- ముద్దముద్ద, మెత్తగా, బంకబంకగా అన్నం
- హాస్టళ్లకూ నూక, దొడ్డు బియ్యం సరఫరా
- తినలేక స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు
- సన్న బియ్యం పెడుతున్నా మంటూ సర్కారు ప్రచారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాలకు సన్న బియ్యం అందడం లేదు. సన్నబియ్యం పేరుతో దొడ్డు బియ్యాన్ని అందిస్తున్నరు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి గురుకులాలకు పంపుతున్నరు. ఈ రైస్‌నే వండటంతో అన్నం ముద్దముద్దగా, బంకబంకగా, మెత్తగా, బిరుసుగా అవుతున్నది. దీంతో బువ్వ తినలేక స్టూడెంట్స్ తిప్పలు పడుతున్నరు. ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లలో నూక బియ్యం, దొడ్డు బియ్యం పంపుతుండగా.. ఇప్పుడు గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే గురుకులాలకు దొడ్డు బియ్యం సరఫరా.. సర్కారుకు తెలిసే జరుగుతున్నదా లేక మధ్యలో అధికారులు చేస్తున్నరా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
సన్నబియ్యంలా కనిపించినా..
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. వీటిలో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2015 నుంచి గురుకులాలు, హాస్టళ్లలో సన్నబియ్యం పెట్టాలని సర్కారు నిర్ణయించింది. కొన్నాళ్ల కిందటి దాకా ఇది అమలవుతూ వచ్చింది. కానీ ఇటీవల గురుకులాల్లో సన్నబియ్యం బంద్ చేశారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి వాటినే పంపిస్తున్నారు. బియ్యాన్ని పాలిష్ చేయడంతో సన్నబియ్యం మాదిరి నిగనిగలాడుతూ కనిపిస్తోంది. తీరా ఈ బియ్యాన్ని వండితే అన్నం ఖరాబ్ అవుతోంది. గిన్నెలో పైన మామూలుగా కనిపిస్తున్నా.. అడుగున మాడిపోతోంది. అన్నం ఎట్ల వండినా మంచిగ అయితలేదని వర్కర్లు వాపోతున్నారు. నీళ్లు తక్కువగా పెట్టినా, ఎక్కువగా పెట్టినా, ఆడికాడికి పెట్టినా ఆగమైతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెస్ చార్జీలు పెంచలే.. సగం మెనూనే
రాష్ట్రవ్యాప్తంగా 669 ఎస్సీ, 419 బీసీ ప్రీమెట్రిక్ హాస్టళ్లు, 204 ఎస్సీ, 278 బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. మరో 136 ఎస్టీ హాస్టళ్లు, 326 ఆశ్రమ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 2.6 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారు. కొన్ని రోజుల వరకు హాస్టల్ విద్యార్థులకు కూడా సన్న బియ్యాన్ని సర్కారు పంపిణీ చేసింది. కానీ లాక్‌డౌన్ తర్వాతి నుంచి నూక బియ్యం, పాలిష్ చేసిన బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా హాస్టళ్లలో కూడా అన్నం మంచిగా కావడంలేదు. మరోవైపు మెనూ కూడా సక్కగా పాటించడంలేదు.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అన్నింటిపై ఎఫెక్ట్ పడింది. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.
చివరిసారిగా 2017 తర్వాత మెస్ చార్జీలు పెంచగా.. ఆ తర్వాత మళ్లీ పెంచలేదు. దీంతో పెరిగిన అన్ని రకాల ధరలతో గురుకులాల్లో సగం మెనూనే అమలు చేస్తున్నారు. నీళ్ల కూరలు, అరకొర భోజనంతో నెట్టుకొస్తున్నరు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే గుడ్డు పెడుతున్నారు. 10 కిలోల పప్పు వండాల్సిన చోట 5 కిలోలతోనే సరిపెడుతున్నారు. దీంతో కూరలు మొత్తం నీళ్లునీళ్లుగా, చారు లెక్క చేస్తున్నారు. చాలీచాలని ఆహారం, నాసిరకం ఫుడ్‌తో స్టూడెంట్లు పౌష్టికాహారలోపం బారిన పడుతున్నారు.
తినలేక తిప్పలు
గురుకులాలు అంటనే మంచి చదువు, వసతి అనే పేరుంది. వీటిల్లో సీట్లు రావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఎంట్రెన్స్ టెస్ట్‌లో మంచి ర్యాంక్ వస్తే అడ్మిషన్ లభిస్తుంది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లను కాదని వీటిల్లో చదివేందుకు ఇష్టపడుతుంటారు. కానీ సర్కారు తీరుతో గురుకులాల్లో ప్రమాణాలు తగ్గుతూ వస్తున్నాయి. సరిగా ఫుడ్ దొరక్కపోవడంతో స్టూడెంట్స్ అర్ధాకలితో అలమటిస్తున్నారు. అన్నం ముద్దముద్దగా, గడ్డలుగడ్డలుగా, మెత్తగా అవుతుండటంతో సరిగా తినడంలేదు. కొంత మంది తింటే కడుపు నొప్పి వస్తోందని తక్కువ తింటున్నారు. మరికొందరు అన్నం తినడం మానేస్తూ బయట చిరుతిండ్లు తింటున్నారు.
సన్న బియ్యమే పంపాలె
సన్న బియ్యం పెడ్తున్నమని కేసీఆర్ గప్పాలు కొడుతున్నరు. ఇప్పుడు కొత్తగా దొడ్డు బియ్యం పెట్టడం ఏంటి? ఇది దారుణం. అరకొర వసతులు, పౌష్టికాహారం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముద్ద అన్నం ఎట్ల తింటరు? పైకి ఒకటి చెప్పి.. లోపల ఇంకొకటి ఇవ్వడం సరికాదు. ఎప్పటి లాగే సన్న బియ్యాన్ని సరఫరా చేయాలి. - పగిళ్ల సతీశ్, బీసీ స్టూడెంట్ యూనియన్ లీడర్
మంచి బువ్వ పెట్టాలె
సర్కారు సన్న బియ్యం పెడ్తున్నామని చెప్తూనే దొడ్డు, నూకల బియ్యం అందిస్తోంది. ఇటీవల ఫీల్డ్ విజిట్‌లోనూ ఇదే విషయం బయటపడింది. గురుకులాలకు ఉన్న మంచి పేరునే చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేట్లు పెరగడంతో అరకొరగా ఫుడ్ అందిస్తున్నారు. ఐదేండ్ల కింద రేట్లనే ఇంకా అమలు చేస్తున్నారు. సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలి. - పి.శ్రీహరి, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్