నేటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరణ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి, పాతగుట్టలో మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు మంగళవారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఈ నెల 7న స్వస్తివాచనం, పుణ్యాహవచనంతో ప్రారంభమైన ఉత్సవాలు 3 రోజుల పాటు మేళతాళాలు, సన్నాయి వాయిద్యాల హోరులో పురోహితులు వైభవంగా నిర్వహించి, పరిసమాప్తి పలికారు. అనంతరం భక్తులు, ఆలయ సిబ్బందికి పవిత్రముల ధారణ చేశారు. ఏడాది నుంచి చేసిన తప్పొప్పులు తొలగిపోవడానికి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు చెప్పారు. ఉత్సవాల సందర్భంగా రద్దు చేసిన ఆర్జిత సేవలు నేటి నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఉత్సవాల్లో ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి, ఏఈవో భాస్కర్ ప్రత్యేక పూజలు చేశారు.
యాదగిరీశుడి సేవలో ప్రముఖులు
లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెస్ ప్రభాకర్ రావు, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి ఫ్యామిలీలతో కలిసి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్ ఊడెపు రాజు స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
తుంగతుర్తి, వెలుగు:- మండల కేంద్రంలో మంగళ వారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొమురం భీమ్, సేవాలాల్ మహారాజ్ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమృనాయక్, జిల్లా కార్యదర్శి రాజారాం నాయక్. సర్పంచ్‌లు గుగులోతు వీరోజి, లకావత్రాములు నాయక్, గిరిజన యువకులు పాల్గొన్నారు.
ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్
సూర్యాపేట, వెలుగు: పార్క్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న ఇద్దరు బైక్‌దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ నాగభూషణం కేసు వివరాలను వెల్లడించారు. మోతె మండలం కూడలి గ్రామానికి చెందిన బర్మావత్ మంగ్యా, చివ్వెంల మండలం మున్యా నాయక్ తండా కు చెందిన రమేశ్ ఇద్దరు స్నేహితులు. జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించేందుకు గత ఏడాది సెప్టెంబర్ నుంచి సూర్యాపేట, రాచకొండ, వైజాగ్, నల్లగొండ జిల్లాల్లో పార్క్చేసిన బైక్‌లను దొంగిలించి సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ లో పార్కింగ్ చేసి, అదును చూసి అమ్మేందుకు ప్లాన్వేసుకున్నారు. మంగళవారం నిందితులు పార్కింగ్ చేసిన బైక్ లలో ఒక బైక్ తీసుకొని బయటకు వెళ్తుండగా పోలీసులు బస్టాండ్‌వద్ద చెక్ చేశారు. వారిని చూసి పారిపోయేందుకు యత్నించగా.. న పోలీసులు మంగ్యాను అదుపులోకి తీసుకోగా రమేశ్పారిపోయాడు. మంగ్యాను విచారించడంతో బైక్ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పాడు. బైక్ లలో 5 సూర్యాపేట కు చెందినవి కాగా, 7 రాచకొండ, 2 వైజాగ్, 1 నల్లగొండ జిల్లాకు చెందినవిగా గుర్తించారు. బైకులను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ రాజశేఖర్, ఎస్సైలు శ్రీనివాస్, క్రాంతి కుమార్, యాకుబ్, సైదులు, క్రైమ్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మఠంపల్లి, వెలుగు: మండల పరిధిలోని గుండ్లపల్లి శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. మఠంపల్లి ఎస్సై రవి వివరాల ప్రకారం.. గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఆకారపు దేవభిక్షం(50) , మఠంపల్లి వైపు వెళ్తుండగా.. రఘునాథపాలెం కు చెందిన ముత్యాలంపాటి గాలిషా గుండ్లపల్లి వెళ్తున్నాడు. ఓవర్‌స్పీడ్‌తో బైకులు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొనగా దేవభిక్షం స్పాట్లోనే చనిపోగా.. గాలిషా కు గాయాలైనట్లు ఆయన తెలిపారు. మృతుడి భార్య కృప ఇచ్చిన కంప్లైంట్మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై తెలిపారు.
