కరీంనగర్, వెలుగు: తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను కొన్ని విచ్ఛిన్నకర శక్తులు వక్రీకరిస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతం పేరిట చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం పోరాడిన ఆనాటి యోధుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. నాటి యోధులు దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ధర్మభిక్షం గౌడ్.. వంటి ప్రజానేతల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కల్లోలిత ప్రాంతంగా ఉండేదని, ప్రస్తుతం ఎక్కడ చూసినా అద్భుతమైన రోడ్లు, జిగేల్ మనే విద్యుత్ లైట్లు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలతో హైదరాబాద్ తర్వాత మరో అద్భుత సిటీగా కరీంనగర్ విరాజిల్లుతోందని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్టూడెంట్స్ కల్చరల్ప్రోగ్రామ్స్, పోలీసుల మాక్ డ్రిల్స్ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ డాక్టర్ బి.గోపి, సీపీ సుబ్బారాయుడు, మేయర్ వై.సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు.
పెద్దపల్లి, గంగాధర, వెలుగు: పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఎమ్మెల్సీ భానుప్రసాద్జెండా ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డీసీపీ, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి నివాసంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, కొత్తపల్లి మున్సిపాలిటీలో చైర్మన్రుద్రరాజు జెండా ఆవిష్కరించారు.
దేశానికి దిక్సూచి తెలంగాణ
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని, మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ప్లానింగ్కమిషన్వైస్ చైర్మన్ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. సెప్టెంబర్17ను భిన్న ఆలోచనలతో కొందరు విమోచనం, విలీనం, విద్రోహ దినంగా పిలుచుకుంటున్నారని, తాము మాత్రం దేశంలో కలిసినందున జాతీయ సమైక్యత దినంగా ప్రకటించి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు.