పట్నం పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్

పట్నం పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్ల దాడి ఘటనలో బొమ్రాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‎లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై సోమవారం (నవంబర్ 25) హైకోర్టులో విచారణ జరిగింది. 

బొమ్రాస్‌పేట పోలీసులు లగచర్ల దాడి ఘటనలో 3 ఎఫ్ఐఆర్‎లు నమోదు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పిటిషనర్‌ తరుఫు న్యాయవాది.. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు పెట్టవద్దన్న సుప్రీం తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోలీసుల తరుఫున కేసుల వివరాలను అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌ అందించారు. లగచర్లలో జరిగిన దాడి ఆధారంగా పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారని తెలిపారు. సోమవారం ఇరువైపులా వాదనలు ముగియడంతో.. పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‎పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 

కాగా, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయం స్వీకరించేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డిని ఏ1గా, బీఆర్ఎస్ కార్యకర్త భోగమోని సురేష్‎ను ఏ2 నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు.