2024లో ఇండియాలో కారు సేల్స్ 5 శాతం మాత్రమే పెరిగినట్లు ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నివేదిక బయటపెట్టింది. 2024లో మొత్తం 43 లక్షల కార్ల అమ్మకాలు ఇండియాలో జరిగాయని, 2023లో 41.1 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయని ఆ నివేదిక పేర్కొంది. బడ్జెట్లో ఇచ్చిన ఇన్సెంటివ్స్ పైనే కార్ల పరిశ్రమ ఆశలు పెట్టుకుంది. కార్ల రేట్లు గణనీయంగా పెరగడం వల్లే అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణంగా తెలిసింది. పైగా.. సేఫ్టీ రెగ్యులేషన్స్ కొన్నేళ్ల నుంచి కఠినంగా అమలు చేయడం కూడా కార్ల కొనుగోళ్లు తగ్గడానికి కారణం అయి ఉండొచ్చని ఆటోమొబైల్ రంగం భావిస్తోంది.
అయితే.. లగ్జరీ కార్ల కంపెనీలకు 2024 బాగానే కలిసొచ్చింది. ప్రతి గంటకు ఆరు కార్లను అమ్మగలిగాయి. రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువున్న కార్ల సేల్స్ ఊపందుకున్నాయి. కొత్త ఏడాదిలో కూడా లగ్జరీ కార్లకు డిమాండ్ బాగుంటుందని, చాలా కంపెనీలు కొత్త మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2024లో సుమారు 50 వేల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. 2025లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ 8–10 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ | కొత్త కారు ప్లానింగ్ లో ఉన్నారా.. ఈ ఏడాది రిలీజ్ అయ్యే న్యూ మోడల్స్ ఇవే..!
ఇండియాలో అమ్ముడవుతున్న మొత్తం కార్లలో లగ్జరీ కార్ల వాటా ఒక శాతంగా ఉంది. ఇతర పెద్ద ఎకానమీలతో పోలిస్తే ఇండియాలోనే లగ్జరీ కార్ల మార్కెట్ వాటా తక్కువగా ఉంది. యూఎస్, చైనా తర్వాత ఎక్కువగా బిలియనీర్లు ఇండియాలో ఉన్నారు. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం, 2028 నాటికి ఇండియాలో ధనవంతులు (రూ.255 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు) 19,908 కి చేరుకోనున్నారు. 2023 లో నమోదైన 13,263 మందితో పోలిస్తే 50 శాతం పెరుగుతారని అంచనా. ఇదే టైమ్‌లో చైనా, టర్కీ, మలేషి యాలోనూ ధనవంతులు ఎక్కువగా పెరగనున్నారు. దీంతో ఇండియా లగ్జరీ కార్ల మార్కెట్‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.