ఇరాన్​ అధ్యక్షుడి హెలికాప్టర్​ క్రాష్​ 

  • అజర్​బైజాన్ ​సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ప్రమాదం
  • డ్యామ్​ను ప్రారంభించి వస్తుండగా ఘటన
  • హెలికాప్టర్​లో ప్రెసిడెంట్​ ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి హోసేన్ 
  • కాన్వాయ్​లోని మూడు హెలికాప్టర్స్​లో రెండు సేఫ్​
  • గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది
  • భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం
  • ప్రమాదంపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి

దుబాయ్​: ఇరాన్​అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అది అటవీప్రాంతంలో కుప్పకూలింది.  ఇరాన్​ రాజధాని టెహ్రాన్​కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న​ అజర్​బైజాన్​ సరిహద్దుల్లోని జోల్ఫా సిటీకి సమీపంలో ఈ ఘటన జరిగింది. అధ్యక్షుడి చాపర్​తోపాటు కాన్వాయ్​లో మరో రెండు హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ రెండు గమ్యస్థానానికి సేఫ్​గా చేరుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

 వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఇబ్రహీం రైసీ  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయినట్టు భావిస్తున్నారు.  ఈ ఘటన జరిగిన చోటికి రెస్క్యూ సిబ్బంది చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, భారీవర్షం, గాలుల వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు కలుగుతున్నాయి. 

 రైసీతోపాటు హెలికాప్టర్​ లో ఆ దేశ విదేశాంగ మంత్రి హోసేన్​ అమిరాబ్దోల్లాహియాన్‌, ఈస్ట్​ అజర్‌బైజాన్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌, బాడీగార్డ్స్​ ఇతర అధికారులు ప్రయాణిస్తున్నారు.  సంఘటనా స్థలంలో ఓ చాపర్​ క్రాష్​ అయినట్టు ఓ లోకల్​ ఆఫీసర్​ పేర్కొన్నాడు. అయితే, ఆ అధికారి అక్కడికి చేరుకున్నాడా? లేదా? అనేదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్​లో రైసీ ఉన్నారా? లేరా?.. రైసీ పరిస్థితి ఏంటి అనేదానిపై కూడా అంతర్జాతీయ మీడియాగానీ, దేశ అధికారిక మీడియాగానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

రైసీ హెలికాప్టర్​ప్రమాదానికి గురైనట్టు అధికారుల భావిస్తున్న చోటుకి ఓ రెస్క్యూ హెలికాప్టర్​ చేరుకునేందుకు ప్రయత్నించగా, భారీ పొగమంచు కారణంగా ల్యాండ్​ కాలేకపోయిందని ఇరాన్​ ఎమర్జెన్సీ సర్వీసెస్​ అధికార ప్రతినిధి బాబక్​ ఎక్తాపరసత్​ మీడియాకు తెలిపారు. 

డ్యామ్​ను ప్రారంభించి వస్తుండగా..

ఇరాన్, అజర్​బైజాన్​ సరిహద్దుల్లోని అరస్​ నదిపై ఆ రెండు దేశాలు కలిసి  డ్యామ్ నిర్మించాయి. దీన్ని అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ప్రారంభించేందుకు ఆదివారం అజర్​బైజాన్​లో పర్యటించాలని ఇబ్రహీం రైసీ షెడ్యూల్​ నిర్ణయించారు. ఈ పర్యటన ముగించుకొని వస్తుండగా ​ప్రమాదం జరిగింది. 

ఘటనపై ప్రపంచ నేతల దిగ్భ్రాంతి

ఇరాన్​అధ్యక్షుడి హెలికాప్టర్​ క్రాష్​ అయిన విషయం తెలుసుకున్న ప్రపంచ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆ దేశ ప్రజలకు భారత ప్రధాని మోదీ సంఘీభావం ప్రకటించారు. అధ్యక్షుడు, ఆయన పరివారం క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇరాన్​ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్​ ప్రమాదానికి గురైన ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నట్టు యూఎస్​ తెలిపింది.

ఈ సమయంలో దీనిపై ఎలాంటి కామెంట్స్​ చేయబోమని పేర్కొంది. ఇరాన్​కు సంబంధించి బాధ కలిగించే వార్త విన్నామని పాకిస్తాన్​ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ పేర్కొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ బతికి ఉన్నాడనే శుభవార్త కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామని తెలిపారు.  సహాయక చర్యల్లో పొరుగు దేశానికి ఎలాంటి సహకారమైనా అందించేందుకు సిద్ధమని అర్మేనియా తెలిపింది.