చూసే కండ్లను బట్టి చరిత్ర మారదు!

చూసే కండ్లను బట్టి చరిత్ర మారదు!

‘సెప్టెంబరు 17’ నాటి చరిత్రకు నేటి స్వార్థ రాజకీయ ప్రయోజనాలను అద్దుతున్నారు. ఇంతకూ అసలేం జరిగింది? పాలకుర్తిలో ఐలమ్మ పండించిన పంటను దోచుకుని రమ్మని విసునూరు   గూండాలను పంపించాడు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభ దళం తిప్పికొట్టింది. తోకతొక్కిన పాములాగ బుసకొట్టిన విసునూరు దేశముఖ్‌ దాడికి దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు. 

తెలంగాణ సమాజాన్ని జమీందార్లు,  జాగీర్దార్లు శాసిస్తున్న కాలం అది.  తుపాకులు,  అశ్విక దళాలు,  సాయుధ బలగాలు కలిగిన ఈ భూస్వాములదే గ్రామాల మీద పెత్తనం. వీరిమీద ఆధారపడి పరిపాలిస్తున్నవాడు  నైజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌.  ముందు వీరి భూమి దున్నిన తర్వాతనే  రైతులు తమ సొంత భూములు దున్నుకోవాలి.  సమస్త వృత్తుల ప్రజలు భూస్వాములకు వెట్టి చాకిరీ చేయాలి. 

తమ ఉత్పత్తులను, 'సేవలను ఉచితంగా ఇచ్చుకోవాలి.  దొర కన్నుబడ్డ  ఆడబిడ్డ ఆరోజు పోవలసిందే. దళిత కుటుంబాలలో  రోజుకొకరు దొరవారి గడీలో చాకిరీ చేయాలి.  భూస్వామి ప్రయాణిస్తున్న బండికి ముందూ వెనకా రక్షణగా దళితులు పరుగులు పెట్టాలి. రోడ్దు మీద ఉమ్మి వేయరాదు. దొర ఎదురుపడితే  చెప్పులు చేత పట్టుకుని పక్కకు వెళ్ళిపోవాలి. 

దోపిడీ, దౌర్జన్యాలను సహించలేకపోతున్న తెలంగాణ రైతాంగం దొడ్డి కొమరయ్య కుప్పగూలడంతో అగ్గిపిడుగై ఎగిసిపడ్డది. సాయుధ తిరుగుబాటు చేసింది. పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. 12 నుంచి 18 మాసాలపాటు  గ్రామాలను రైతు కమిటీలే పరిపాలించాయి.  వెట్టి చాకిరీ రద్దయింది. కూలి రేట్లు పెరిగాయి. కార్మికులకు కనీస వేతనాలు దక్కాయి. వడ్డీ వ్యాపారుల దోపిడీ అంతమయింది. లక్షలాది 'పేదలు జీవితంలో మొదటిసారి రెండుపూటలా కడుపునిండా తిన్నారు. ఈ చారిత్రాత్మక పోరాటం ఎర్రజెండా నాయకత్వంలో సాగింది. 

ఛాందసవాదుల దాడిని తిప్పికొట్టిన సురవరం

ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం సాగిన కృషి క్రమంగా సంస్మరణోద్యమంగా  మారింది. ఇది గిట్టని ఛాందసవాదులు చేసిన దాడిని సురవరం ప్రతాపరెడ్డి లాంటి సంస్మరణవాదులు తిప్పికొట్టారు. క్రమంగా అనేకమంది ఆంధ్రమహాసభ కార్యకర్తలు కోస్తా ప్రాంతంలో సాగుతున్న ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమాలలో పాల్గొన్నారు. మరోవైపు ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు 40వ దశకంలో తెలంగాణలో  కమ్యూనిస్టు బీజాలు నాటారు. అప్పటిదాకా స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన నాటి కాంగ్రెస్‌ పార్టీ సామంత రాజ్యాలుగా ఉన్న సంస్థానాలలో మాత్రం పోరాటాలు చేయవద్దని నిర్ణయించింది. ఈ వైఖరి ఆర్యసమాజం ఆధ్వర్యంలోని మతోన్మాదులకే తోడ్పడింది.  

 రాజ్యం  రైతాంగం చేతికి చిక్కుతుందనే..

