తెలంగాణ తొలి నాటి హామీకి ఎనిమిదేండ్లు..

పేదల ఇండ్ల జాగలకు పట్టాలిస్తలే!
ప్రభుత్వ, అసైన్డ్​భూముల్లోని ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామన్న సర్కారు
 

సూర్యాపేట, వెలుగు :  2014 జూన్​2కు ముందు సర్కారు భూముల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్నవారి జాగలను రెగ్యులరైజ్ ​చేస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరడం లేదు. ఇందుకోసం 8 ఏండ్ల కింద సర్కారు తెచ్చిన 58, 59 జీఓలకు అతీగతి లేకుండా పోయింది. ఇప్పటికే రెండు దఫాలుగా రాష్ట్రవ్యాప్తంగా 4.68 లక్షల మంది ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ ​కోసం అప్లై చేసుకున్నారు. సర్కారు ఆదేశాలతో అప్లికేషన్లు తీసుకున్న ఆఫీసర్లు ఫీల్డ్​లెవెల్​లో ఫిజికల్​వెరిఫికేషన్ కూడా పూర్తిచేశారు. కానీ నేటికీ యాజమాన్యపు హక్కులు కల్పించకపోవడంతో అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వకపోవడంతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సైతం ఏటా కోట్లలో ఆస్తిపన్ను కోల్పోతున్నాయి. 

ఈ ఏడాది మరో చాన్స్​..

ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఉంటున్నవారి ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్​ చేయాలని తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర సర్కారు నిర్ణయించింది.  ఇందు కోసం 2014లో 58, 59 జీఓలు జారీ చేసింది. వీటి ప్రకారం 2014 జూన్2 కు ముందు ఆక్రమించుకున్న ఇండ్ల జాగలకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. జీఓ నంబర్ 58 కింద 125 గజాల్లోపు స్థలాన్ని ఫ్రీగా, జీఓ నంబర్ 59 కింద 250 గజాలలోపు స్థలానికి మార్కెట్​ రేటులో 50శాతం, 250 నుంచి 500 గజాల లోపు స్థలానికి మార్కెట్​రేటులో 75 శాతం ఫీజు తీసుకొని క్రమబద్ధీకరిస్తామని చెప్పింది. అప్పట్లో రెగ్యులరైజేషన్​ కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఆ తర్వాత అసైన్ మెంట్, సర్కారు భూముల్లో ఉన్న ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​ కోసం 2014లో విడుదల చేసిన జీఓ 58, 59 అనుగుణంగా ఈ ఏడాది జనవరిలో జీఓ నెంబర్ 14 విడుదల చేశారు. రెండోసారి చాన్స్ ​రావడంతో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు  రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు తీసుకున్నారు. దీంతో రెండోసారి సుమారు 1.68 అప్లికేషన్లు వచ్చాయి. 

నేటికీ రాని గైడ్​లైన్స్​.. 

ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​ కోసం సర్కారు రెండు దఫాల్లో 4.68 లక్షల అప్లికేషన్లు స్వీకరించింది. వీటిని ఆర్డీవోలు చైర్​పర్సన్​గా, తహసీల్దార్లు సభ్యులుగా ఉన్న కమిటీలు వెరిఫై చేశాయి. కానీ ఇప్పటివరకు ఈ స్కీమ్​కు సంబంధించిన గైడ్​లైన్స్ ​విడుదల చేయలేదు. మార్కెట్​రేటు ప్రకారం ఫీజులు వసూలు చేస్తామని చెప్పినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చేస్తారా? 2014 జూన్​2వరకు ఉన్న మార్కెట్​ ధరల ప్రకారం చేస్తారా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ విషయంపై క్లారిటీ లేకే125 గజాలు పైబడిన స్థలాల రెగ్యులరైజేషన్​ ఆగిపోయిందని ఆఫీసర్లు చెప్తున్నారు. దీనిని పక్కన పెడితే 125 గజాలు, ఆ లోపు ఉన్న ఇండ్ల స్థలాల రెగ్యులరేజేషన్​ ఫ్రీగా చేయవచ్చు. కానీ, దీనిపై కూడా సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడతో ఆఫీసర్లు అప్లికేషన్లను పక్కన పడేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగున్నర లక్షల మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. సర్కారు జాగల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లకు ఇటు పంచాయతీల్లో, అటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎలాంటి ఇంటి నంబర్లు కేటాయించలేదు. దీంతో యజమానులకు హౌజ్ ​లోన్లతో పాటు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. అటు పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా ఆస్తిపన్ను వసూలు చేయలేకపోతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు ఇంటి జాగలను రెగ్యులరైజ్​ చేస్తే అటు పేదలకు లబ్ధి చేకూరడంతో పాటు ఇటు లోకల్​బాడీలకు ఆదాయం కూడా పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

బ్యాంకులో లోన్​ ఇస్తలేరు..

మేళ్లచెర్వు పరిధిలోని 27వ సర్వే నంబర్ లో రెండు కుంటల జాగాలో ఇల్లు కట్టుకున్న. 40 ఏండ్ల నుంచి అందులోనే  ఉంటున్నం. ఇప్పుడు కొత్తగా ఇల్లు మొదలుపెట్టాను.  ప్రభుత్వం నుంచి పట్టా లేకపోవడంతో బ్యాంకులో లోన్ ఇవ్వడంలేదు. ఆర్నెళ్ల క్రితం రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నా ఇంత వరకూ ఏమీ కాలేదు. ఆఫీసర్లను అడిగితే ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాలేదు అని చెప్తున్నరు. 
- భోగాల రామకృష్ణారెడ్డి, వేపల మాదారం, మేళ్లచెర్వు మండలం

రెండు సార్లు అప్లై చేసినా పట్టా ఇయ్యలే

నేను మట్టపల్లి గ్రామం సర్వే నెంబర్ 1లోని 100 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకొని 23 ఏండ్లుగా నివాసం ఉంటున్న. తెలంగాణ ఏర్పడ్డాక 2014 లో  మొదటి సారి అప్లయ్ చేసుకున్నా రెగ్యులైజేషన్ కాలేదు. దీంతో ఇటీవల రెగ్యులరైజేషన్ కోసం మరోసారి అప్లై చేసిన. ఆఫీసర్లు రెండు నెలల క్రితం ఎంక్వైరీ కూడా చేసిన్రు. ఇకనైనా పట్టా వస్తదా? అని అడిగితే ఎప్పుడస్తదో తెలియదని అంటున్నరు. పట్టా లేకపోవడంతో ప్రభుత్వం ఎప్పుడు భూమి గుంజుకుంటదో అని టెన్షన్​గా ఉంది. 
- రత్నావత్ సైదులు, మట్టపల్లి, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా

సర్కారు నుంచి ఆర్డర్స్​ వస్తేనే..

జీ‌ఓ నెంబర్ 58, 59 కింద వచ్చిన అప్లికేషన్లను సర్వే ద్వారా వెరిఫై చేసి  పైకి పంపించాం. ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆర్డర్స్ వచ్చాక పట్టాలు మంజూరు చేస్తాం. 
- రాజేంద్ర ప్రసాద్, ఆర్‌డీఓ, సూర్యాపేట