గ్రాఫ్ డౌన్ .. 40 మందికి పైగా ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత

గ్రాఫ్ డౌన్
40 మందికి పైగా ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత
దశాబ్ది ఉత్సవాల్లో నిలదీస్తున్న జనం
ఊరూరా ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు
పరిణామాలపై గులాబీ బాస్ ఆరా
ఎమ్మెల్యేల పనితీరుపైనా సర్వేలు
కేసీఆర్ ఎవరి తోకలు కత్తిరిస్తారో..!
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ 

హైదరాబాద్ : అధికార పార్టీ గ్రాఫ్​ రోజురోజుకూ దిగజారుతోంది. మొన్నటి వరకు అంతా బాగుందనే ఫీలింగ్ లోనే ఉన్న కారు పార్టీ అధినాయత్వానికి వరుస పరిణామాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ నెల 2 వ తేదీ నుంచి 22వరకు నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యే ఉండాలని గులాబీ బాస్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లెలకు వెళ్తున్న ఎమ్మెల్యేలు తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని స్పష్టమైంది. 

నిలదీతలు, నిరసనలు, నినాదాలు, ఆందోళనల మధ్య దశాబ్ది ఉత్సవాలు సాగుతున్నాయి. తెలంగాణభవన్ లో గతంలో కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసి సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని గతంలో ప్రకటించారు. మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేయగలిగే సత్తా ఉన్న కేసీఆర్ కొందరి మీద వ్యతిరేకత ఉన్నదని, వాళ్ల తోకలు కత్తిరిస్తామని తర్వాత జరిగిన మీటింగ్ లో చెప్పారు. ఆ తర్వాత దళితబంధులో మూడు లక్షల రూపాయలు కమీషన్ గా తీసుకుంటున్నారని, తన దృష్టికి వచ్చిందని ప్రతి ఒక్కరి కదలికలూ తన వద్ద ఉన్నాయంటూ సున్నితంగా హెచ్చరించారు. ఏడాది ముందు నుంచే ప్రతి సెగ్మెంట్ లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు కేసీఆర్. ప్రతి సెగ్మెంట్ లో అనుకూలతలు.. గెలుపు అవకాశాలపై అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం 40 మందికి పైగా ఎమ్మెల్యేలు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. 

నిలదీతలు.. ఫ్లెక్సీలు..!

రైతు సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గట్టెక్కిస్తాయని, ఊరూరా చెరువు గట్లమీద మీటింగులు పెట్టి మనం చేసిన అభివృద్ధి చెప్పండి చాలు ప్రజలు గెలిపిస్తారని ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్ల సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వెళితే ఊరూరా మేళతాళాలతో ఎదుర్కొంటారని, బ్రహ్మరథం పడతారని భావించిన కేసీఆర్ కు జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. స్టేషన్ ఘనపూర్ సెగ్మెంట్ పరిధిలోని పీచర గ్రామంలో రచ్చబండ నిర్వహించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను స్థానికులు నిలదీశారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.

రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు ఎప్పుడు ఎక్కిస్తారని, కొత్తోళ్లకు పింఛన్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు ప్రయత్నింగా మూకుమ్మడిగా నిలదీయడంతో ఆయన అక్కడి నుంచి బయటపడక తప్పలేదు.  ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను కూడా స్థానికంగా నిలదీస్తున్నారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని వాగ్వాదానికి దిగుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వెదలో గ్రామస్తులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమాధానం చెప్పి ఊళ్లోకి రావాలంటూ ఏకంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.

నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధిలోని బాడ్సిలోనూ ఇదే తరహాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను పిప్పిల్ ధరి గ్రామస్తులు నిలదీశారు. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎందుకు కేటాయించాలేదని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదు.. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడం లేదని మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు.   మంత్రులు గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాములు నాయక్, చిరుమర్తి లింగయ్య ప్రజాగ్రహాన్ని చవి చూశారు.

గత నెల రోజులుగా ఎమ్మెల్యేలు రసమయి బాల కిషన్, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు సైతం పర్యటనల్లో ఇబ్బందుల పాలయ్యారు. దీంతో ఎక్కడ తమను అడ్డుకుంటారోననే భయం వారిని వెంటాడుతున్నది. దీనికి తోడు భూనిర్వాసితుల ఆందోళనలు కూడా ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల సిద్దిపేట జిల్లాకు చెందిన నిర్వాసితులు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని అడ్డకుకున్నారు.

ఎవరి తోకలు కత్తిరిస్తారో!

ప్రజావ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తామని ఇదివరకే సంకేతాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ టికెట్ల కేటాయింపులో ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నారో అనే గుబులు గులాబీ ఎమ్మెల్యేల్లో పట్టుకుంది. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో 20 రోజులపాటు చేపట్టిన కార్యక్రమాలు.. ఏ నియోజకవర్గంలో ఎలా సాగుతున్నాయి. ఎవరిపట్ల ప్రజా వ్యతిరేకత ఉంది..? ఎలాంటి వ్యతిరేకత ఉంది..? టికెట్ ఇవ్వాలా..? వద్దా.. ఆ సెగ్మెంట్ లో ప్రత్యామ్నాయ నాయకుడెవరు..? ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది అనే పరిణామాలపై మరో సర్వేకు రెడీ అవుతున్నారని సమాచారం.  ఏది ఏమైనా ఫైనల్ రిపోర్టు ఆధారంగానే ఈ సారి టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. కేసీఆర్ హిట్ లిస్టులో ఉన్న వారి సంఖ్య నలభై మందికి పైగా ఉందని తెలుస్తోంది. ఆ నలభై మంది ఎవరు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.