దివంగత భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ ద్వారా విద్యార్థులు, యువతతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశాభివృద్ధిలో విద్యార్థులు, యువత భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో గవర్నర్ సోషల్ మీడియా వేదికగా పరస్పర చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెద్దపెద్ద కలలు కనాలని, గొప్ప విజయాలు సాధించాలని ఆమె విద్యార్థులకు, యువతకు సూచించారు. అబ్దుల్ కలాం జీవితం నిరాడంబరమైనదన్నారు. ప్రారంభం నుంచి దేశంలో అత్యున్నత స్థానానికి ఎదగడానికి నిజమైన ప్రేరణ అయన జీవితం అన్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు, బోధనలు మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయన్నారు.
ఈసందర్భంగా JNTUలోని వివిధ కళాశాలల నుంచి చాలామంది విద్యార్థులు విశ్వవిద్యాలయం అమలుచేస్తున్న క్రెడిట్ బేస్ డిటెన్షన్ సిస్టమ్‌కు సంబంధించిన తమ ఫిర్యాదులను పరిష్కరించేలా అధికారులను ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన తమిళిసై సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఫిర్యాదులను అధికారులకు తెలియజేస్తానని భరోసా కల్పించారు.