హైందవం మతం కాదు..సనాతన ధర్మం

హైందవం మతం కాదు..సనాతన ధర్మం

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం:
క్రీ.పూ. 2000లకు ముందు
సింధు లోయ నాగరికత
క్రీ.పూ. 1500-500
వేదయుగం
క్రీ.పూ. 500-క్రీ.శ.500
ఇతిహాస, పురాణ, 
చారిత్రక యుగం
క్రీ.శ. 500-1500
మధ్యయుగం
క్రీ.శ. 1500-1757
పూర్వ ఆధునిక యుగం
క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం

 

శతాబ్దాల పాటు సనాతన ధర్మంగా భావిస్తున్న హైందవ ధర్మానికి కొందరు అజ్ఞానులు మతమనే ముద్ర వేశారు. వేదాలు, ఉపనిషత్తుల్లోని అంతులేని విజ్ఞానం పునాదిగా ఏర్పడిందే హైందవ ధర్మం. మేధస్సు, ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం ఖండాంతరాలకు విస్తరించింది. సింధు లోయ నాగరికత తర్వాత సార్వజనీన జ్ఞానం పునాదిగా హిందూ ధర్మయుగం పరిడవిల్లింది. మతంగా క్రైస్తవం 1వ శతాబ్దంలో, ఇస్లాం 7వ శతాబ్దంలో ఆవిర్భవించాయి. దేవుడు ఒక్కడు అనే సిద్ధాంతంతో పుట్టిన మతాలు అవి. దేవుడు ఒక్కడేనని, ఈ విశ్వాన్ని సృష్టించింది ఆ దేవుడని ఆ మతాలు నమ్ముతాయి. ఈ రెండు నేడు ప్రపంచంలో అతి పెద్ద మతాలు. 15 శతాబ్దాల వ్యవధిలో ఇవి ప్రపంచమంతా విస్తరించాయి. కానీ, హైందవ ధర్మం దేవుడు ఒక్కడనే సిద్ధాంతంపై ఆవిర్భవించలేదు. హిందూ ధర్మాన్ని అనుసరించేవారు ఎవరినైనా.. రాళ్లు, చెట్లు, జలం, భూమిని దేనినైనా స్వేచ్ఛగా ప్రార్థించవచ్చు. ఒకే దేవుడు, ఒకే పవిత్ర గ్రంథం, ఒకే చిహ్నం, పూజలు చేసుకునేందుకు ఒక ప్రత్యేక ప్రదేశం లేదా ఒకే స్థలమన్నది హిందూ ధర్మంలో లేదు. బోధనలు, మార్పిడుల ద్వారా భౌగోళికంగా హిందూ ధర్మం విస్తరించలేదు. ఇంకా చెప్పాలంటే అది కాలక్రమంలో కుచించుకుపోయి ఇప్పుడు కేవలం భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమైపోయింది. 
ప్రవహించే నదిలాంటిది
హైందవ ధర్మానికి ఇతర మతాల ఆవిర్భావానికి ఆలంబనగా నిలిచేంత సహనం, స్వేచ్ఛ ఉన్నాయి. అందులో బౌద్ధం, సిక్కు, జైన మతాలు ఈ పవిత్ర భరత భూమిపైన ఆవిర్భవించాయి. ఒక మతం మరో మతానికి జన్మిస్తుందని ఊహించగలమా? ఇస్లాం, క్రైస్తవం, యూదు మతానికి హిందూ ధర్మానికి పోలికే లేదు. సనాతన ధర్మాన్ని ఒక మతంతో పోల్చడం సరికాదు.  చాలా మంది ఇతర మతాల పక్కన హైందవ ధర్మాన్ని ఉంచి జోడించే ప్రయత్నం చేస్తారు. మతానికి ఒక నిర్దేశిత చట్రం ఉంటుంది. దాన్ని అనుసరించేవారు ఆ నిర్దేశిత చట్రంలో తమ మతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. హైందవ ధర్మానికి అలాంటి ఒక ఏకీకృత చట్రమేమీ లేదు. సంప్రదాయాలు, ఉత్తమ ఆచరణల ఆధారంగా రూపొందిన ధర్మం అది. హైందవ ధర్మం అన్నది ఒక ప్రవహించే నది వంటిది. తన ప్రయాణంలో అది రకరకాల ఆకృతులు సంతరించుకొని చివరకు మోక్షం అనే సాగరంలో సంగమిస్తుంది.
ద్వేషానికి లేదు స్థానం
ఇతర మతాలను ద్వేషించి, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారు హైందవ ధర్మాచరులు కాదని ఇటీవల ఒక ప్రసంగంలో ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ సర్​సంఘ్‌‌ చాలక్‌‌ డాక్టర్‌‌‌‌ మోహన్‌‌ భాగవత్‌‌ స్పష్టం చేశారు. హిందూ ధర్మ నిజమైన స్ఫూర్తిని ఆ మాటలు తెలియజేస్తాయి. గడిచిన వంద ఏండ్ల కాలంలో హైందవ ధర్మాన్ని ప్రాచీన జీవనశైలి నుంచి కేవలం ఒక మతం స్థాయికి తగ్గించిన వారు దానికి సరిదిద్దలేని నష్టం కలిగించారు. రాజకీయ లబ్ధి కోసం హైందవ ధర్మాన్ని పదే పదే హిందూ మతంగా పేర్కొనడం, హైందవ ధర్మాన్ని ఆచరించే వారిని కులం, వర్గం పేరుతో ముక్కలు ముక్కలుగా చేసి హైందవ ధర్మంలోని దైవిక స్ఫూర్తిని, దానిలోని సార్వజనీన విజ్ఞానాన్ని నాశనం చేశారు. సహనం అన్నది హైందవ ధర్మసారం. సహనం, ద్వేషం కలిసికట్టుగా ఉండవనే విషయం ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. హైందవ ధర్మాన్ని ఆచరించిన వారు తమ భూభాగం, జీవితం, గుర్తింపుపై దాడి జరిగితేనో లేదా అవి ప్రమాదంలో చిక్కుకున్నప్పుడో తప్ప ఏనాడు ఇతర రాజ్యాలు, వర్గాలు, తెగలపై దాడులకు పాల్పడలేదు. చరిత్రలో ఎక్కడా కూడా హిందూ చక్రవర్తులు, రాజులు ముందస్తు దాడులకు పాల్పడిన ఘటనలు లేవు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మారు వారు. రాజ్య విస్తరణ కాంక్ష, ధార్మిక విస్తరణ, సైద్ధాంతిక యుద్ధాలు, నాగరికతా పరమైన దాడులను ఏనాడు హిందువులు చేపట్టలేదు.
స్వీయ విధ్వంసం-వంచన
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా మంది హిందువులు స్వధర్మ ఆచరణలో అంతులేని నిర్లక్ష్యం చూపి, తమ బాధ్యతలు విస్మరించడం నాకు నిజంగా ఆవేదన కలిగించింది. 1952లో హిందూ కోడ్‌‌ చట్టాన్ని తెచ్చి హైందవ ధర్మాన్ని ఒక మతంగా ముద్ర వేయడంలో దేశ తొలి ప్రధాని పండిట్‌‌ జవహర్‌‌‌‌ లాల్‌‌ నెహ్రూదే పూర్తి బాధ్యత. ఆధునిక భారతదేశంలో ఇదొక అతి పెద్ద రాజకీయ కుట్రని నేను నమ్ముతాను. ప్రాచీన ధర్మాన్ని, నాగరిక విజ్ఞాన ఆచరణను, ఒక పురాతన జీవన విధానాన్ని అవసరం లేకున్నా, ఎవరూ కోరుకోకున్నా భారతదేశపు తొలి ప్రభుత్వం తీసుకున్న అపవిత్ర నిర్ణయాన్ని  ఆనాడు హిందువులు వ్యతిరేకించలేదు. నెహ్రూ ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం హైందవ ధర్మాన్ని ఒక మతంగా మార్చేశారు. వలసవాద విద్యా వ్యవస్థ స్వీయ వాస్తవికతను గ్రహించే సహజ అనుసరణ శక్తిని నాశనం చేసింది. చాలా మంది చదువుకున్న హిందువులు తమ మూలాలు, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద, సాంస్కృతిక శ్రేష్ఠత, నాగరికత పద్ధతులను మరచిపోయి పిరికితనంతో వలస పాలన విద్యావ్యవస్థకు, పాశ్చాత్య సంస్కృతి ఎరలకు లొంగిపోయారు. ఆ బానిసత్వం దురదృష్టవశాత్తు నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా మంది హిందువులు తప్పును తప్పని, ఒప్పును ఒప్పని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి.
హిందువులను ద్వేషించేందుకు కారణం లేదు
ఇండియాలో కాని, ప్రపంచంలో మరెక్కడైనా కాని, హిందువులను ద్వేషించేందుకు ఒక్క కారణం కూడా లేదు. హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్లు ప్రపంచానికి గొప్ప సానుకూల విలువను చేకూర్చేవారే తప్ప చేటు చేసేవారు కాదు. ప్రపంచ వ్యాప్తంగా తాము జీవిస్తున్న సమాజాల్లో అంతర్గంతంగా, బాహ్యపరంగా విలువను జోడిస్తారు హిందువులు. హింస, ద్వేషాన్ని బోధించరు. ఆచరించరు. మరి ఎందుకు అకారణంగా వారిపై ద్వేషం.. దాడులు? నాగరికత వైభవాన్ని, మూల విలువలు, విస్తృతమైన ప్రాచీన విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత హైందవ ధర్మాన్ని ఆచరించే వారిపై ఉంది. హిందూ సనాతన ధర్మాన్ని ఒక మతంగా పరిగణించకుండా, ఇతర మతాలతో సరిపోల్చకుండా హిందువులు చూసుకోవాలి. ఈ బాధ్యతాయుతమైన ఆచరణతో భవిష్యత్‌‌లో అనేక ఘర్షణలను నివారించవచ్చు.

