అమెరికా రాజకీయాలు రసవత్తరమైన మలుపు తిరుగుతున్నాయి

అమెరికాలో రాజకీయాలు రసవత్తరమైన మలుపు తిరుగుతున్నాయి. అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్ ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని కలిపి వారు అమెరికన్ కాంగ్రెస్ గా పిలుచుకుంటారు. ప్రతినిధుల సభ బిల్లులను రూపొందిస్తే ఆ చట్టాలను సెనేట్ ఆమోదించవచ్చు లేదా నిరోధించవచ్చు. అమెరికా అధ్యక్షుడు చేపట్టిన నియామకాలను సెనేట్ సాధారణంగా ధ్రువీకరిస్తుంది. వాటిపై అధ్యక్షుడిని నిలదీసే అధికారం కూడా సెనేట్ కు ఉంది. కానీ, అలాంటి సందర్భాలు చాలా అరుదు. అమెరికాలో యాభై రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరేసి సెనేటర్లు చొప్పున ఆరేండ్ల పదవీ కాలానికి ఎన్నికవుతారు.  అంటే, మొత్తం100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతినిధుల సభలో మొత్తం 435 మంది సభ్యులుంటారు. ఇక ప్రతినిధుల పదవీ కాలం రెండేండ్లు. వారు చిన్న జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అధ్యక్షుని పదవీ కాలం నాలుగేళ్లు కాగా మధ్యలో రెండేండ్ల కొకసారి జరిగే కాంగ్రెషనల్ ఎన్నికలను వాళ్లు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని పిలుచుకుంటారు.  

పేపర్ బ్యాలెట్ల వినియోగం

అమెరికా రాజ్యాంగం, ఎలక్టర్లు ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారో ఆ పార్టీకి చెందిన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల అభ్యర్థులకు మాత్రమే ఓటు వేసి తీరాలనే నిబంధన విధించలేదు. ఫలితంగా, రాష్ట్రంలో ప్రజాదరణ పొందిన పార్టీ ఒకటి అయితే, ఎలక్టర్లు ఎంచుకునే అభ్యర్థి వేరే పార్టీకి చెందిన వారు కావచ్చు. ఇక్కడ మరో తిరకాసు ఉంది. కొన్ని రాష్ట్రాలు మాత్రం అటువంటి నిబంధన ఏర్పరచుకున్నాయి. ఎవరైనా ఎలక్టర్ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడితే సదరు ఎలక్టర్ కు జరిమానా విధించవచ్చు. అతడిని అనర్హుడిగా ప్రకటించి ప్రత్యామ్నాయ ఎలక్టర్ ను ఎంచుకోవచ్చు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నికై, పాపులర్ ఓటులో ఓడిపోయిన అభ్యర్థులున్నారు. చాలా ఏండ్ల క్రితం మూడుసార్లు, ఇటీవలి కాలంలో రెండు దఫాలు(2000, 2016లో) అలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఎలక్టోరల్ ఓట్ల మెజారిటీ ఏ అభ్యర్థికీ లభించకపోతే అధ్యక్షుడిని ఎన్నుకునే బాధ్యత ప్రతినిధుల సభ సభ్యులపైన పడుతుంది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులలో ఒకరిని ప్రతినిధుల సభ సభ్యులు అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. మిగిలిన ఇద్దరు అభ్యర్థులలో ఒకరిని ఉపాధ్యక్షుడుగా సెనేట్ సభ్యులు ఎన్నుకుంటారు. అమెరికన్ చరిత్రలో1824లో ఒకే ఒక్కసారి ఇలా జరిగింది. జాన్ క్విన్సీ యాడమ్స్ ఆ తరహాలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం మీద, అమెరికా అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కొంత గందరగోళంతో కూడుకున్నదేనని అనిపిస్తుంది. పైగా, అమెరికా ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ల వినియోగాన్ని సురక్షితమైనదిగా భావిస్తున్నది. దీంతో ఎన్నికల పూర్తి ఫలితాల కోసం  రోజుల తరబడి వేచి చూడాలి. 

