సూర్యాపేట, నల్గొండ అర్బన్, హుజూర్ నగర్, నకిరేకల్, వెలుగు : తమ సమస్యలు తీర్చేదాకా సమ్మె ఆపేది లేదని జీపీ కార్మికులు స్పష్టం చేశారు. మంగళవారం జీపీ వర్కర్స్ జేఏసీ పిలుపు మేరకు సీఐటీయూ, కేవీపీఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి చేపట్టారు. సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీగా మంత్రి ఇంటికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నల్గొండలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి జూనియర్ కాలేజీ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు. అయితే ఎవరూ లేకపోవడంతో వినతి పత్రాన్ని గోడకు అంటించారు.
హుజూర్ నగర్‌లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట ఆందోళన చేసి ఆఫీస్ పీఆర్‌వోకు వినతి పత్రం అందజేశారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కార్మికులు రూ.19,500 కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.