ఆదేశించినా.. డెక్కన్ కిచెన్​ను ఎలా కూల్చారు?.. జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులపై హైకోర్టు ఫైర్

ఆదేశించినా.. డెక్కన్ కిచెన్​ను ఎలా కూల్చారు?

జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు : తమ ఆదేశాల్ని ఎందుకు అమలు చేయడం లేదని జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. జులై 11న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని జీహెచ్‌‌‌‌ ఎంసీ కమిషనర్‌‌‌‌ లోకేశ్​కుమార్, డిప్యూటీ కమిషనర్‌‌‌‌  రవితేజ, అసిస్టెంట్‌‌‌‌ టౌన్‌‌‌‌ ప్లానర్‌‌‌‌ రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌కు ఫారం–1 నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఏవిధమైన చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించినా జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు తమ డెక్కన్‌‌‌‌ కిచెన్‌‌‌‌ను కూల్చివేశారంటూ జూబ్లీహిల్స్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌నగర్‌‌‌‌లో డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌‌‌‌  ప్రైవేట్‌‌‌‌  లిమిటెడ్‌‌‌‌.. కోర్టు ధిక్కార పిటిషన్‌‌‌‌  దాఖలు చేసింది.

ఈ పిటిషన్​పై జస్టిస్‌‌‌‌  కన్నెగంటి లలిత విచారణ జరిపారు. పిటిషనర్‌‌‌‌  లాయర్‌‌‌‌  ఎంవీవీ బస్వరాజ్,  ప్రతివాదుల తరపున స్టాండింగ్‌‌‌‌  కౌన్సిల్‌‌‌‌  కె.సిద్ధార్థ రావు వాదించారు. జడ్జి స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూల్చివేత చర్యలు ఎలా చేపట్టారని జీహెచ్‌‌‌‌ఎంసీని నిలదీశారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరిస్తే  ప్రేక్షకపాత్ర వహించబోమని హెచ్చరించారు. తదుపరి విచారణకు అధికారులు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.