గవర్నర్ తమిళిసై రేపు భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాద్రి ముంపు గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ లో భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 30 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా గోదావరి నీటిమట్టం పెరిగిందంటున్నారు స్థానికులు. వరద కంటిన్యూ అవుతుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలనూ గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న బ్రిడ్జ్ పై రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి.
సీఎం కేసీఆర్ కూడా రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొనసాగనుంది. సీఎంతో పాటు సీఎస్ ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. ముంపు ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. మరోవైపు సహాయక చర్యల్లో స్పీడ్ పెంచాలని సూచించారు.