దేశభక్తిని పెంపొందించాలి
స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్గొండలో ఇంటింటికీ జాతీయ జెండా పంపిణీ ప్రారంభించిన మంత్రి
నల్గొండ అర్బన్, వెలుగు : దేశ భక్తి, జాతీయ సమైక్యతను, స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన మహనీయులు త్యాగాలను నేటి తరానికి వివరించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపాలిటీలో ప్రజా ప్రతినిధులు, అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ నాయకత్వంలో అహింసా పద్ధతిలో పోరాటం చేసి దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్న ట్లు ఆయన తెలిపారు. స్వాతంత్ర్య పోరాటం లో ఎందరో నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వివరించారు. పట్టణాలలో జాతీయ జెండాలను ప్రతి ఇంటికి వార్డు సభ్యులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న ఇంటింటా జాతీయ జెండా ఎగరేసి తమ దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఆఫీస్‌లో కౌన్సిలర్లకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అనంతరం పట్టణం లో 47 వ వార్డు లో జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఇంటింటా ఎగురవేస్తూ జాతీయ సమైక్యతను చాటాలన్నారు.
పార్క్, అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభం
కలెక్టర్ క్యాంపు ఆఫీస్ పక్కన మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేసిన ఎ మిరాల్డ్ పార్క్ ను ,అక్కడే మున్సిపాలిటీ ద్వారా పేదలకు 5 రూ.లకే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే, కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్.భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ యం. సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగొని రమేశ్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలి
ఏఐఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ స్టాలిన్
యాదాద్రి, వెలుగు: విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్స్టేట్ ప్రెసిడెంట్ స్టాలిన్ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో సంఘం జిల్లా మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లా డుతూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా వస్తువుల అభిలాష్, ఉప్పుల శాంతికుమార్ ఎన్నికయ్యారని చెప్పారు. సహాయ కార్యదర్శిగా చిప్పలపల్లి నవీన్, ట్రెజరర్‌గా మల్లెపాక జాని సహా ఐదుగురు ఆఫీస్ బేరర్స్, 13 మందితో కార్యవర్గం, 21 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు.
వజ్రోత్సవాలను సక్సెస్చేయాలి
సూర్యాపేట, వెలుగు: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా సక్సెస్చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 11న జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి నుంచి జిల్లాలోని 14 థియేటర్లలో స్కూల్విద్యార్థుల కోసం గాంధీ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదే విధంగా 22 వరకు జరిపే కార్యక్రమాలను వివరించారు. జాతీయ భావాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. డీఎస్పీ నాగభూషణం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
20 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత
తుంగతుర్తి, వెలుగు:- పర్మిషన్ లేకుండా బొలెరో వాహనంలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని మంగళవారం తుంగతుర్తి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై డానియల్వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రావులపల్లి తండాకు చెందిన వీరావత్ బీల్యానాయక్, భరత్, మధు అనే వ్యక్తులు తూర్పుగూడెం గ్రామంలో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని యాదగిరిగుట్ట మండలం లాప్యానాయక్ తండాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఏఎస్సై రాంకోటి, గోపీనాయక్, దీపక్ రెడ్డి పాల్గొన్నారు.
అనారోగ్య సమస్యలతో వృద్ధురాలు ఆత్మహత్య
నేరేడుచర్ల, వెలుగు: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన అనిరెడ్డి నాగమ్మ ( 63 ) అనారోగ్య సమస్యలను తట్టుకోలేక మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్ వివరాల ప్రకారం.. నాగమ్మ భర్త కొన్ని ఏండ్ల కింద చనిపోయాడు. కుమారుడు లచ్చిరెడ్డి ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోవడంతో పదేళ్లుగా నాగమ్మ ఒంటరిగానే జీవిస్తోంది. దానికి తోడు కొంత కాలంగా అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో మనస్తాపంతో రామపురం కోట్లగడ్డ వద్ద వ్యవసాయ బావిలో దూకి చనిపోయింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు డెడ్‌బాడీని బయటకు తీశారు. నాగమ్మ తమ్ముడు నారాయణ రెడ్డి కంప్లైంట్మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.