కరోనా మహమ్మారి సృష్టించిన విలయం తర్వాత ఆరోగ్యానికి మనదేశంలో ప్రాధాన్యత పెరిగింది. కానీ, విఫలమైన పాత ఆరోగ్య విధానాన్నే ఇంకా కొనసాగిస్తే.. ఖర్చు పెరుగుతుంది తప్ప ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందదు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన ఆరోగ్యాన్ని జనాభా మొత్తానికి అందించడం అతి పెద్ద సవాలే. టెక్నాలజీలో ముందడుగులు, కొత్త కొత్త ఆవిష్కరణల వల్ల ఆరోగ్యంపై వ్యయం పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వైద్య సేవలను ఉచితంగా లేదంటే ఓ మోస్తరు ఫీజుతో పౌరులందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఇందుకోసం ఒక బలమైన, జాతీయ స్థాయి ఆరోగ్య నమూనా ఉండటం ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకునే ఈనాటి సంక్షోభాన్ని పరిష్కరించేలా, రేపటి అవసరాలను తీర్చేలా, ప్రతి రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునేలా ఎఫ్డీఆర్/లోక్‌సత్తా ఒక ప్రత్యేకమైన ఆరోగ్య విధానాన్ని రూపొందించింది.
అనారోగ్యం వల్ల దేశంలో ఏటా 6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నారు. తెలంగాణలో 19 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ లో 26 లక్షల మంది కొత్తగా బీదలైపోతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యకు ప్రజలు జేబుల్లో నుంచి చేస్తున్న ఖర్చు మొత్తం కుటుంబ వినియోగ వ్యయంలో 10 శాతం లేదా ఇంకా ఎక్కువే ఉంటోంది. మొత్తం ఇంటి ఖర్చులో ఆరోగ్యం వాటా 1993--–94లో 4.9 శాతం ఉంటే 2011-–12 నాటికి 7.2 శాతానికి పెరిగింది. తీవ్ర అనారోగ్యాల చికిత్స వ్యయ భారాన్ని మోస్తున్న కుటుంబాల సంఖ్య 2004లో 21 శాతం ఉంటే, 2014లో అది 25 శాతానికి పెరిగింది. అధికంగా జేబుల్లో నుంచి ఖర్చు, ఆరోగ్య వైఫల్యం, ఆదాయాల్ని కోల్పోవటం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలను పేదరికంలోకి నెట్టటమో, ఆర్థికంగా కుంగదీయటమో జరుగుతోంది. అందుకే ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్నేండ్లు గడిచినా దేశంలో పేదరికం విషవలయంలా కొనసాగుతోంది.
ఎన్నో మంచి ప్రయత్నాలు జరిగినా..
రెండు దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో దేశంలో కొన్ని మంచి ప్రయత్నాలు జరిగాయి. జాతీయ ఆరోగ్య మిషన్, 108 అంబులెన్స్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ, మొహల్లా క్లినిక్ లు, ఆయుష్మాన్ భారత్ వీటిలో చెప్పుకోదగినవి. కానీ ప్రాథమిక ఆరోగ్యం నుంచి అందరికీ ఆరోగ్యాన్నిచ్చే సమగ్ర విధానం లేకుండా పైస్థాయిలో పథకాలు అమలు చేయటం సరిపోదని కరోనా మహమ్మారి తెలియచెప్పింది. ఈ నేపథ్యంలో సరైన ఆరోగ్యం కోసం శాశ్వత ఏర్పాట్లు కావాలన్న డిమాండ్ వస్తోంది. సమగ్ర ఆరోగ్య విధానం అమలుకు ఇది సరైన సమయం. అందుకే వైద్య, పాలన, సామాజిక, రాజకీయ రంగాల్లో, విధానాల రూపకల్పనలో ఉన్న అవగాహనను, అనుభవాన్ని రంగరించి వివిధ దేశాల వ్యవస్థల్ని, నిపుణుల పరిశీలనల్ని, మన దేశ పరిస్థితుల్ని, అనుభవాల్ని, అత్యుత్తమ పద్ధతుల్ని అధ్యయనం చేసి అందరికీ ఆరోగ్యం కోసం ఒక సమగ్ర విధానాన్ని ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్(ఎఫ్డీఆర్) రూపొందించింది. ఇప్పుడున్న కార్యక్రమాల్ని కొనసాగిస్తూ, జాతీయాదాయంలో 0.4% పెంపుతో ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా అందరికీ ఆరోగ్యాన్ని అందించే ఆచరణసాధ్య నమూనా ఇది.
