ముందుజాగ్రత్త చర్యలు ఏవీ? సీజనల్ వ్యాధులపై  రివ్యూ చేయని ఆరోగ్య శాఖ

ముందుజాగ్రత్త చర్యలు ఏవీ?
సీజనల్ వ్యాధులపై  రివ్యూ చేయని ఆరోగ్య శాఖ
డెంగీ, టైఫాయిడ్  కేసులు వస్తున్నాయంటున్న డాక్టర్లు
నివారణ చర్యలు తీసుకోకపోతే కేసులు పెరుగుతాయని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో జ్వరాల సీజన్ మొదలైనా సన్నద్ధతపై ఆరోగ్య శాఖ ఇప్పటి వరకూ సమీక్ష చేయలేదు. ఈ సీజనల్‌‌‌‌లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో కనీసం ఓ ప్రకటనను కూడా విడుదల చేయలేదు. రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేసేందుకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా ఓ విభాగం ఉంది. అయితే, రాష్ట్ర సర్కారు పట్టింపులేనితనంతో ఆ విభాగం నిరుపయోగంగా మారింది. ఆ విభాగంలో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఉన్న అధికారులు ఖాళీగా ఉంటుండగా, సిబ్బందిని ఇతర పనుల కోసం వినియోగించుకుంటున్నారు.

ప్రతి వర్షాకాలం సీజనల్‌‌‌‌ రోగాలు విపరీతంగా ప్రబలి దవాఖాన్లు కిటకిటలాడుతున్నాయి. సర్కారు దవాఖాన్లలో వైద్యం సరిగా అందకపోవడం, బెడ్లు దొరక్కపోవడం వంటి పరిస్థితుల్లో జనాలు ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించి ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రివెంటివ్  హెల్త్ కేర్‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెడుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌ రావు పదేపదే చెప్తున్నారు. అందు కోసమే బస్తీ దవాఖాన్లు, పల్లె దవాఖాన్లు, సబ్‌‌‌‌ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ కేర్  సెంటర్లను బలోపేతం చేస్తున్నామని ఆయన పలుమార్తు పేర్కొన్నారు.

ఇన్ని చేస్తున్నా వాటి ద్వారా ప్రివెంటివ్  చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గతంలో రోగాలు విజృంభించినప్పుడు ఆరోగ్య శాఖ ఒకవైపు, పంచాయతీరాజ్‌‌‌‌, మునిసిపల్  శాఖల అధికారులు మరోవైపు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రోగాలు వచ్చి జనాలు దవాఖాన్లలో చేరిన తర్వాతే ఆరోగ్య శాఖ చూసుకుంటుందని, రోగాలు ప్రబలకుండా గ్రామాలను, పట్టణాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత తమ పరిధిలోకి రాదని ఆరోగ్య శాఖ ఆఫీసర్లు ఆరోపించారు. తమ పని తాము చేశామని, రోగాలు రాకుండా జాగ్రత్తలను వివరించాల్సిన ఆరోగ్యశాఖ ఆ పని చేయకుండా తమను నిందిస్తోందని పంచాయతీరాజ్‌‌‌‌, మునిసిపల్  ఆఫీసర్లు ప్రతిదాడి చేశారు. కాగా, సర్కార్​ నిర్లక్ష్యంపై డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ALSO READ:పాలోళ్ల మధ్య భూముల లొల్లి గొడ్డళ్లతో దాడి..జక్కులపల్లిలో ఘటన

వందల సంఖ్యలో డెంగీ, టైఫాయిడ్ కేసులు

రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నా.. నెల రోజుల కిందటి నుంచే పలు చోట్ల డెంగీ, టైఫాయిడ్  కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు వర్షాలతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ నెల 12 నుంచి 25 వరకు 7,598 మంది డెంగీ లక్షణాలతో, 18,289 మంది మలేరియా లక్షణాలతో, 5749 మంది టైఫాయిడ్ లక్షణాలతో దవాఖాన్లలో అడ్మిట్ అయ్యారు. వారిలో 504 మందికి డెంగీ, 573 మందికి టైఫాయిడ్, నలుగురికి మలేరియా ఉన్నట్లు టెస్టుల్లో తేలింది. మిగిలినవారికి వైరల్  ఫీవర్లుగా గుర్తించి ట్రీట్‌‌‌‌మెంట్ అందిస్తున్నారు.