
హుస్నాబాద్/చేర్యాల/కొండాపూర్, వెలుగు : ప్రత్యేక రాష్ట్రం వస్తే కాంట్రాక్టు నౌకర్లు ఉండవని, అందరినీ పర్మినెంట్చేస్తామన్న సీఎం కేసీఆర్ తమ బతుకులను ఆగం చేస్తున్నారని జీపీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తీరును నిరసిస్తూ బుధవారం హుస్నాబాద్, చేర్యాల, కొండాపూర్ల్లో అర్ధనగ్న ప్రదర్శనలు, రాస్తారోకోలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని బతుకులతో అనేక కష్టాలు పడుతున్నామని, జీవో 66 ప్రకారం స్వీపర్లకు రూ.15,600, ఇతర కేటగిరి కార్మికులకు రూ.19వేల నుంచి రూ.31,640 వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలన్నారు. తమను పర్మినెంట్చేయాలని కోరారు.
సమ్మె చేస్తున్నా స్టేట్ గవర్నమెంట్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. వారి ఆందోళనకు జీపీ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు అయిలేని మల్లికార్జునరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మంద పవన్, సీపీఎం జిల్లా రైతు సంఘం లీడర్లు రాజయ్య, నరసింహారెడ్డి మద్దతు తెలిపారు.