తొలి దశలో..
ఈ నమూనాలోని ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో ప్రతి పౌరునికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ఔట్ పేషెంట్(ఓపీ) సేవలు పూర్తిగా ఇతని వద్దే ఉంటాయి. జేబులో పైసా లేకున్నా ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్లి ఓపీ పరీక్షలు చేయించుకోవచ్చు. వైద్య పరీక్షలు, మందులు ఉచితం. ప్రభుత్వం చెప్పిన ఫ్యామిలీ డాక్టర్ నే ప్రజలు ఆమోదించనక్కర్లేదు. పది మంది బృందంలో మెరుగైన సేవలందిస్తారనే నమ్మకమున్న వారిని ఎంచుకోవచ్చు. ఈ డాక్టర్ల బృందం గ్రామాలకు 5–6 కిలోమీటర్ల దూరంలోని చిన్న పట్టణాల్లో ఉంటుంది. డాక్టర్లు ఒక్కొక్కరు రోజుకు 40–-50 మంది రోగులను చూస్తారు. అందరికీ నాణ్యమైన సేవలు అందుతాయి. మెరుగైన వైద్యం అవసరమనుకుంటే అలాంటి రోగులను సిఫార్సు చేసేలా ద్వితీయ, తృతీయ స్థాయి ఆస్పత్రి సేవలతో ఈ డాక్టర్లు అనుసంధానమై ఉంటారు. వారే సమన్వయం చేసుకుంటారు. డాక్టర్లకు కన్సల్టేషన్ ఫీజును ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. ఫ్యామిలీ క్లినిక్ నిర్వహణను సదరు డాక్టరే చూసుకుంటారు. ఖర్చులన్నీ పోగా డాక్టర్లకు నెలకు రూ.లక్ష దాకా ఆదాయం వస్తుంది. ఫ్యామిలీ డాక్టర్‌గా పనిచేయటానికి ఎంబీబీఎస్ చదివిన వారు ముందుకు రావటానికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకం ఇది. హైపర్ టెన్షన్, షుగర్, కేన్సర్, గుండెజబ్బు వంటి దీర్ఘకాల వ్యాధుల భారాన్ని ఈ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలో సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఆ పట్టణంలోనే ఉచిత ఔషధాలకు, ఉచిత వైద్యపరీక్షలకు ఏర్పాటుంటుంది. డాక్టర్‌ను సంప్రదించటం, పరీక్షలు చేయించుకోవటం, ఔషధాలు కొనుక్కోవటం - అన్నీ ఉచితంగా, ఉన్న ఊరికి దగ్గరలో అందుబాటులో ఉంటాయి. అలాగే ఫ్యామిలీ క్లినిక్‌లు స్థానికంగా ఉండే పీహెచ్‌సీలు సమన్వయంతో పనిచేస్తాయి. ప్రజారోగ్య కార్యక్రమాలైన టీకాలు, గర్భిణుల పరీక్షలు, పౌష్టికాహార లోపాన్ని అంచనా వేయటం, అంటువ్యాధుల చికిత్స, దీర్ఘకాల వ్యాధుల నియంత్రణ వంటి ప్రాథమిక, నివారణ వైద్యాలను ఫ్యామిలీ క్లినిక్స్ వద్ద అందిస్తారు. పీహెచ్‌సీలు.. వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, పౌష్టికాహారం, పారిశుద్ధ్యం కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ సేవలు, క్షేత్రస్థాయి పర్యటనలు, వ్యాధులపై సర్వేలకు బాధ్యత వహిస్తుంది. సరైన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ లేకపోవటం వల్ల చిన్న జ్వరాలకు కూడా ప్రస్తుతం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీనివల్ల, అవసరమైన రోగులకు డాక్టర్లు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కారం దక్కుతుంది.
రెండో దశలో..
ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల ఆస్పత్రులు ఇన్‌పేషెంట్ సేవలకు మాత్రమే పరిమితం. అత్యవసరాలు మినహాయించి అన్ని కేసుల్లోనూ కింద స్థాయి వైద్యుని నుంచి సిఫార్సు(రెఫరల్) తప్పనిసరి. అన్ని ఆస్పత్రి సేవలు, శిశు జననాలు, సిజేరియన్ సహా ప్రసూతి సేవలు, పొత్తికడుపు లేదా కంటి శుక్లాల ఆపరేషన్లు వంటి ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకున్న సేవలు లేదా తక్షణ, అత్యవసర సేవలు రెండో దశలో భాగంగా ఉంటాయి. ఇందులో ఆస్పత్రి పడకలు, శస్త్రచికిత్సలు, ఆధునిక వైద్య సేవలు అవసరం కావచ్చు. ఈ స్థాయి ఆస్పత్రి సేవల్లో తక్కువ ఖర్చయ్యే సాధారణ చికిత్సలు ఉంటాయి. రెండో దశ చికిత్సలో ఒక ఆపరేషన్ థియేటర్, ఎక్స్ రే యంత్రం, ఇతర మౌలిక రోగ నిర్ధారణ పరీక్ష ఏర్పాట్లు, ఆక్సిజన్ నిర్వహణ సదుపాయాలు, ఇంకా ఇన్ పేషెంట్, ఆపరేషన్ అనంతర వైద్య సేవలకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. చిన్న నర్సింగ్ హోంలను ద్వితీయ స్థాయి వైద్యంలో కీలకంగా చేస్తే, నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుతో చిన్న పట్టణాల్లోనే అందించవచ్చు. ప్రభుత్వ బీమా కార్యక్రమంలో ప్రైవేటు భాగస్వామ్యం ఈ చిన్న నర్సింగ్ హోంలకే పరిమితం కావాలి. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాల్లోని వైద్య సేవల్లో 50 శాతానికి పైగా క్లిష్టమైన తృతీయ స్థాయి చికిత్సలకు సంబంధించే ఉంటున్నాయి. ప్రభుత్వ బీమా చెల్లింపులు అత్యధిక భాగం ప్రైవేటు రంగానికి వెళ్తున్నాయి. ఈ భారం ఏటికేడు పెరుగుతోంది. చాలా ద్వితీయ స్థాయి చికిత్సలకు ఖరీదైన మౌలిక సదుపాయాలు, పరికరాలు అక్కర్లేదు. చిన్న ప్రైవేటు నర్సింగ్ హోంలు నాణ్యమైన ద్వితీయ స్థాయి సేవల్ని సమర్థవంతంగా అందించగలవు. అందువల్ల తృతీయ స్థాయి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ నుంచి తొలగించి, ద్వితీయ స్థాయి వైద్యానికే పరిమితం చేయటం మేలు. అలాగే ఆదాయాలు, రేషన్ కార్డు, ఇతర ధృవీకరణ పత్రాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కవరేజీని విస్తరించాలి.
మూడో దశలో..
తృతీయ స్థాయిలో నాణ్యమైన, ఖర్చుకు తగ్గ ఫలితాలనిచ్చే వైద్య సేవలందించేలా జిల్లా, ప్రభుత్వ బోధనాస్పత్రులను అభివృద్ధి చేయాలి. కాలిన గాయాలు, గుండెజబ్బులు, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు, బహుళ ట్రామా, కీళ్ల సర్జరీలు, బహుళ-వ్యవస్థ జబ్బులు, కేన్సర్ చికిత్స, న్యూరో సర్జరీ వగైరాలకు ప్రత్యేకమైన చికిత్సలు తృతీయ స్థాయి వైద్యంలో భాగంగా ఉంటాయి. ప్రాథమిక, ద్వితీయ స్థాయి వైద్యుల సిఫార్సుతో మాత్రమే ఈ సేవలందిస్తారు. ఆస్పత్రి ఆరోగ్య వ్యవస్థలో ఎక్కువ శాతం ప్రభుత్వ రంగంలో ఉన్న బ్రిటన్ నమూనా మనం అనుసరించదగినది. సర్కారు చేసే ప్రతి రూపాయి ఖర్చుకీ ఈ ప్రభుత్వ ఆస్పత్రులు నాలుగు రూపాయల విలువైన సేవలను అందిస్తున్నాయని ఎఫ్డీఆర్ అధ్యయనంలో తేలింది. తృతీయ స్థాయి వైద్యంలో టయర్ 1 ఆస్పత్రుల్లో (మంచి సదుపాయాలు, దీర్ఘకాల చరిత్ర, అనుభవం ఉన్న 140 ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు) అన్ని పరికరాలు, వనరులు, నైపుణ్యాలతో దాదాపు 1,40,000 పడకల్ని అధునాతన మూడో దశ వైద్యానికి సిద్ధం చేయాలి. టయర్ 2 ఆస్పత్రుల్లోని (మిగిలిన ప్రభుత్వ బోధనా ఆసుపత్రులు, అన్ని జిల్లా ఆస్పత్రులు కలిపి) 1,47,000 పడకల్ని నాణ్యమైన తృతీయ స్థాయి వైద్యాన్ని అందుబాటు వ్యయంలో అందించేలా బలోపేతం చేయాలి. వైద్య సేవలు దుర్వినియోగం కాకుండా కొన్ని రకాల ముందు జాగ్రత్తలు మినహాయించి, ఈ ఆరోగ్య నమూనాలోని అన్ని సేవలూ ప్రజలందరికీ ఉచితం. దీని అమలులో తమ ప్రాంత ప్రత్యేక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా జోడింపులు, సవరణలను రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఈ నమూనాలో ద్వితీయ స్థాయి వైద్యంలో, కొన్ని సేవల్లో ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యం ఉంటుంది. అయితే అన్ని స్థాయిల్లో కూడా ప్రైవేటు వైద్యం ఎటువంటి అవరోధాలు లేకుండా యధాతథంగా కొనసాగుతుంది. వనరులున్న వారు స్వేచ్ఛగా తమకు నచ్చిన ప్రైవేటు సేవలను పొందవచ్చు.