 మన పొరుగుదేశం బంగ్లాదేశ్​లో హిందువులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు, హింసాత్మక దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. సొంత గడ్డపై ఉండేందుకు భయపడేలా చేస్తూ కాశ్మీర్‌‌‌‌లో హిందువులను లక్ష్యంగా చేసుకోవడం బాధాకరం. హిందువులపై మతపిచ్చి పట్టినవాళ్లు చేస్తున్న దాడులు వారి అసమంజస నిర్లక్ష్యాన్ని, క్షమించరాని ద్వేషాన్ని చూపుతున్నాయి. నిజానికి హిందు అన్నది ఒక మతం కాదు. అది ఒక ధర్మం. పురాతన నాగరిక జీవన విధానం. హిందూ ధర్మం ఒక ఇజం కాదు. హిందూయిజం అన్నది తప్పుడు పదం. 75 ఏండ్ల క్రితం ఇండియాకి స్వాతంత్ర్యం రాక మునుపు హిందూయిజం అన్న మాటే లేదు. గత శతాబ్దంలోనే కొందరు అజ్ఞానుల కారణంగా హిందు అన్నది ఒక మతంగా పరిగణించడం జరుగుతోంది. క్రైస్తవం, ఇస్లాం, యూదు మతానికి హిందూ ధర్మం ఎప్పుడూ పోటీ కాదు. వాస్తవానికి హిందు అన్నమాటకు ఏక గుర్తింపు లేదు. పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని రకరకాల ప్రదేశాల్లో నివసించిన వారందరూ వేల సంవత్సరాల పాటు హిందువులుగా గుర్తింపు పొందారు.