పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయని హరీశ్ రావుకు రిపోర్టు 

 పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయని  హరీశ్ రావుకు రిపోర్టు 
  • ఆర్థిక మంత్రి హరీశ్​తో వివిధ శాఖల హెచ్ఓడీలు 
  • నిధులు ఇయ్యాలని విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ముఖ్యమైన స్కీములకు కూడా పైసలు ఇవ్వడం లేదని వివిధ శాఖల హెచ్ఓడీలు ఆర్థిక మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల చేయాలని మంత్రికి మొరపెట్టుకున్నారు. ఏయే శాఖలో ఎన్ని నిధులు అవసరం ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని రిలీజ్ చేశారు ? పెండింగ్ బకాయిలు ఎన్ని? ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీలు, భర్తీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెన్యూవల్ తదితర అంశాలపై హరీశ్ రావు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో డిపార్ట్ మెంట్లు అమలు చేస్తున్న స్కీములతో పాటు ఇతర పనులు పెండింగ్ పడ్డాయని ఆఫీసర్లు మంత్రికి చెప్పినట్లు తెలిసింది.

అన్ని శాఖల్లోనూ అంతే.. 

ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ‘‘మన ఊరు‌‌‌‌‌‌‌‌–మన బడి’’ పథకానికి రూ.7 వేల కోట్లకు పైగా ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం రూ.100 కోట్ల లోపేనని అధికారులు మంత్రికి రిపోర్టు ఇచ్చారు. నిధుల్లేక ప్రభుత్వ పాఠశాలల్లో సౌలతులు కల్పించే పనులు ఆగిపోయినట్లు పేర్కొన్నారు. దళితబంధుకు బీఆర్వో ఇచ్చారే తప్ప, ఇప్పటి వరకు చిల్లిగవ్వ విడుదల చేయలేదు. దీనికి రూ.17 వేల770 కోట్ల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెప్పినట్లు తెలిసింది. ఇక ఆసరా పథకానికి నిధుల సర్దుబాటుపై మల్లగుల్లాలు పడుతున్నారు. వచ్చే నెలలో కనీసం రూ.280 కోట్లు అదనంగా ఇవ్వాలని ఆఫీసర్లు ప్రతిపాదించారు. లేదంటే కొత్తవాళ్లకు పింఛన్లు ఆగుతాయని చెప్పారు. చాలా శాఖల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెండింగ్ లో పెట్టారు. దీనిపై ఆయా శాఖల అధికారులు ప్రస్తావించినట్లు తెలిసింది. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, స్కాలర్ షిప్స్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ స్కీమ్స్, పల్లె ప్రగతి, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్లకు ఇవ్వాల్సిన బకాయిలపై మంత్రికి అధికారులు వివరించారు.