథనాల్తయారు చేయనుండగా, 27 లక్షల లీటర్ల నీళ్లు అవసరం. ఎన్ని బోర్లు వేసినా ఇంత భారీ మొత్తంలో నీళ్లు అందడం కష్టం.
దీంతో ఫ్యాక్టరీ స్థలానికి కేవలం అర కిలోమీటర్దూరంలో ఉన్న జూరాల – కోయిల్‌సాగర్ కెనాల్‌పై ఫ్యాక్టరీ యజమానులు కన్నేశారు. ఆ కాల్వకు గండికొట్టి పైపులైన్ వేసుకోవాలని ప్లాన్‌వేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇందుకు సహకరించారు. కెనాల్నీటిని ఫ్యాక్టరీకి మళ్లించేందుకు అనుమతించాలని ఇరిగేషన్ ఆఫీసర్లపై ఒత్తిడితెచ్చారు. వాళ్లు రూల్స్ ఒప్పుకోవని చెప్పడంతో పైస్థాయిలో చక్రం తిప్పారు. కేవలం సాగు, తాగు అవసరాలకు మాత్రమే వాడాల్సిన ఈ కెనాల్ నుంచి 0.9 టీఎంసీలను ఫ్యాక్టరీకి తరలించేలా సర్కారుతో అగ్రిమెంట్చేసుకున్నారు. ఈ మేరకు ఇటీవలే కెనాల్‌నుంచి ఫ్యాక్టరీ వరకు 500 మీటర్ల పొడువునా పైపులైన్ పనులు కూడా ప్రారంభించారు. కందకం తవ్వుతుండగా రైతులు అడ్డుకున్నారు.
పబ్లిక్ హియరింగ్ లేకుండానే..
ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పబ్లిక్ హియరింగ్నిర్వహించాలి. కాలుష్య ప్రభావంపై పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు (పీసీబీ) అంచనా వేయాలి. ప్రజాభిప్రాయాలు రికార్డ్ చేసి కంపెనీకి అనుమతులు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఫ్యాక్టరీ స్థలానికి పక్కనే ఉన్న చిత్తనూరులో పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండానే పర్మిషన్ఇచ్చేశారు. ప్రజలు కంపెనీ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారంటూ కేంద్రానికి తప్పుడు రిపోర్టులు పంపి అనుమతులు తెచ్చుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇందులోనూ మంత్రి, ఎమ్మెల్యేలు కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.
మన్నేవాగులోకి వృథా జలాలు..
లీటర్ ఇథనాల్ తయారీకి ఐదు లీటర్ల నీరు అవసరమైతే మూడున్నర లీటర్ల వేస్టేజీ వాటర్ బయటకు వస్తుందని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు. రోజుకు 27 లక్షల లీటర్ల నీటిని వాడితే, 18 లక్షల లీటర్ల వృథా జలాలు బయటకు వస్తాయి. ఈ జలాలను ఫ్యాక్టరీకి కొద్ది దూరంలో ఉన్న మన్నేవాగులో డంప్ చేయనున్నారు. అవి అక్కడి నుంచి రామన్‌పాడు రిజర్వాయర్‌లో కలుస్తాయి. ప్రస్తుతం రామన్‌పాడు నుంచే వనపర్తి, పాలమూరు జిల్లాల్లోని కొన్ని ఏరియాలకు తాగునీరు అందుతోంది. వేస్ట్ వాటర్ రామన్‌పాడులో కలిస్తే తాగునీరు కలుషితం అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
జూరాల బ్యాక్వాటర్ఆధారంగా నిర్మించిన కోయిల్‌సాగర్ కెపాసిటీ 2.23 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు కింద 55 వేల ఎకరాలకు నీరు అందించాలి. ప్రస్తుతం ప్రాజెక్టు కింద లెఫ్ట్, రైట్ కెనాల్స్ ద్వారా కేవలం 20 వేల నుంచి 22 వేల ఎకరాలకు నీరందిస్తున్నారు. జూరాల నుంచి సరిపడా నీళ్లు రాక, కెనాల్స్ సరిగ్గా లేక తమ భూములను పడావు పెట్టుకోవాల్సి వస్తోందని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి టైంలో కోయిల్‌సాగర్‌కు వస్తున్న జూరాల నీటిలో 0.9 టీఎంసీలు ఫ్యాక్టరీకి కేటాయించడంపై మండిపడ్తున్నారు. దీని వల్ల కోయిల్‌సాగర్ కింద ఇకపై పది వేల ఎకరాలకు మించి పారదని, అదే జరిగితే తమ బతుకులు ఏమి కావాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఉన్నతాధికారులే అనుమతులిచ్చారు..
ఇథనాల్ కంపెనీకి కోయిల్ సాగర్ లిఫ్ట్ నుంచి నీళ్లను తరలించేందుకు ఉన్నతాధికారులే అనుమతులు ఇచ్చారు. కెనాల్ పక్క నుంచే పైపులైన్ తీసుకెళ్లాలని నిబంధన పెట్టారు. ఈ క్రమంలో కంపెనీ వాళ్లు గతంలో రైతులు వేసుకున్న పైపులైన్ తొలగించారు. పరిహారం కూడా ఇవ్వలేదు. రైతులకు పరిహారం ఇస్తే.. వాళ్లు తిరిగి పైపులైన్ వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. - ప్రతాప్, ఈఈ, కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్
కాల్వలు కంపెనీల కోసమా?
కోయిల్‌సాగర్ కాల్వ పంటల సాగు కోసం నిర్మించారు. మరి ఈ కాల్వ నీళ్లను పంటలకు కాకుండా, కంపెనీలకు కేటాయించడం ఎంత వరకు కరెక్ట్? మా ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల వరకు కోయిల్సాగర్ద్వారా నీళ్లు అందాలె. కానీ 180 ఎకరాలకు కూడా నీళ్లు వస్తలేవు. - శ్రీనివాస్‌గౌడ్, నెల్లికొండి, చిన్నచింతకుంట మండలం
తప్పుడు రిపోర్టులతో పర్మిషన్ తెచ్చుకున్నరు..
ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం ఇప్పటి వరకు పబ్లిక్హియరింగ్నిర్వహించలేదు. లీడర్లే కమీషన్ల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లు తప్పుడు రిపోర్టులు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకున్నరు. అసలు కంపెనీకి ఎలాంటి పర్మిషన్లు ఉన్నయో? ప్రజలకు నష్టం ఎలా జరగదో? బహిరంగంగా అందరికీ వివరించాలి. - మురళి, చిత్తనూరు, మరికల్ మండలం
ఇకపై 10 వేల ఎకరాలు కూడా పారది.. మా పంటలు ఎండబెట్టుకోవాలా?
జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు నీళ్లు వచ్చే కాల్వ కింద పైపులు ఏర్పాటు చేసుకున్నాం. దాని ఆధారంగానే యాసంగి పంటలకు నీళ్లు పారించు కుంటున్నాం. ఇప్పుడు ఇథనాల్కంపెనీకి నీళ్లు కావాలని కాల్వ పక్కనే పైపులైన్ వేస్తున్నరు. మేం వేసుకున్న పైపులను ధ్వంసం చేస్తున్నరు. ఉన్న నీళ్లను కంపెనీలకు ఇస్తే మా పంటలను ఎండబెట్టుకోవాలా? -వెంకటయ్య, చిత్తనూరు