అయ్యే ఖర్చు తక్కువే
ఈ నమూనా అమలుకు అదనంగా అయ్యే వ్యయం ఏడాదికి సుమారు రూ.85,000 కోట్లు. అంటే జీడీపీలో దాదాపు 0.4%. ఈ అదనపు వ్యయాన్ని కలుపుకున్నా కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యయం ఆరోగ్యంపై 1.6% మాత్రమే. ప్రపంచంలోనే అన్ని ప్రధాన దేశాలతో పోల్చినా అతి తక్కువగానే ఉంటుంది. తెలంగాణ, ఏపీల్లో అదనపు వ్యయం వరుసగా ఏడాదికి రూ.1,900 కోట్లు, రూ.2,600 కోట్లు ఉంటుంది. ఈ నమూనాను మూడేండ్ల కాలవ్యవధిలో దశలవారీగా అమలు చేయవచ్చు. ప్రభుత్వ ఖజానాకు తక్కువ ఖర్చు అయ్యేలా, దేశంలోని పేదలు ఆరోగ్య భారంతో సంక్షోభంలో కూరుకుపోకుండా, అత్యుత్తమ ఫలితాలనిచ్చే వినూత్న ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలతో, పౌరులందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించటం ఈ ఆరోగ్య సంస్కరణ లక్ష్యం. వనరుల కేటాయింపు సమర్థవంతంగా ఉండేలా చేయటంలో ప్రైవేటు ఆరోగ్య మార్కెట్లు విఫలమైనందున, అందరికీ తక్కువ వ్యయంలో, అందుబాటులో ఆరోగ్యాన్ని అందించటంలో ప్రభుత్వ జోక్యం కీలకంగా మారింది.
తెలుగు రాష్ట్రాలు నాయకత్వం వహించాలె
ఈ విధానం అమలులో కేంద్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మొత్తం దేశానికి దిశానిర్దేశం చేసేలా ఒక బలమైన, జాతీయ స్థాయి ఆరోగ్య నమూనా ఉండటం అవసరం. అదేసమయంలో వైద్య, ఆరోగ్యం రాష్ట్రాల అంశం కాబట్టి, అమలులో రాష్ట్రాల భాగస్వామ్యం ఎంతో కీలకమైనది. సంక్షేమ పథకాల కోసం దేశంలోనే రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాలు ఖర్చు చేస్తున్నాయి. అందులో కొద్దిగా ఈ నమూనా కోసం ఖర్చు చేస్తే.. ఎంతో మంది శాశ్వతంగా పేదరికం నుంచి బయట పడతారు. మిగతా అన్ని రంగాల్లో యధాతథ స్థితిని కొనసాగించినా, ఒక్క ఆరోగ్య రంగంలో ప్రజలకు సేవల్ని మెరుగుపరిస్తే దశాబ్ద కాలంలో దేశంలో పేదరికం తొలగిపోతుంది. అందుకే తెలుగు రాష్ట్రాలు ఈ ఆరోగ్య విధానం అమలుకు నాయకత్వం వహించాలి. దేశానికి మార్గదర్శకత్వం వహించాలి. ఆరోగ్య రంగంలో ఇంకా తీసుకురావలసిన సంస్కరణలు ఉన్నాయి. కానీ ఈ నమూనాను అమలు చేస్తే, దేశంలో ఒక పటిష్ట, ఆచరణసాధ్యమైన, అందుబాటులో ఉండే, అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించే సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్
ఎఫ్డీఆర్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు