కరోనా వల్ల ప్రైవేటు ఉద్యోగులు, టీచర్ల జీవితాల్లో అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా ఉన్నట్టుండి వేల మంది ఉద్యోగాలు పోయి బతుకులు రోడ్డున పట్టాయి. పొట్టగడవని పరిస్థితి ఏర్పడింది. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రైవైటు టీచర్లు, లెక్చరర్లు చావలేక, బతకలేక జీవచ్ఛవంలా మారిపోయారు. 8 నెలలుగా మేనేజ్ మెంట్ నుంచి నయా పైసా రాక, కుటుంబాలను పోషించలేక అవస్థలు పడుతున్నారు. మార్చి నుంచి ప్రతి నెల కనీసం సగం జీతం అయినా ఇవ్వాలని ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
పొట్ట గడవక పస్తులుండి, ఇంటిని నడపలేక ఒకరి దగ్గర చేయిచాపలేక కొంతమంది ప్రైవేటు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి సేవలు వాడుకున్న యాజమాన్యాలు కరోనా కష్టకాలంలో కనీస సహకారం అందించకపోవడంతో రోడ్డున పడేపరిస్థితి వచ్చింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నేడు కూలి పనులు చేస్తూ, ఆటో నడుపుతూ పొట్ట నింపుకుంటున్నారు.
మార్చి 23న లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఉపాధ్యాయులకు యాజమాన్యాలు జీతాలివ్వకుండా నిలిపివేశాయి. మార్చి తర్వాత స్కూళ్లు జరిగే కాలం తక్కువే. జూన్ వరకూ వేసవి సెలవులు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఆ కాలానికి కూడా జీతాలు ఇచ్చే ఒప్పందం పైనే ప్రైవేటు స్కూళ్లలో టీచర్లు పని చేస్తారు. కానీ కరోనా సాకుతో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు మొత్తం జీతాలు ఎగ్గొట్టేశాయి. ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న ఫీజు బకాయిల్లో 90 శాతం సొమ్మును యాజమాన్యాలు వసూలు చేశాయి. ఫీజు కట్టకపోతే ఆన్ లైన్ క్లాసులు చెప్పడం కుదరదని, పాత ఫీజులతో పాటు కొత్త ఫీజులు వసూలు చేశారు. అయినప్పటికీ అక్కడ పని చేసే ఉపాధ్యాయులకు జీతాలు మాత్రం ఇవ్వలేదు.
అక్కడక్కడా చిన్న స్కూళ్లు ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. బడా స్కూళ్లుగా చెప్పుకొనే కార్పొరేట్ సంస్థలు పిల్లల నుంచి పూర్తి స్థాయిలో ఫీజులు వసూలు చేసినా టీచర్లకు పూర్తి జీతం ఇవ్వలేదు. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలు కాని దుస్థితి నెలకొంది. తమకు నెలలు తరబడి జీతాలు ఇవ్వలేదని చాలా మంది ఉపాధ్యాయులు అధికారులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. యాజమాన్యాలకు నోటీసులిచ్చి మమ అనిపించారే తప్ప సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకొని ప్రైవేటు టీచర్ల కుటుంబాల విలువ నిలపాలి. ఆకలి బాధ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తప్పించాలి. -ఆవుల రాజేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సామాజిక రచయితల సంఘం.