ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం.. నోటీసులు జారీ

ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం.. నోటీసులు జారీ

హైదరాబాద్, వెలుగు: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో ప్రెస్​మీట్ పెట్టి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్లు చేశారంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం ది. ఆయన చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు జడ్జి రాసిన లేఖను కోర్టు సుమోటో క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటి షన్​గా తీసుకున్నది. దీనిపై చీఫ్​ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన బెంచ్​ గురవారం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘునందన్ రావుకు నోటీసులు జారీ చేసింది. 

హైకోర్టుకు న్యాయమూర్తి లేఖ

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత వ్యవహారంలో ఆగస్టు 24న ఎంపీ రఘునందన్‌ రావు ప్రెస్​మీట్ పెట్టి న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని న్యాయమూర్తి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు సంబంధించి.. 2014లో ఒక జడ్జి కూల్చివేయాలని ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రస్తు తం స్టే ఎలా ఇస్తారని కోర్టును రఘునందన్‌రావు ప్రశ్నించారని లేఖలో పేర్కొన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌ మేనేజ్​మెంట్ అత్యవసరంగా హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయగానే గతంలో జరిగిన సంఘటనలను, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా స్టే ఇవ్వడం సరికాదంటూ ఆరోపించారని తెలిపారు. 

న్యాయమూర్తులు కండ్లకు గంతలు తీసి చుట్టూ జరుగుతున్న వాటిని పరిశీలించి తగిన ఉత్త ర్వులు జారీ చేయాలంటూ విమర్శలు చేశారని లేఖలో చెప్పారు. అడ్వొకేట్లు పిటిషన్‌లు దాఖలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందుతున్నారని, ఈ కేసులను రిజిస్ట్రీ మళ్లీ విచారణకు లిస్ట్‌ చేయడంలేదని, వీటిపై ప్రధాన న్యాయమూర్తి విచారించాలంటూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.