హైదరాబాద్, వెలుగు: హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రదర్శనలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. ఆ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేస్తూ జస్టిస్ టి.వినోద్‌కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయబోమని పోలీసులకు బీజేపీ హామీ ఇవ్వాలని షరతు విధించారు. సభకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్.. హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు.. తమ ముందున్న అంశాలను పరిశీలిస్తే సభకు అనుమతులు మంజూరు చేయడంలో వరంగల్ పోలీస్ కమిషనర్ జాప్యం చేసే ప్రయత్నం ఉన్నట్లుగా ప్రాథమికంగా అనిపిస్తోందని కామెంట్ చేసింది. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారం పర్మిషన్స్ మంజూరు విషయంలో కమిషనర్ నిర్ణయం సరిగాలేదని ఆక్షేపించింది.
వాళ్లకు పర్మిషన్ ఇచ్చారుగా..
రాష్ట్రాధినేత, కేంద్రమంత్రుల సభలకు ఇటీవల పర్మిషన్స్ ఇచ్చారని, ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా చేశారని హైకోర్టు తప్పుబట్టింది. సభలను నిర్వహించే విషయంపై ఎలాంటి గైడ్‌లైన్స్ ఇవ్వలేదని, దీనికి అసలు కారణాలు ఏమిటో ప్రభుత్వానికే తెలియాలని కామెంట్ చేసింది. ‘‘ప్రభుత్వం జులై 24 నుంచి ఎప్పటికప్పుడు సభలను నిషేధిస్తూ వస్తోంది. తొలి నిషేధ ఉత్తర్వుల ప్రకారం వాటి అమలు గడువు వారం రోజులే. ఆ తర్వాత పొడిగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ వరంగల్ పోలీస్ కమిషనర్ నిషేధ ఉత్తర్వుల పొడిగింపునకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉత్తర్వులు పొందలేదు. కాబట్టి కమిషనర్ నోటిఫికేషన్ చెల్లదు” అని హైకోర్టు తేల్చి చెప్పింది. ‘‘సభ నిర్వహించేందుకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అనుమతి ఇచ్చారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ కాలేజీలో ఉన్నందున స్టూడెంట్స్ ఇబ్బందిపడతారని ఇప్పుడు చెబుతున్నారు. కానీ ఈ కారణంగా సభ నిర్వహణ అనుమతిని ప్రిన్సిపాల్ రద్దు చేయలేదు” అని చెప్పింది. ఒక్కోసారి సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని అప్లికేషన్ పెడితే దాన్ని తేల్చకుండా పెండింగ్‌లో పెడతారని, హైకోర్టులో రిట్ దాఖలయ్యాక అప్లికేషన్‌ను డిస్మిస్ చేసినట్లుగా పోలీసులు చెబుతారని అసహనం వ్యక్తం చేసింది. హనుమకొండ సభ విషయంలో అనుమతి ఇచ్చి రద్దు చేశారని, ఇది సరికాదని కామెంట్ చేసింది. సభకు అనుమతి ఇస్తూ వరంగల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సభకు ఎంతమంది హాజరవుతారు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి వివరాలను పోలీసులకు బీజేపీ అందజేయాలని ఆదేశించింది.
నిరసన తెలిపే హక్కుంది: లాయర్
తొలుత బీజేపీ తరఫున లాయర్ ప్రభాకర్ వాదిస్తూ.. సభకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి” అని కోరారు. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. సభలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారాలు ఆఫీసర్లకు ఉన్నాయని చెప్పారు. వాదనల తర్వాత కోర్టు.. సభలను నిషేధిస్తూ వెలువడిన నోటిఫికేషన్ చట్ట వ్యతిరేకంగా ఉందని తప్పుబట్టింది.
సంజయ్ యాత్రను ఆపండి... హైకోర్టులో రాష్ట్రం అప్పీల్
సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం న్యాయపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. యాత్ర నిర్వహించేందుకు అనుమతించాలని, అడ్డుకోరాదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డిల బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఆర్డర్ కాపీ అందుబాటులో లేదని, అప్పీల్ పిటిషన్‌లో వాదనలు తెలిపేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ కోరారు. అందుకు డివిజన్ బెంచ్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.