స్పెషల్‌‌‌‌ బ్యారెక్‌‌లో పట్నం నరేందర్‌‌రెడ్డి..ఇంటి వంటకు హైకోర్టు అనుమతి

  • నరేందర్‌‌ భార్య శ్రుతి పిటిషన్‌‌తో ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: లగచర్ల దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న బీఆర్‌‌ఎస్‌‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌రెడ్డిని ప్రత్యేక బ్యారెక్‌‌లో ఉంచాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు ఇంటి నుంచి తీసుకొచ్చే భోజనాన్ని అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తన భర్తను నేరస్తులైన ఇతర ఖైదీలతో కలిపి ఉంచడాన్ని సవాల్‌‌ చేస్తూ నరేందర్‌‌రెడ్డి భార్య పట్నం శృతి దాఖలు చేసిన పిటిషన్‌‌ను జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి మంగళవారం విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్‌‌ లాయర్లు సాముల రవీందర్, గండ్ర మోహన్‌‌రావు వాదనలు వినిపించారు.

నేరాలకు పాల్పడిన ఇతర ఖైదీలతో కలిసి ఉంటే నరేందర్‌‌రెడ్డికి ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌‌, ఇతరులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన లేదన్నారు. నేరాలకు పాల్పడిన ఖైదీలతో కాకుండా ప్రత్యేక బ్యారెక్‌‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 15న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, జైళ్ల శాఖ ఇన్‌‌స్పెక్టర్‌‌ జనరల్, చర్లపల్లి సూపరింటెండెంట్‌‌లకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ స్పందన లేదన్నారు. జైలు మాన్యువల్‌‌ ప్రకారం ఆ ముగ్గురు అధికారులు పిటిషనర్‌‌ భర్తకు జైల్లో ప్రత్యేక వసతి కల్పనకు చర్యలు తీసుకోలేదన్నారు.

పిటిషనర్‌‌ భర్తకు ప్రాణహాని ఉన్నందున జైలు చట్టం–1984 ప్రకారం ప్రత్యేక వసతి కల్పన చేసేందుకు జైలు అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద పిటిషనర్‌‌ భర్త హక్కులను కాపాడాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటి    షనర్‌‌ భర్తకు ప్రత్యేక బ్యారెక్‌‌ ఏర్పాటు చేయాలని జైలు అథార్టీని ఆదేశించింది. అదే విధంగా పిటిషనర్‌‌ ఇంటి నుంచి తీసుకొచ్చే ఆహారం నరేందర్‌‌రెడ్డికి రోజూ ఇవ్వాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.