ట్రంప్ అభ్యంతరాలు

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నిక మోసపూరితమైనదంటూ 2020లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ నానా యాగీ చేయడానికి ఇంతకుముందు చెప్పుకున్న జటిలమైన ప్రక్రియే కారణం. ప్రతినిధుల సభకు ఈ ఏడాది నవంబర్ 8న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి 218, డెమొక్రటిక్ పార్టీకి 212 స్థానాలు లభించాయి. దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో మొత్తం 435 కాంగ్రెషనల్ జిల్లాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అరిజోనా, నెవాడాలలో పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో గెలవడం ద్వారా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా డెమొక్రటిక్ పార్టీ సెనేట్ పై పట్టు సంపాదించుకోగలిగింది. సెనేట్ లో డెమొక్రాట్ల సంఖ్యా బలం 50 కాగా, రిపబ్లికన్ల బలం 49గా ఉంది. జార్జియా రాష్ట్రంలో ఆ రాష్ట్ర నిబంధనలకు అనుగుణంగా రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులలో ఎవరూ కూడా యాభై శాతం ఓట్లు సంపాదించుకోలేకపోవడంతో ఎన్నిక డిసెంబరుకు వాయిదా పడింది.

మన దేశంలో మాదిరిగానే (సాధారణంగా నిష్పక్షపాతంగా ఉండే లేదా ఉండాల్సిన స్పీకర్ కీలకమైన ఘట్టాలలో తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రభుత్వాలను గట్టెక్కించినట్లుగానే) అమెరికాలో ఉపాధ్యక్షుడు (ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్) సెనేట్ లో ఓటు హక్కు ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని కాపాడగల అవకాశం ఉంది. ఈ మిడ్ టర్మ్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలోకి తిరిగి దిగుతానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అభ్యర్థిత్వాన్ని తెలియబరుస్తూ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్​కు ఆయన పత్రాలు సమర్పించారు. ట్రంప్ ను అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అనుకోవచ్చా అంటే అప్పుడే ఔనని చెప్పలేం. ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధులు సేకరించుకునేందుకు మాత్రం ఈ పత్రాల సమర్పణ తతంగం ఆయనకు వీలు కల్పిస్తుంది. ట్రంప్ మాత్రం “అమెరికా గత వైభవాన్ని తిరిగి అందిపుచ్చుకునే ప్రక్రియ ఈ క్షణం నుంచే మొదలవుతోంది. మన దేశాన్ని కాపాడడానికే నేను నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నాను” అని చెప్పుకున్నారు.  

విధానాలు, నినాదాలు

దేశ ప్రయోజనాల విషయంలో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు రెండూ ఏకమవుతాయి. పార్టీ అవసరాలకన్నా దేశ ప్రయోజనాలే మిన్న. ఇది లేని కొన్ని దేశాలకి అమెరికాది ఒంటెత్తు పోకడగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి, మిగిలిన దేశాలు కూడా వాటి ప్రయోజనాల దృష్ట్యా ఫలానా అంశంపై తమ దేశం ఫలానా వైఖరిని తీసుకుంటోందని ధైర్యంగా చెప్పగలగాలి. అంతేకానీ, అమెరికాని ఆడిపోసుకుని ప్రయోజనం లేదు. గతంలో అణు శక్తి పరీక్షలు, బాలాకోట్ లో తీవ్రవాద శిక్షణ శిబిరాలపై దాడి, ఇటీవలి కాలంలో రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో బీజేపీ ప్రభుత్వాలు అటువంటి తెగువను చూపి శెభాష్ అనిపించుకున్నాయి.

జో బైడెన్ నేతృత్వంలోని వారు వామపక్ష-ఉదారవాద ప్రజాస్వామికవాదులుగా పేరుకెక్కారు. ప్రభుత్వం భుజానికెత్తుకున్న ప్రజారోగ్య రక్షణ కార్యక్రమాలను విస్తరింపజేయాలని వారు కోరుకుంటున్నారు. గర్భస్రావ హక్కు రక్షణ కూడా వారి ప్రధాన విధానంగా ఉంది. అవివాహిత ఒంటరి మహిళల్లో ఎక్కువ శాతం మంది అనుకూలంగా మొగ్గు చూపడం వల్లే ఇటీవలి మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్లకు డెమొక్రాట్లు గట్టి పోటీ ఇవ్వగలిగారని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.

- మల్లంపల్లి ధూర్జటి సీనియర్ జర్నలిస్ట్