ఆస్పత్రి కట్టారు.. ఓపెనింగ్ మరిచారు

ఆస్పత్రి కట్టారు.. ఓపెనింగ్ మరిచారు

పాట్నా: పదేండ్ల కిందట రూ.5 కోట్లతో ఆ ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించారు. కానీ దాని ఓపెనింగ్ మాత్రం మరిచిపోయారు. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అందులో ట్రీట్మెంట్ అందలేదు. అంతేగాక.. బిల్డింగ్‏లోని ఆధునిక వైద్య పరికరాలు కిటికీలు, తలుపులు, ఇతర సామగ్రి అంతా మాయం అయిపోయింది. ఆ ఆస్పత్రి ఇప్పుడు లిక్కర్ స్మగ్లర్లు, అక్రమార్కులకు, దొంగలకు  అడ్డాగా మారిపోయింది. ఇది బిహార్‌‍లోని ముజఫర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌లో కొత్త ఆస్పత్రి బిల్డింగ్ దుస్థితి. 

చాంద్ పురా ప్రాంతంలో మంచి గవర్నమెంట్ ఆస్పత్రి కట్టాలని బిహార్ ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అనుకున్నట్లుగానే 2015లో రూ.5 కోట్లు ఖర్చు చేసి ఆరు ఎకరాల్లో 30 పడకల ఆస్పత్రిని  నిర్మించారు. అత్యాధునిక వసతులు కల్పించారు. ఇకపై మెరుగైన వైద్యంకోసం తాము 50 కి.మీ ప్రయాణించక్కర్లేదని స్థానికులు సంబరపడ్డరు. ఆస్పత్రి బిల్డింగును బిహార్ ఆరోగ్యశాఖ ఇప్పటికీ తన ఆధీనంలోకి తీసుకోలేదు. దీంతో దాదాపు లక్ష వరకు జనాభా ఉన్న చాంద్​పురా ప్రాంత ప్రజల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 

బిల్డింగ్ పరిస్థితి ఎలా ఉందంటే.. 

పదేండ్లుగా ఖాళీగా ఉండటంతో ఆస్పత్రి బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. కిటికీలు, డోర్ ఫ్రేమ్‌లు, తలుపులు, గ్రిల్స్, గేట్లు, కప్ బోర్డులు, కరెంట్ వైరింగ్ తదితర సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. మందుబాబులకు, స్మగ్లర్లకు, దొంగలకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగాయి. బిల్డింగ్ చుట్టూ అడవి ఉండడంతో గ్రామస్తులు ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నారు. 

దర్యాప్తు ప్రారంభం

ఆస్పత్రి  గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని సబ్ డివిజనల్ ఆఫీసర్ తెలిపారు. పదేండ్లుగా ఆస్పత్రిని ఓపెన్ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. దీనిపై దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాతే ఆస్పత్రి ఎవరి ఆదేశాలతో నిర్మించారు..? ఎందుకు ఓపెన్ చేయలేదనే ప్రశ్నలకు క్లారిటీ వస్తుందన్నారు.