హైదరాబాద్, వెలుగు: ఏదైనా పరిశ్రమను మూసేయాలని సింపుల్‌గా నోటీసు ఇస్తే చాలదని, ఆ పరిశ్రమ ఏ చట్టాన్ని అతిక్రమించిందో నోటీసులో వివరంగా పేర్కొవాలనే విషయం గుర్తుంచుకోవాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు హితవు చెప్పింది. కారణాన్ని పేర్కొనకుండా పరిశ్రమను మూసేయాలని నోటీసు ఇవ్వడం కరెక్ట్ కాదంది. హైదరాబాద్ శివారులోని శాస్త్రిపురంలో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలకు నోటీసు ఇచ్చే ముందు చట్టంలో ఏముందో ఆఫీసర్లు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పింది. నోటీసుల జారీపై తమకు నేరుగా వివరించేందుకు ఈ నెల 15న జరిగే విచారణకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. శాస్త్రిపురంలోని గోడౌన్‌ను మూసేయాలని మార్చి 5న జీహెచ్‌ఎంసీ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ మహ్మద్ తౌఫీక్ అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్‌ను శుక్రవారం చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్ బెంచ్ విచారించింది.
మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలిచ్చిందని హైకోర్టు గుర్తుచేస్తూనే జీహెచ్‌ఎంసీ ఇచ్చే నోటీసులో మాస్టర్ ప్లాన్‌ను ఉల్లంఘిచారా లేక ఇతర చట్టాలను ఉల్లంఘించారో పేర్కొనలేదని తీవ్రంగా ఆక్షేపించింది. పిటిషనర్ ట్రేడింగ్ మాత్రమే చేస్తున్నారని, చెత్తను రోడ్డుపై వేయడం, కట్టెలు కాల్చి చట్టాన్ని ఉల్లంఘించారని జీహెచ్‌ఎంసీ నోటీసు ఇచ్చిందని ఆయన తరఫు లాయర్ బెంచ్‌కు తెలిపారు. జీహెచ్‌ఎంసీ లాయర్ వాదనలు వినిపిస్తూ, లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ క్షేత్రస్థాయిలో పర్యటించాక ఇచ్చిన రిపోర్ట్ మేరకే తమ చర్యలున్నాయని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. జీహెచ్‌ఎంసీ పలు విషయాలు చెబుతోందని, అయితే ఏ చట్టాన్ని ఉల్లంఘించిందీ నోటీసులో పేర్కొనాలనే విషయాన్ని మాత్రం విస్మరించిందని తప్పుపట్టింది.