రాజ్యాంగ ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాలు అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రికీ అందాలె

రాజ్యాంగ ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాలు అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రికీ అందాలె

ప్రపంచం మొత్తం మీద భారత ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి డా.బీ ఆర్ ​అంబేద్కర్​ రాసిన రాజ్యాంగమే కారణం. అయితే స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు దాటుతున్నా కనీస అవసరాలు కూడా తీరని పేదలు, బడుగులు దేశంలో చాలా మందే ఉన్నారు. తారతమ్యాలు లేని, లింగవివక్ష లేని, సమానత్వం రావాలంటే.. సంపద అందరికీ చెందాలి. విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు సమానంగా అందినప్పుడే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందినట్లు లెక్క. 

మనతోపాటు కొంచెం అటు ఇటుగా స్వాతంత్ర్యం పొందిన ఇతర దేశాలు అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించాయి. మనదేశంలో కూడా అభివృద్ధి జరుగుతున్నా.. అది ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. అభివృద్ధి ప్రణాళికల అమలు, సాగునీటి ప్రాజెక్టులు కట్టడంలో శ్రద్ధ చూపించ లేదు. పలు అంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జాతీయ నివేదికలను పరిశీలిస్తే ప్రపంచ జనాభాలో ఆరో వంతుగా ఉన్న మనదేశం మేధోసంపత్తి, కష్టపడేతత్వం, నైపుణ్యాలు అనేక దేశాల కంటే మెరుగైన వాతావరణ పరిస్థితుల రీత్యా ప్రపంచంలోని మొదటి10 దేశాల్లో ఒకటిగా ఉంది. అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత 20 పేద దేశాల సరసన కూడా ఉంది. అనేక సమస్యలను పరిష్కరించగలిగిన విలువైన సహజవనరులు..  మానవ వనరులు ఉన్న మనదేశంలో దశాబ్దాలు గడుస్తున్నా ప్రజల జీవన ప్రమాణాల్లో మాత్రం అనుకున్నంత మెరుగుదల సాధించలేకపోవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం బాధాక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రం. దేశంలో కనీస అవసరాలు తీరని ప్రజలు ఇంకా ఉన్నారు. ప్రగతి ఫలాలు కొద్ది మందికి మాత్రమే అందుతున్నాయి. ఏడు దశాబ్దాలు దాటినా దేశంలో మెజారిటీ ప్రజలు ఇప్పటికీ స్వాతంత్ర్యం ముందునాటి కూడు, గూడు, ఉపాధి వంటి సమస్యలతోనే నేటికీ సతమతమవుతున్నారు. నేటికీ సమస్యల పరిష్కారంపైనే పోరాడుతున్నారు. నిజానికి దేశాన్ని ఓ అవకాశాల గనిగా మార్చే అవకాశాలను మన రాజ్యాంగం కల్పించింది. అన్ని వర్గాల వారి సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేసింది. సమాజంలో సమ్మిళిత అభివృద్ధి సాధించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డానికి భారత రాజ్యాంగం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించింది. రాజ్యాంగంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ విధానాలు ఏవిధంగా ఉండాలో స్పష్టంగా తెలిపాయి. 

ఆదేశిక సూత్రాల స్ఫూర్తిని విస్మరిస్తే..

ఆదేశిక సూత్రాలు తారతమ్యాలు, లింగవివక్ష లేని సమానత్వం రావాలని, సంపద అందరికీ చెందాలని, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటివి అందరికీ అందాలని పేర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలుగా పేర్కొనే చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థలు నడుచుకోవాల్సిన తీరుతెన్నులు, వాటి అంతిమ లక్ష్యాలు మొదలైన అంశాలను స్పష్టం చేశాయి. క్లుప్తంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత సమాజం సంపూర్ణంగా ప్రజాస్వామికీకరణ జరిగే అవకాశాన్ని ప్రజలు సంక్షేమ అభి వృద్ధి ఫలాలు పొందే అవకాశాన్ని ఆదేశిక సూత్రాలు అందించాయి. భారత రాజ్యాంగం అందించిన మహత్తర అవకాశాలను దేశ రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోవడంలేదు. ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వివిధ ప్రజాస్వామిక, రాజకీయ వ్యవస్థలను సమర్థవంతంగా దేశ ప్రయోజనాల కోసం నిర్వహించలేకపోయాయి. ఆదేశిక సూత్రాల స్ఫూర్తిని విస్మరించాయి. ఫలితంగానే గత ఏడు దశాబ్దాలుగా దేశంలో అనేక అనర్థాలు జరిగాయి. దేశ సహజ వనరు సంపద కొద్ది మంది వ్యక్తుల గుప్పిట్లోకి పోయింది. ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు.

కొంతమంది చేతుల్లోకి అధికారం..

