ఇన్సూరెన్స్‌‌ ప్రీమియంలకు..జీఎస్‌‌టీ మినహాయింపు!

ఇన్సూరెన్స్‌‌ ప్రీమియంలకు..జీఎస్‌‌టీ మినహాయింపు!
  • ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి తగ్గించాలని మినిస్టర్ల గ్రూప్ సలహా
  • కవరేజ్‌‌తో సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్స్‌‌కు ట్యాక్స్ ఉపశమనం
  • నోట్‌‌బుక్‌‌లు, సైకిళ్లు, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్‌‌పై తగ్గనున్న జీఎస్‌‌టీ

న్యూఢిల్లీ : ఇన్సూరెన్స్‌‌ ప్రీమియంలను  గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌‌టీ) నుంచి  మినహాయించాలని  గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌కు  రికమండ్ చేయనుంది.   లైఫ్ ఇన్సూరెన్స్‌‌  టెర్మ్‌‌ పాలసీల ప్రీమియంలపై, అలానే సీనియర్ సిటిజన్స్ చెల్లించే హెల్త్‌‌ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్‌‌టీ మినహాయింపు దొరికే అవకాశం ఉంది.  లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్‌‌లపై జీఎస్‌‌టీ రేట్లను తగ్గించాలని జీఓఎం సలహా ఇచ్చిందని, సీనియర్ సిటిజన్స్‌‌తో పాటు రూ. 5 లక్షల లోపు హెల్త్‌‌ కవరేజ్ తీసుకునే ఇండివిడ్యువల్స్‌‌కూ మినహాయింపు దొరకొచ్చని  సంబంధిత అధికారి పేర్కొన్నారు.  

ఈ అంశంపై తుది నిర్ణయం జీఎస్‌‌టీ కౌన్సిల్ తీసుకుంటుంది. కానీ, రూ.5 లక్షల కంటే ఎక్కువ కవరేజ్ అందించే పాలసీల  ప్రీమియంలపై 18 శాతం జీఎస్‌‌టీ కొనసాగుతుందని అంచనా.  ప్రస్తుతం  లైఫ్ ఇన్సూరెన్స్ టెర్మ్ పాలసీలు, ఫ్యామిలీ  మొత్తం కోసం తీసుకునే‌‌  పాలసీలు  కోసం చెల్లించే ప్రీమియంలపై 18 శాతం జీఎస్‌‌టీ పడుతోంది. ‘ప్రజలకు రిలీఫ్‌‌ ఇవ్వాలని  ప్రతీ జీఓఎం మెంబర్ నిర్ణయించుకున్నారు’ అని  బిహార్‌‌‌‌ డిప్యూటీ సీఎం సామ్రాట్​  చౌదరి అన్నారు. త్వరలో తమ రిపోర్ట్‌‌ను జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌కు సబ్మిట్ చేస్తామని పేర్కొన్నారు.  

కాగా, పాలసీ కవరేజ్‌‌తో సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్లు చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియంలపై  జీఎస్‌‌టీ మినహాయింపు ఉండే ఛాన్స్ ఉంది.   హెల్త్‌‌, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై  జీఎస్‌‌టీ ఎంత వేయాలనే అంశంపై చర్చించేందుకు 13 మెంబర్లతో జీఓఎంను జీఎస్‌‌టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ గ్రూప్‌‌కు సామ్రాట్​ చౌదరి కన్వీనర్‌‌‌‌గా ఉన్నారు. ఇందులో  ఉత్తరప్రదేశ్‌‌, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌‌, కర్నాటక, కేరళ,  ఆంధ్రప్రదేశ్‌‌,  గోవా, గుజరాత్‌‌, పంజాబ్‌‌, తమిళనాడు, తెలంగాణ, మేఘాలయ రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్లు మెంబర్లుగా ఉన్నారు. 

డ్రింకింగ్ వాటర్‌‌‌‌పై తగ్గనున్న జీఎస్‌‌టీ..

20 లీటర్ల ప్యాకేజ్డ్‌‌ డ్రింకింగ్ వాటర్‌‌‌‌ బాటిల్స్‌‌పై జీఎస్‌‌టీని తగ్గించాలని  జీఓఎం శనివారం నిర్ణయించింది.  దీంతో పాటు  సైకిళ్లు,   ఎక్స్‌‌ర్‌‌‌‌సైజ్‌‌  నోట్‌‌బుక్‌‌లపై జీఎస్‌‌టీ రేటును 5 శాతానికి తగ్గించాలని జీఎస్‌‌టీ కౌన్సిల్‌‌కు ఇచ్చే రిపోర్ట్‌‌లో రికమండ్ చేసింది. మరోవైపు    లగ్జరీ చేతి గడియారాలు, షూలపై జీఎస్‌‌టీ పెంచాలని  పేర్కొంది. జీఓఎం చేసే తాజా సవరణల వలన ప్రభుత్వానికి అదనంగా రూ.22 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా.  ‘ప్రస్తుతం 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్‌‌పై 18 శాతం జీఎస్‌‌టీ పడుతుండగా దీన్ని 5 శాతానికి తగ్గించాలని జీఓఎం సలహా ఇచ్చింది.

అలానే రూ.10 వేల కంటే తక్కువ విలువుండే సైకిళ్లపై జీఎస్‌‌టీ 12 శాతం నుంచి 5 శాతం తగ్గే ఛాన్స్ ఉంది. ఎక్స్‌‌ర్‌‌‌‌సైజ్ నోట్‌‌బుక్స్‌‌పై జీఎస్‌‌టీ 12 శాతం నుంచి  5 శాతానికి తగ్గించాలని జీఓఎం రికమండ్ చేసింది. రూ. 15 వేల కంటే ఎక్కువ విలువుండే షూస్‌‌పై, రూ.25 వేల కంటే ఎక్కువ విలువుండే చేతి గడియారాలపై  జీఎస్‌‌టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెరగనుంది’ అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. సుమారు 100 ప్రొడక్ట్‌‌లపై   జీఎస్‌‌టీని సవరించడంపై  జీఓఎం శనివారం చర్చించింది.