హైదరాబాద్, వెలుగు: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. యాత్ర మధ్యలో ఆగిపోయినందున షర్మిల మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత పోలీసులు అనుమతివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టు మంగళవారం తీర్పునిస్తూ కొన్ని కండిషన్లు విధించింది. సీఎం కేసీఆర్‌పై, రాజకీయ, మతపరంగా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని, లీడర్లను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని చెప్పింది. యాత్ర వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంది. షరతులు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేసే స్వేచ్ఛ పోలీసులకు ఉందని పేర్కొంది.
అనుచిత కామెంట్ల వల్లే పర్మిషన్ రద్దు చేసినం: ప్రభుత్వం వివరణ
నర్సంపేటలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్‌ఎస్ అనుచరులు ఆమె యాత్రను సోమవారం అడ్డుకున్నారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ నెల 26 నుంచి 29 వరకు వరంగల్ జిల్లాలో పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. దీనిని తప్పుపడుతూ వైఎస్సార్‌టీపీ లీగల్ సెల్ మెంబర్ డి.రవీంద్రనాథ్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు.
అనుమతి తీసుకున్నాకే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని, నోటీసు ఇవ్వకుండానే వాటిని రద్దు చేశారని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. పాదయాత్రను అడ్డుకోవడం, షర్మిలను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలే దాడికి ప్రయత్నించారని చెప్పారు. సీఎంతో పాటు ఇతర నేతలపై షర్మిల అనుచిత కామెంట్లు చేయడం వల్లే యాత్రను రద్దు చేయాల్సివచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అనంతరం యాత్రకు అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.