విధానపరమైన వైఫల్యాలే దేశ అభివృద్ధికి అవరోధంగా మారాయి. ప్రభుత్వాల ప్రాధాన్యతలు, విధానాలు గతి తప్పాయి. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల, అందరికీ ఉపాధి కల్పన మొదలైన అంశాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా కొన్ని వర్గాలు, కులాలు పాలక వర్గాలుగా మారాయి. కొద్దిమంది చేతుల్లో అధికారం కేంద్రీకృతం అవుతోంది. రాజ్యాంగంలో ఏర్పర్చుకొన్న సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాలకు ప్రభుత్వాలు దూరంగా జరగడం, వాటిని విస్మరించడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందువల్లనే పంచవర్ష ప్రణాళికలు అమలు జరిపేందుకు పెట్టే లక్షల కోట్లు ఖర్చు.. అభివృద్ధి లెక్కల్లో ఇన్​క్లూజివ్​గ్రోత్ కనపడకపోవడం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏటా ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్​లో సంక్షేమ రంగానికి జరిగే కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. నిజానికి ఇవి ప్రాధాన్యతా రంగాల స్థాయి నుంచి మొక్కుబడి స్థాయికి ఏనాడో దిగజారిపోయాయి.

పన్నుల లెక్కలు తీస్తే..

ప్రభుత్వాదాయం ప్రజల ద్వారా పన్నుల రూపేణా సమకూరుతున్నదే. ప్రతి వస్తువుపైనా పన్ను ఉంటుంది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల్లో ఎంతమేరకు తిరిగి వారి సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారో లెక్కలు తీస్తే జరుగుతున్న అన్యాయం అర్థం అవుతుంది. సంక్షేమ రంగంలో ఖర్చు పెట్టేందుకు నిధులు లేవంటూ కేటాయించే అరకొర నిధుల్ని కూడా సరిగ్గా ఖర్చుపెట్టకుండా కోతలు పెట్టే ప్రభుత్వాలు మరోపక్క విపరీతమైన దుబారా చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్న వారి విలాసాలకు కోట్లాది రూపాయల ప్రజాధనం మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తలుగా ఉండాల్సిన వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పాలకులు, పాలితులు అనే విభజన ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ప్రజాస్వామ్యంలో ఇచ్చేవారు, తీసుకొనేవారు అనే తేడా లేదు. ప్రజలే ఇవ్వాలి. ప్రజలే తీసుకోవాలి. కాని తామేదో కొన్ని వర్గాలను ఉద్దరించడం కోసమే అధికారం చేపట్టినట్లు వారి ప్రయోజనాలకు ఉదారంగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు చిత్రీకరణ జరుగుతోంది.

ఓటేస్తే బాధ్యత తీరిపోదు..

ప్రజాస్వామ్యంలో ప్రజలకు కొన్నిహక్కులు, బాధ్యతలు ఉన్నాయి. ప్రజల్లో ప్రజాస్వామిక స్పృహ ఉన్నా వారు తమ దైనందిన సమస్యలతో సతమతమవుతూ తమలోని చొరవను.. చైతన్యాన్ని.. హక్కులను..  బాధ్యతలను గుర్తించడం లేదు. ఎవరికో ఒకరికి ఓటు వేయడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తాము పాలకులమనే సంగతిని ప్రజలు మరిచిపోతున్నారు. వారికి ఎదురయ్యే కష్టనష్టాలను అయిదేండ్ల వరకు మౌనంగా భరిస్తున్నారు. ప్రజల్లో ఇటువంటి నిరాశా నిస్పృహలు పెరగడం ప్రజాస్వామ్యానికి చేటు. మన రాజ్యాంగ వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొనే మీడియా ప్రస్తుత పరిస్థితుల్లో అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ప్రజలను చైతన్య పర్చడంలో మీడియా రాజీలేని పోరాటం చేయగలగాలి. ప్రజాస్వామ్యాన్ని ఎల్లవేళలా 
పరిరక్షించాలని కోరుకుందాం.

ఇష్టానుసారంగా నిధుల ఖర్చు..

రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి ప్రాధాన్యతలు లేకుండా నేతలు నిధులను తమ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారు. ప్రజలు తమ ప్రతినిధులను ఐదేండ్ల పాటు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేందుకు ఎన్నుకుంటారు. కానీ వారి వైఖరిని గమనిస్తే తాము ఐదేండ్లకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం అనే స్పృహ లేకుండా రాచరిక వ్యవస్థకు ప్రతిరూపంగా, నవాబులుగా, చక్రవర్తులుగా, రాజులుగా తమను తాము భావించుకుంటున్నారు. అనేక వ్యవస్థల సమన్వయంతో నిపుణుల సూచనలతో ప్రజల కోసం రూపొందించాల్సిన పనులను కొద్ది మంది ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్వార్థంతో చేపడుతూ ప్రజాధనాన్ని పక్కకు మళ్లిస్తున్నారు. 
- మన్నారం నాగరాజు, సోషల్​ ఎనలిస్ట్​