హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, వసతి గృహాల్లో కల్పిస్తున్న సౌలతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే కల్పించిన సౌకర్యాలు, ఇంకా మిగిలిన వాటిని పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. గురుకుల స్కూళ్లు, వసతి గృహాల్లో మౌలిక వసతులు, ఆహారం తదితరాలను అందజేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావుల బెంచ్ విచారించింది.
అదనపు అడ్వకేట్ జనరల్ వాదిస్తూ.. గత ఆదేశాల అమల్లో భాగంగా సౌకర్యాలను మెరుగుపరిచామని, దీనికి సంబంధించిన నివేదిక సమర్పించామన్నారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. వసతులకు చెందిన పలు అంశాలపై నివేదికలో ప్రస్తావించలేదన్నారు. వాదనలను విన్న బెంచ్ ఈ అంశాల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వడానికి ఈ నెల 22 వరకు గడువు ఇచ్చింది.