1946 సెప్టెంబర్‌ నాటికి రైతాంగ పోరాటం పతాక స్థాయికి చేరింది.  గ్రామాలు వదిలి భూస్వాములు హైదరాబాద్​కు పారిపోయి వచ్చారు.  నిజాం రాజు ఇంకేమాత్రం పరిపాలించగలిగే స్థితిలో  లేడు. నిజాం రాజ్యం కుప్పకూలే స్థితి ఏర్పడింది. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా హైదరాబాద్ సంస్థానం ఎర్రజెండా  చేతబట్టిన సాయుధ రైతాంగం చేతికి వస్తుంది. అదే జరిగితే...! ఉలిక్కిపడిన నెహ్రూ ప్రభుత్వం సెప్టెంబర్‌ 13న హైదరాబాద్ సైన్యాలను పంపింది.17వ తేదీన  నెహ్రూ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న సర్దార్‌ పటేల్‌కు, హైదరాబాద్ సంస్థానం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు మధ్య అవగాహన కుదిరింది. 

నిరంకుశ రాచరికం అంతమైనా..  రైతాంగానికి నిరాశే

విలీన ప్రకటనతో సంతోషించిన రైతాంగం ఆశలు వారం రోజుల్లోనే అడియాశలయ్యాయి. భూస్వాముల దౌర్జన్యాలు,  నిరంకుశ రాచరికం అంతమైనాయని భావించిన రైతాంగానికి నిరాశే మిగిలింది.  హోంమంత్రి సర్దార్​ పటేల్‌  నిజాం రాజును బంధించే బదులు హైదరాబాద్  రాజ్యానికి రాజప్రముఖ్‌గా నియమించారు. నష్టపరిహారం, రాజభరణం పేర్లతో ప్రభుత్వ ఖజానా నుంచి ఏడాదికి కోటి రూపాయల చొప్పున చెల్లించారు. ఉరికంబం ఎక్కించవలసిన రజాకార్‌ నాయకుడు ఖాసిం రజ్వీని సకల మర్యాదలతో ప్రత్యేక విమానంలో పాకిస్తాన్‌ పంపించి రక్షించారు. 

పేదల మీద సైన్యం దాడి ప్రారంభించింది. రైతులు దున్నుకుంటున్న  భూములు గుంజుకుని భూస్వాములకు అప్పగించడం మొదలుపెట్టింది. భూస్వాముల రక్షణ కోసం, రాజుకు మద్దతుగా కిరాతక దాడులు చేసిన రజాకార్‌ మూకలు ఇప్పుడు నెహ్రూ-పటేల్‌ సైన్యానికి ఏజెంట్లుగా మారారు. రైతాంగం ఊహించింది ఒకటి,  జరుగుతున్నది మరొకటి. తాము అప్పటికే దున్నుకుంటున్న భూముల రక్షణ కోసమైనా రైతులు ప్రతిఘటించక తప్పలేదు.  నిజాం పాలనలో 1500మందిని పొట్టనపెట్టుకోగా, యూనియన్‌ సైన్యాలు మరో 2500 మందిని పొట్టనపెట్టుకున్నాయి.

 చరిత్రకు ఆర్‌ఎస్‌ఎస్‌  వక్రభాష్యాలు 

 విలీనానికి ముందుగానీ, విలీనం తర్వాత గానీ భూతద్దం పెట్టి వెతికినా కనిపించని ఆర్‌ఎస్‌ఎస్‌, ఇప్పుడు చరిత్రకు వక్రభాష్యాలు చెపుతున్నది.  ప్రతి సందర్భంలోనూ మతం పేరుతో చిచ్చు పెట్టడమే తప్ప ప్రజా ప్రయోజనాలు వీరికి పట్టవు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటాలకు మతం రంగు పులుముతున్నారు.   

ఎర్రజెండా ప్రాధాన్యం మరింత పెరుగుతున్నది

నాటి రజాకార్ల వారసత్వపు రాజకీయ సంస్థ ఎంఐఎం. ఇప్పటికీ పాత నగరంలో ఎంఐఎం దౌర్జన్యాల మీద పోరాడుతున్నది కమ్యూనిస్టులే.  సీపీఐ(ఎం) శ్రేణుల మీద ఎంఐఎం మూకల దాడులతో జరిగిన బాహాబాహీ జగమెరిగిన సత్యం.  ఎన్నికలకు ముందు 'రజాకార్‌' పేరుతో తమ అనుయాయులు విడుదల చేసిన సినిమాను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారు.  యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. సెప్టెంబర్‌ 17, 1946న రాచరికం అంతమైంది. హైదరాబాద్  సంస్థానంలో భాగమైన తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైంది. కానీ, కష్టజీవుల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఎర్రజెండా వారసత్వం కొనసాగవలసిన ప్రాధాన్యత మరింత పెరుగుతున్నది. 

– ఎస్‌ వీరయ్య,
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు