ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ?

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ?
  •     మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడ్తరు  
  •     రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం
  •     మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 10 వేల కోట్ల బియ్యం రావాల్సి ఉన్నది 
  •     ఆ బియ్యం ఎటు పోయినయ్?
  •     దాదాపు అందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నరని కామెంట్​
  •     అక్రమాలను తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి ఆదేశాలిస్తామని హెచ్చరిక 

హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకుని, తిరిగి బియ్యం అప్పగించకపోవడంపై ఫైర్ అయింది.  సూర్యాపేటలోని ఓ రైస్ మిల్లు యజమాని దాదాపు రూ.64 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించకపోవడంతో రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌ శాఖలు రికవరీకి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆ మిల్లును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు. దీంతో మిల్లును స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆ మిల్లు ఓనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ విజయ్​సేన్‌ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మిల్లర్ల తీరుపై ఆయన కీలక కామెంట్లు చేశారు. ‘‘ప్రభుత్వం నుంచి లక్షల క్వింటాళ్ల వడ్లు తీసుకుంటున్న మిల్లర్లు.. తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఎందుకు అప్పగించడం లేదు? అసలు ఆ బియ్యం ఎక్కడికి పోయినట్టు? ఆ రహస్యం కాస్త మాక్కూడా చెప్పండి. బియ్యం ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ బరాబర్​పెడ్తరు. అందులో తప్పేముంది? ఆ యాక్ట్‌ లేకపోతే బియ్యం రికవరీ చేయడానికి.. మీ జీవితంతో పాటు నా జీవితం కూడా సరిపోదు” అని ఆయన అన్నారు.

ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకుంటున్న మిల్లర్లు.. తిరిగి బియ్యం ఎందుకు అప్పగించడం లేదని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లకు ప్రభుత్వం ఇస్తున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడం లేదు. వేల క్వింటాళ్ల బియ్యం మాయమవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఆ బియ్యం ఎటు పోయినట్టు?’’ అని ఆయన ప్రశ్నించారు. దాదాపు అన్ని రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లులు ఇలాగే చేస్తున్నాయని కామెంట్​చేశారు. ‘‘రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యం అది.

అంటే అది మా సొమ్ము. మేమంతా పన్నులు కడితే ఆ అకౌంట్​లో నుంచి తీసి కట్టిన డబ్బు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఒకవేళ వడ్లు తీసుకునే ఉద్దేశం లేకపోతే తీసుకోకండి. మిమ్మల్ని తీసుకొమ్మని ఎవరు బలవంత పెడుతున్నారు? అవసరమైతే సర్కార్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అమ్ముకుంటుంది. అదీ కాకపోతే గ్లోబల్‌‌‌‌‌‌‌‌ టెండర్లు కూడా పిలుస్తామని చెప్తున్నది. ప్రభుత్వాన్ని అనడానికి ఏమీ లేదు. తప్పంతా స్వార్థంగా ఆలోచించే కొంతమంది వ్యాపారుల్లోనే ఉంది’’  అని రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లను ఉద్దేశించి మండిపడ్డారు. 

ముక్కిపోయిన బియ్యం ఎట్లిస్తరు?  

కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి ముక్కిపోయిన బియ్యం ఇవ్వడంపైనా జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొన్ని మిల్లుల నుంచి ప్రభుత్వానికి ముక్కిపోయిన బియ్యం పంపిస్తున్నారు. అట్లెట్ల పంపిస్తరు? నేను చిన్నగున్నప్పుడు మా తాత ఇంటికి పోతే.. అప్పట్లో బియ్యాన్ని నిల్వ చేసుకుని చాలా కాలం వాడు కునేవారు. అలాంటిది అంత పెద్ద రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లులు నడుపుతున్న యజమానుల దగ్గర గోడౌన్ల వ్యవస్థతో పాటు ఇతర వసతులు కూడా ఉంటాయి కదా! మరి అలాంటప్పుడు ముక్కిపోయిన బియ్యం ఎలా ఇస్తారు?’’ అని ప్రశ్నించారు. 

ఏసీబీని రంగంలోకి దింపుతం..  

మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై అవసరమైతే ఏసీబీని రంగంలోకి దింపుతామని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తెలిపారు. ‘‘రాష్ట్రంలోని దాదాపు అన్ని రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుల్లో బియ్యం నిల్వలు తిరిగి ఇవ్వలేదని తెలుస్తున్నది. ఇందులోని అక్రమాలను తేల్చడానికి అవసరమైతే ఏసీబీని రంగంలోకి దింపుతం. దీన్ని చివరి అవకాశంగా వాడతాం. కేవలం రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లే కాదు.. ఇందులో సంబంధం ఉన్న అధికారుల పాత్ర పైనా దర్యాప్తు చేయిస్తాం’ అని హెచ్చరించారు.

రాష్ట్రంలో రైస్‌ మిల్లర్లు ప్రభుత్వం ఇస్తున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడం లేదు. వేల క్వింటాళ్ల బియ్యం మాయమవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఆ బియ్యం ఎటు పోయినట్టు?
- జస్టిస్​ విజయ్​సేన్​ రెడ్డి