- ఆరేండ్లు దాటినా పనులు పూర్తి కాలే
- నిధులు సరిపోలేదని పెద్దపల్లి మున్సిపల్ ఫండ్స్ కేటాయింపు
- నిర్ణయాలన్నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లోనే?
పెద్దపల్లి, వెలుగు: జిల్లా కేంద్రంలోని గుండం చెరువు మున్సిపాలిటీకి గుదిబండగా మారింది. చెరువు మినీ ట్యాంక్‌బండ్ ఏర్పాటుకు 2016లో మంత్రి కేటీఆర్ రూ.7.5 కోట్లు సాంక్షన్ చేశారు. ఇప్పటికీ ఆరేండ్లు దాటినా పనులు పూర్తి కాలేదు. నిధులు లేకపోవడంతో పెద్దపల్లి మున్సిపాలిటీ సాధారణ నిధులు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీపై ఎమ్మెల్యే అజమాయిషీ సాగుతోందని, ఈ అక్రమాలపై విచారణ చేయించాలని గత సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కోడలు చైర్ పర్సన్ కావడంతో..
పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు గుండం కట్ట కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.80 లక్షలు రద్దు చేయాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్‌ను కోరారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎమ్మెల్యే (దాసరి మనోహర్‌రెడ్డి) కోడలు కావడంతో ఈ ఫండ్స్ కేటాయిస్తూ రూలింగ్ పార్టీ కౌన్సిలర్లు తీర్మానం ఆమోదించారని ఆరోపించారు. ఒకే మీటింగ్ ఎజెండాలో ఎల్లమ్మ గుండం చెరువు పనులకు రూ.1.20 కోట్లు నిధుల కేటాయించారన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ నర్సరీలకు నీరు పోయడానికి రెండు ట్యాంకర్లు సరిపోగా, ఐదు ట్యాంకర్లకు రూ.13 లక్షల కేటాయింపులు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
గ్రీన్ బడ్జెట్ అంతా అవినీతే..
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 7వ విడత హరితహారంలో రూ.కోటి అవినీతి జరిగిందని, నిధుల దుర్వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రూ.32 లక్షలతో విత్తనాలు, మొక్కలు కొన్నట్లు రికార్డుల్లో చూపారని, ట్రీ గార్డుల నిర్మాణానికి రూ.10 లక్షలు, ట్యాంకర్లకు రూ.18 లక్షలు, జేసీబీలకు అద్దె చెల్లింపులలో అవినీతి జరిగిందన్నారు. మరో రూ.30 లక్షలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇతర గ్రాంట్ల ద్వారా ఖర్చయినట్లు చూపెట్టారని, వాటికి కూడా ఎలాంటి లెక్కలు లేవని కౌన్సిలర్లు ఆరోపించారు.
చర్చకు తావు లేకుండా చేస్తున్నరు
మున్సిపాలిటీలో ఎలాంటి చర్చకు తావు లేకుండా చేస్తున్నారు. బడ్జెట్ కూడా అలాగే చేశారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే మున్సిపాలిటీ నడుస్తోంది. చాలా నిధుల గోల్మాల్ జరుగుతోంది. అధికారులు విచారణ జరపాలి. - సుభాష్, కాంగ్రెస్ కౌన్సిలర్, పెద్దపల్లి
అవసరమున్నకాడనిధులిస్తలేరు
నిధులు ఎక్కడైతే అవసరమవుతాయో అక్కడ నిధులు కేటాయిస్తలేరు. కేటాయింపు మొత్తం ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంది. నిర్ణయాలు క్యాంప్ ఆఫీసులోనే జరుగుతున్నాయి. కౌన్సిల్లో చర్చకు రాకుండానే ప్రతీ అంశాన్ని అమలు చేస్తున్నారు. కమిషనర్‌కూడా నామమాత్రం అయ్యిండు. - భూతగడ్డ సంపత్, కౌన్సిలర్, పెద్దపల్లి