పత్తి రైతులు పరేషాన్ భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు

హైదరాబాద్, వెలుగు: పత్తి రైతులు పరేషాన్‌‌లో ఉన్నారు. ఈ సీజన్‌‌లో కురిసిన భారీ వర్షాలు వారిని మరింత దెబ్బతీశాయి. వరదలకు పంటలు మునిగి తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టాయి. కాస్తో కూస్తో మిగిలిన పంటలకు కూడా తెగళ్లు సోకి ఎర్రబడ్డాయి. దీంతో ఏం చయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వానాకాలం ప్రారంభంలో వర్షాలు లేక పత్తి సాగుకు ఇబ్బందిగా మారింది. నీటి వసతి లేక నాటిన విత్తనాలు మొలవక, మొలిచినవి ఎండలకు ఎదగలేకపోయాయి. అనంతరం జులై, ఆగస్టులో వానలు కురవడంతో పత్తి పంటలకు జీవం పోసినట్లయ్యింది. 

అయితే తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆయా జిల్లాల్లో పత్తి పంట వేల ఎకరాల్లో నీట మునిగింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా పత్తి పంటపై ఎఫెక్ట్ పడింది. దాదాపు లక్ష ఎకరాల్లో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి చేన్లను బతికించుకునేందుకు రైతులు మళ్లీ అప్పులు చేసి, పైమందులను స్ప్రే చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎర్రబారిన పత్తి చేన్లు... 

రాష్ట్రంలో ఈ ఏడాది 43.29 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. సీజన్ ఆలస్యం అవడంతో వానలపై ఆధారపడి పత్తి సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీటి వసతి ఉన్న రైతులే కరెక్ట్‌‌ టైమ్‌‌కు పత్తిని వేశారు. ఈ నెల ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలతో పంట నీట మునిగింది. ముంపు ప్రాంతాల్లోని పొలాల్లో నీళ్లు నిలిచిపోవడంతో పత్తి మొక్కలు ఎర్రబడి తెగుళ్లు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పటికే పంట కోసం భారీగా పెట్టుబడి పెట్టామని, దీనికి తోడు పత్తి చేన్లలో కలుపును తొలగించడానికి కూలీల ఖర్చు కూడా తడిసి మోపెడవుతోందని అంటున్నారు. పెట్టుబడి ఖర్చులన్నీ కలిపి ఎకరానికి రూ.40 వేలకు పైగా ఖర్చు అయినట్లు వెల్లడించారు. ఇంత ఖర్చు పెట్టినా భారీ వర్షాలతో పంటకు తెగులు సోకి ఎర్రబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌడు భూముల్లో పత్తి ఎర్రబడడం తగ్గినా నల్లరేగడి భూముల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ఈసారి లాగోడీ వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నరు.

ఈ జిల్లాల్లో భారీగా నష్టం.. 

ఇటీవల రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల వల్ల మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, ములుగు జిల్లాల్లో పత్తి పంట భారీగా నీట మునిగింది. నల్గొండ జిల్లాలో పత్తి 5.40 లక్షల ఎకరాల్లో సాగైంది. ఖమ్మం జిల్లాలో 1.97 లక్షల ఎకరాలు, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలో 78 వేల ఎకరాల చొప్పున సాగు జరిగింది. అయితే, ఈ జిల్లాల్లో భారీగా పంట నీట మునగడంతో ఈ జిల్లాల్లో పత్తి పంటపై ఎక్కువగా ప్రభావం పడినట్లు వ్యవసాయ శాఖ అధ్యయనంలో తేలింది.